తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 21 December 2024

సమయోచిత పద్యరత్నము – 37

 

ఉత్పలమాల:
పాలకుడెవ్వడైన తన ప్రక్కన వానిని బాగ మెచ్చుచున్
మేలుగనుండు స్థానమున మెండుగ నుండగ జేసి, దానిపై  
జాలని క్రింద ద్రించ దిగజారుచు, మీదట  తూలనాడుగా
మేలుగ మర్మముల్ దెలిసి మెట్లుగ మెట్లుగ వృద్ధి నీవలెన్.



Friday, 20 December 2024

సమయోచిత పద్యరత్నము – 36

 

శార్దూలము:
ఏపాదమ్మున గంగబుట్టె నదియే యిప్పొద్దు నీకండరా!
మాపాపమ్ముల ద్రుంచుమంచు మదినే మందారపుష్పమ్ముగా
దీపమ్ముల్ మరి ధూపమంచు నిడుచున్ తీరైన సధ్బావనన్
తాపమ్ముల్ సరి దీర్చుమంచు హరినే దైవమ్ముగా గొల్వుమా!


Thursday, 19 December 2024

సమయోచిత పద్యరత్నము – 35

 

ఉత్పలమాల:
చల్లని మంచినీరు మరి జారగ గొంతున హాయినిండుగా
చల్లదనమ్ము నిచ్చునుగ సాదిన గంధము తాప వేళలన్
చల్లని చెట్టునీడ గన సంతస మందుదురెండలన్ నరుల్  
చల్లగనౌగ యుల్లమది చక్కని  తేనెల జల్లు మాటతో.


Wednesday, 18 December 2024

సమయోచిత పద్యరత్నము – 34

 

(కోవిడ్ సమయంలో వ్రాసినది)

మత్తేభము: 

స్తవనీయుండగు జానకీపతి తగన్ తాభద్ర శైలమ్ముపై

నవనీజాతను బట్టువేళ గనగా నయ్యో నరుల్ లేరనెన్ 

దివిదేవుల్ దిగ శాంతిగల్గు ప్రజకున్  దీవింప రారండనన్  

భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.


Tuesday, 17 December 2024

సమయోచిత పద్యరత్నము – 33

 

ఉత్పలమాల:
మానవ! యీ వసంతమున మానసమందును హాయి నిండుగా
పైనను నింగి దాకునటు బారుగ నిల్చిన పొన్నలున్ పొదల్
తేనియలూరు మామిడుల తీరగు తోపుల జేరి కూయగా
వీనుల విందుగాద పలు వేలుగ జిల్కల, కోకిల స్వరాల్.



Monday, 16 December 2024

సమయోచిత పద్యరత్నము – 32

 

మత్తేభము:
సరియుత్సాహము గల్గినట్టి నరునిన్, సద్బుద్ధి తోడన్ సదా
గురి తా దల్చుచు గార్యముల్ సలుపుచున్, కొండంత దైర్యమ్ముతో
మరువన్ జాలక మేలు, దేవుని నుతుల్  మౌనంపు ధ్యానంబిడన్    
సిరి తా మెచ్చుచు వాని చెంతకు దగన్ జేరంగ వచ్చున్ గదా!


Sunday, 15 December 2024

సమయోచిత పద్యరత్నము – 31

 

చంపకమాల:  
కలిగిన కష్టముల్ మరియు గానగ నుండని నష్టముల్, సదా
తలపున జీకటుల్ గిరుల దాటగలేమను భీతివీడుచున్
గెలుపది నిశ్చయంబనుచు, గ్రీడగ బోరగ  నాత్మశక్తితో
వెలుగు, జయంబు దక్కునిక, వీడక పట్టును సాగిపొమ్మికన్.




Saturday, 14 December 2024

సమయోచిత పద్యరత్నము – 30


ఉత్పలమాల:
జ్ఞానముగల్గు సత్వగుణ సజ్జను కెప్డు, రజోగుణమ్ముచే
దానను లోభమున్ గలుగు దప్పక, నున్న తమోగుణమ్ము య
జ్ఞానము తోడనా భ్రమ యజాగ్రతయున్ మరపన్నదౌనుగా
మానవ నైజమే యదియు మానగ సాధన జేయగావలెన్.


Friday, 13 December 2024

సమయోచిత పద్యరత్నము – 29


ఉత్పలమాల:
చేతుల శుభ్రతన్ గడిగి చేరి గృహమ్ముల నుండగా బ్రజల్  
చేతలు గొప్పగా గలిగి శీఘ్రము దా ముభయాంధ్ర పాలకుల్
భీతినిబాప, బూనిరిగ పీడ "కరోనను" బారద్రోలగన్    
చేతులు మోడ్తు "శ్రీ" హరికి  జేయగ స్వస్థత  దెల్గు నేలలన్.


Thursday, 12 December 2024

సమయోచిత పద్యరత్నము – 28

 

ఉత్పలమాల:
పూతను బూచె, వేప నటు బోవుచు గోసెడు వారు లేరుగా
లేతగ గాచె మామిడులు, లేరుగ ద్రెంపగ వచ్చువారలే
కూతలు గూయ జాలిగొని కోయిలలన్నియు మూగవాయెగా
మూతలుబడ్ద తల్పులను మూల జనాళిని జూచి శార్వరీ!


Wednesday, 11 December 2024

సమయోచిత పద్యరత్నము – 27

 

స్వాగతమమ్మ నీకునిక శార్వరి వత్సర రూప ధారిణీ!
యేగుచు నా 'వికారి' చెడు నిచ్చుచు సాగెనులే "కరోన" తో
మాగతి జూడుమమ్మ, పరమౌషధ మొక్కటి నందజేసి మా
సాగెడి జీవితాన రుజ జావగజేయుమ వైద్య రూపివై.


Tuesday, 10 December 2024

సమయోచిత పద్యరత్నము – 26

 

శార్దూలము:
ఏయే కాలమునందు నేది గలదో? యే మూర్తమం దేదియో?
ఏయే చోటున నేది వచ్చునొ? నదే యే దేశమున్ గల్గునో
కాయంబందిన వారిజాతక విధిన్ కాలమ్ము తానిచ్చుగా
ఆయావేళల లాభనష్టము, శుభంబా హానినిన్ మృత్యువున్.


Monday, 9 December 2024

సమయోచిత పద్యరత్నము – 25

 

   
ఉత్పలమాల:    
ఎక్కడినుండి వచ్చినదొ? యిట్టుల దేశములన్ని దాటుచున్
పెక్కురి ప్రాణముల్ గొనుచు భీకర మౌచును, కానుపింపకన్
టక్కరిదౌ "కరోన" యకటా! భయమందకు శౌచ శుభ్రతల్
జక్కగ మీర, దానికిక సాగక నాటలు సాగిపోవుగా.


Sunday, 8 December 2024

సమయోచిత పద్యరత్నము – 24

  

మత్తేభము:  

అవమానంబులు మానముల్ తెలియగా నాశీతలోష్ణమ్ము,లీ

యవనిన్ శత్రుల మిత్రులందు వినరా యా నింద, స్తోత్రమ్ము, గౌ

రవముల్, ఘోరపరాభవమ్ము, గెలుపుల్ రానట్టి వేళన్, భళా

స్తవనీయుండగు నొక్కలాగున ధరన్ తా భక్తితో నిల్వగా.

Saturday, 7 December 2024

సమయోచిత పద్యరత్నము – 23

 

 
చంపకమాల:  
అడిగినదాని లేదనక నట్టిటు జూచుట, జాగుసేయుటల్
వడివడి జెప్పకుండ నొకవైపుగ నేగుట, నేలజూచుటల్
చిడిముడిజేసి కన్ బొమలు చీదర జూపుట, ప్రక్కవారలన్
పడిపడి గోరగాను పలువార్తల, నయ్యది "లేదనే" సుమా!

Friday, 6 December 2024

సమయోచిత పద్యరత్నము – 22


ఉత్పలమాల:
ఎంతటి దుష్టులైన మరియెంతటి దోషము లున్న వారలన్
సుంతయు వారిగూర్చి తెగ సోదిని జెప్పుట తూలనాడుటల్
ఇంతయు భావ్య మౌన? కన నింతయు సాయము జేయకుండగా  
నంతగ హానిజేయ మనకౌనిక హానియు నంతకంతగా.


Thursday, 5 December 2024

సమయోచిత పద్యరత్నము – 21

 

 
ఉత్పలమాల:
పెట్టిన నాడు పూజ్యుడని పేర్మిని హారతి బట్టుచుంద్రుగా
గట్టిగ దైవమంచు తగ గైతలు జెప్పుచు నుంద్రు, వారలే
తిట్టులదండకమ్ము మరి తీరుగ నందుచు గ్రోధమందుచున్
పెట్టనినాడు దూరుచును బెట్టగ జూతురు దూరమందునన్.



Wednesday, 4 December 2024

సమయోచిత పద్యరత్నము – 20

 

చంపకమాల:
భుజములనెన్మిదిన్ గలిగి పూచిన పద్మము వామహస్తమున్
నిజముగ దక్షిణంబు మరి నిండగు బిల్వము బట్టి దేవి, యం
బుజమున గూర్చునుండ బలు భూషణ ధారిణి, రెండు ప్రక్కలన్
గజములుజేరియుండు, సరి గావగ గొల్తురు యక్షులాదిగన్.


Tuesday, 3 December 2024

సమయోచిత పద్యరత్నము – 19

 

     
చంపకమాల:
సదమల భక్తి తోడ మది సాధన జేయుచు కీర్తనంబులన్
వదలక నీవెదిక్కుయన, పాడుగుణమ్ములు పారిపోవుగా
పదములబట్టి శ్రీహరిని బ్రార్థన జేయగ, జుట్టుముట్టు యా
పదలను మట్టుబెట్టుచును భద్రము గాచును దేవదేవుడే.


Monday, 2 December 2024

సమయోచిత పద్యరత్నము – 18

 

చంపకమాల:

కన 'మది' క్షేత్రమౌను, సరి కల్పన నాగలి, దాని దున్ని యో

చన లను విత్తనమ్ములను శ్రద్ధగ జల్లి సకాలమందునన్

ఘనమగు ధ్యానవర్షమున  గ్రమ్మగ జేసిన సేద్యమిద్ధరన్

మనమున నీతి, శీలతయు, మాన్యత, స్వచ్ఛత పంట పండుగా. 


సమయోచిత పద్యరత్నము – 17

 

చంపకమాల:

సిరిగలవాడె సర్వమును జెప్పగ జ్ఞానము యున్నవాడగున్ 

సిరిగలవాడె భాషణము జక్కగజేయగ గల్గు నిద్ధరన్

సిరిగలవాడె పెద్ద, కులశేఖరు డౌగద, కాలమిట్టిదే

సిరిగలవానిచెంతకిక జేరు గుణమ్ములనున్ జనమ్ములే.