తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 29 November 2023

"గోలీ"లు 75-79

 "రవళి" మాసపత్రిక రెండవ సంచిక (డిసెంబర్ 2023) నందు ప్రచురించబడిన నేను వ్రాసిన పద్యములు.

 

"గోలీ"లు

 

కందము:

శ్రీమంతుడ నాకేమని 

ధీమాగా కష్టబడక తినికూర్చుంటే

 మంచువోలె కరుగును

చీమంతగ మారు నీదు సిరులే గోలీ!

 

కందము:

పొటీలో గెలుపునకై 

ధాటిగ యత్నించవలయు ధర్మంబుగనే

ఓటమి జెందిన గానీ

ఆటన్ సహజంబనుకొన నగురా గోలీ!

 

కందము:

వండే వంటలు శుచిగా

నుండంగను జేయవలయునుర శుభ్రతగా

"వండే" దాటిన పిదపను

మొండిగ హీట్జేసి తినగబోకుర గోలీ!

 

కందము:

తీయనిదౌ కంఠమ్మే

గాయకునకు నున్న సొగసు కాదులె, భాషన్

హేయముగా పలికి పరువు  

దీయనిదౌ నటులనుంట దివ్యము గోలీ!

 

కందము:

సలుపుచు  నుండుము ధర్మము

నిలలో బోరంగవలయు నిది చేయుటకై

సలుపులు కలిగినగానీ

మెలకువతో సైచి దాట మేలగు గోలీ!  

 

Saturday, 18 November 2023

నన్నయ

 నన్నయ సహస్రాబ్ది మహోత్సవముల సందర్భంగా కుర్తాళం శ్రీ సిద్దేశ్వర పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహా స్వాముల వారి దయతో 10-11-2023 న గుంటూరునందు ఏర్పాటు చేసిన కవితా గోష్టి లో నేను వ్రాసి చదివిన పద్యాలు.

స్వామి వారి ఆశీస్సులు కోరుతూ... 

కందము: 

కుర్తాళం పీఠాధిప

మూర్తిగ పుంభావమైన ముఖవాసినిగా 

కీర్తిగడించిన స్వామీ 

ఆర్తిగ నేవేడెదనిక నాశీస్సులనే.

-----------------------------------

నన్నయ భట్టారకుని గురించి.... 

కందము:

ఆదికవియగుచు తెనుగున

మీదగు జ్ఞ్ఞానమ్ము బంచి మెచ్చగ బుధులే   

మీదట రాగల కవులకు

రాదారిని జూపినావు రమ్యముగానే.


శార్దూలము: 

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ యనుచున్ శ్రీకారమున్ జుట్టుచున్

ఆ వేదమ్మును బోలు భారతమునే ఆంధ్రమ్మునన్ వ్రాయగా 

నీ వాక్కుల్ ఘన పద్యరాశి యగుచున్ నిర్మాణమై కావ్యమే 

నీవే తెల్గున నాదియైన కవిగా నిర్దేశముల్ జేసెగా. 


కందము: 

నన్నయ్యవు నీవే లే

అన్నయ్యవు తెల్గుకవుల కందరకును నీ

యున్నత కవనపు పద్యా

లెన్నగ నీభువిని నిలచునిక వేయేండ్లున్.   


Sunday, 12 November 2023

పండుగ దీపము

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.


ఉత్పలమాల: 

జీవన యానమందునను చిక్కటి చీకటి క్రమ్ముకొన్న నీ

భావన లందు ధైర్యమును బారగనీయక, నేడు వచ్చె దీ 

పావళియంచు నోర్మియను పండుగ దీపము వెల్గజేయగా 

త్రోవన వచ్చి కార్తికము తోషపు వెన్నెలలందజేయుగా. 


Wednesday, 11 October 2023

బెండ - బీర - దోస - కాకర, దత్తపది

 


10-10-23న "శంకరాభరణం" లో ఇచ్చిన దత్తపది కి నా పూరణ.

బెండ - బీర - దోస - కాకర, పదాలను అన్యార్థంలో 

మహాభారతార్థంలో స్వేచ్ఛా చందం.


శ్రీకృష్ణుడు దుర్యోధనునితో.....


తేటగీతి: 

బీరముల నాపి రారాజ వీడులైదు 

బంచ దోసమ్ములన్నియు నెంచబోరు  

కాక రణమును గోరగా గలుగు మీకు 

పాండు వీరులు బెండాడ పరిభవమ్ము.



Saturday, 7 October 2023

ఘంటసాల పాటల "కందాలు" - 117

  

కందము: 

"ధనమేరా అన్నిటికీ"

వినగా నీపాటజాలు, విపులముగానే

ధనమును గూరిచి తెలియును

ధనలక్ష్మిని యదుపుజేయ దలపే కలుగున్. 



Thursday, 5 October 2023

ఘంటసాల పాటల "కందాలు" - 116

  

కందము: 

"కిలకిల నవ్వులు చిలికిన"

పలుకును నాలోన వీణ బంగరు దనుచున్

చెలియలితో సరసములను 

సలిపెడు పాటవిన తీపిజ్వాలయె రగులున్. 


Thursday, 28 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 115

 


కందము: 

"నిలువుమ! నిలువుమ!" నీక

న్నుల చల్లని నీలినీడ నుండుచు, పోనీ

చెలి నామనసే నిదురను 

వలపుల కవ్వింపు పాట వహ్వా!వహ్వా!




 


Wednesday, 27 September 2023

"గోలీ"లు - 74

 


కందము: 

అరువది తెచ్చుట కళయే

అరువదినాల్గగు కళలనె యదియొకటేమో!

కరవున దెచ్చిన యరువును

కరవకమును దాని దీర్పగావలె గోలీ!



Saturday, 23 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 114


కందము:  

"సందేహించకుమమ్మా"

సుందర రఘురాము ప్రేమ, సుచరితుడనుచున్

పొందికగా బాడితి వహ!

పొందగ తోషమ్ము మేము పూర్తిగ వినగా.


 

  

Monday, 18 September 2023

వలదు వలదు

  

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః


సీసము: 

ఓ బొజ్జ గణపయ్య! యొకనాటికిన్ నాకు  

బానరూపున పొట్ట వలదు వలదు

ఏకదంతుడ! నాకు నేవేళ జూడగా 

పండ్లూడు స్థితిగల్గ వలదు వలదు 

గుజ్జురూపస్వామి! గూనియు మరుగుజ్జు

వంటిజన్మయె నాకు వలదు వలదు

ఎలుకవాహ! కడుపు నేవేళ నెలుకలే 

పరుగెత్తు బాధలే వలదు వలదు


ఆటవెలది: 

విఘ్నరాజ! ఘోర విఘ్నమ్ములేవియు 

పనుల జేయువేళ వలదు వలదు

సిద్దిబుద్ధినాథ! సేవింతు, సద్బుద్ధి 

వరమునిమ్ము మరువ వలదు వలదు.




 

 


Thursday, 14 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 113

 

కందము:

"తొలివలపే పదె పదె" నను

పిలిచే యెదలోనజేసె ప్రియ! సందడినే

చెలియా! యనుచును బాడగ 

వలపులు గలుగుచును మదియె పరవశమగుగా.  



Tuesday, 12 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 112

  

కందము: 

"ఈ మౌనం ఈ బిడియం"

ఏమీ యాపాట వినగ నిక మౌనంగా

ప్రేమికులుందురె  పాడక?

గోముగ నేకాంతమందు గుసగుసలిడకన్. 


Sunday, 10 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 111



కందము: 

"ఏనుంగునెక్కి" పద్యము

వీనులబడినంత మాకు వేడుక గలుగున్

ఆ "నర్తనశాల" సినిమ 

మానసముల చివరి "సీను" మస్తుగ మెదలున్. 



Wednesday, 6 September 2023

"గోలీ"లు - 73


కందము: 

ఊరకనుండునె కాయము

మీరుచు తా బెరిగిపోవు మిక్కుటముగనే

ఊరకనుండక నేదో

తీరిక లేనట్టి పనుల తిరుగుము గోలీ! 




Wednesday, 23 August 2023

చంద్రయాన్ - 3 విజయం

 చంద్రయాన్ - 3 విజయం సాధించిన  ఇస్రో శాస్త్రవేత్తలు అందరికి అభినందనలు.

కందము:

ఇస్రో కో జయ్ జయ్ హో

ఇస్రోజ్ భారత్ కొ బహుతు యిజ్జత్ బఢెహై 

ఇ స్రోనే దేశోం కో

ఛ స్రోనేదో హమార శాల్యూట్ లేలో!


---గోలి.👏👍🙂

Thursday, 17 August 2023

"గోలీ"లు - 72

 

కందము: 

పిల్లలు పెనిమిటి గలిగిన 

ఇల్లాలే యిలను జూడ నింటికి వెలుగౌ

ఇల్లాలు "వెల్" గ లేదా 

"ఇల్లాల్" గామారుదురిక నింటను గోలీ.



Thursday, 10 August 2023

"గోలీ"లు - 71

 కందము: 

పర పతి గూడుట మరియున్

పర సతినే గూడుటయు "యెఫైరది" భువిలో

పరగన్ చెడుగతి యగునది 

పరపతి నేగాల్చుటకు "యె  ఫైరది" గోలీ! 



Tuesday, 8 August 2023

దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్

 8-8-2023 న "శంకరాభరణం"నందు ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


ఒక చోరుని స్వగతము.

కందము: 

పోవలె,శిఖరాగ్రముపై

కావలి లేనట్టి కోట కలదులె, నిధులే

కావలె, త్రవ్వగ నట నా 

దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్.

Monday, 7 August 2023

ఘంటసాల పాటల "కందాలు" - 110

 


కందము: 

"నీ కొండకు నీవే" యని

యా కొండలరాయని మదినార్తిగ వేడన్ 

తా కొండకు రప్పించుక 

చేకొనుచును మ్రొక్కులన్ని చేయూతనిడున్. 


Saturday, 29 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 109



కందము: 

"నరుడే యీనాడూ వా

నరుడైనా"డనెడి పాట నాడున్ నేడున్

ధర నూతనమై వినబడు

నరుడే మారడు మనుజుల నరు డేమార్చున్. 



Wednesday, 26 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 108



కందము:

ఆ  "యత్తలేని కోడల"

హా యుత్తమురాలెయనుచు నాకోడల్లే

నాయత్తయె గుణవతియను 

మాయుల్లములలరు పాట మరువగ గలమా?





Saturday, 22 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 107

 


కందము: 

"కుడియెడమైతే" పాటను

వడగాలికి సిగను పూవు వలదనియనుచున్

విడి మార్గము లేనప్పుడు

సుడినీదుట యేల, మునక సుఖమని తెలిసెన్.



Friday, 21 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 106

 


కందము: 

"కలయిదనీ నిజమిదనీ"

తెలియదులే బ్రతుకిదింతె తెలియుండనుచున్

కలవరపడు మనుజులకే

కల, నిజముల దెలుపు పాట కదరా! వినగా.


Thursday, 20 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 105

 


కందము: 

"ఒసె వయ్యారీ రంగీ!"

అసలా పాటను విషాద మగు బాణీలో

సిసలుగ బాధను మ్రింగుచు

పసగానే పాడినావు భారపు మదితో. 

 

Tuesday, 11 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 104

 


కందము: 

"చెలికాడు నిన్నె రమ్మని

పిలువా" చేరవ యనుచును ప్రియురాలిని తా

వలచిన ప్రియుడే పాడగ

కిలకిల నవ్వుచును చెలియ క్రీగంటగనున్.



Sunday, 9 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 103

 


కందము:

"నినునేను మరువ లేనుర"

వినరారా! నా పొలీసు వెంకటసామీ!

కన పంచదార నీవం

చును పాడినపాట తీపి శ్రోతకు పంచున్. 


Thursday, 6 July 2023

ఘంటసాల పాటల "కందాలు" -102



కందము: 

"బడిలో యేముందీ" యని

గుడిలో నేముంది యనుచు గొప్పగ పాటన్

బడి,గుడి గొప్పలు మనసుల 

బడి, గుడికొని యుండునట్లు పాడితివయ్యా!


 

 


Wednesday, 5 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 101

 

కందము: 

శివతాండవ స్తోత్రమ్మది 

భవుడే తానెదుట నిలచి వరమిడునట్లున్ 

భవదీయ కంచు కంఠము

స్తవనీయుని నీలకంఠు సన్నుతి జేసెన్. 




Tuesday, 4 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 100


కందము: 

"సందేహించకుమమ్మా"

విందగు నాపాట  మాకు వీనులకెపుడున్

వందల మారులు వినదగు 

వందనములు ఘంటసాల! వందనమయ్యా!




Monday, 3 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 99

 కందము: 

"ఓహో! మోహనరూపా!"

ఆహా యాపాట వినగనా హరి లీలల్ 

హేహే! మదిలో మెదలును

జోహారులు ఘంటసాల జోతలు నీకున్.


Saturday, 1 July 2023

ఘంటసాల పాటల "కందాలు" - 98

 


కందము: 

"ఓ చంద మామ" యనుచును

ఆ చెలి యందాలభామ యటనెట నుండెన్

చూచుచు జెప్పుమ మనసే

దోచినదని దెల్పు పాట దోచును మదినే.


 

Friday, 30 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 97


కందము:

"అదిగో నవలోక"మ్మని

హృదయములే విడకనుండదేదో లోక 

మ్మిదెసాగుదమని పాడుచు

నెద కమ్మని కలలుగందు రిల ప్రేమికులే.


Thursday, 29 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 96


కందము: 

"ఓచెలి! కోపమ?" పాటయు

ఆ చిలిపి పలుకుల హరియె యలుకల సత్యన్

తాచిన పాదము నొత్తుచు

తా చెప్పిన పద్యమాహ! తాకును మదినే.



 

Wednesday, 28 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 95

 


కందము: 

"చిటపట చినుకులు పడుతూ"

అటునిటు ముద్దయి తడిచిన యావేళలలో

నట బాడుదు రీగీతము

నటనేయొక చెట్టునీడ నహ! ప్రేమికులే.

Monday, 26 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 94

  


కందము: 

"మనసుగతి యింతె" యనుచును

మనిషిది బ్రతుకింతె యనుచు, మనిషికి మనసే

వినరా తీరని శిక్షని

మనసును కదలించు పాట మరువగ గలమా?


Saturday, 24 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 93



కందము: 

"ఆ రజనీకర మోహన"

తీరుగనాగీత మెపుడు తీయగనుండున్

ఆ రాణియె "తల" నిండి, మ

జారే! పూదండ దాల్చి సరి మురిపించున్.




Thursday, 22 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 92

 కందము: 

"వెలిగించవె చిన్ని" యనుచు

వలపుల దీపమ్మననుచు పాడిన విధమే

యల చివరి వరకు వినగను  

లలితముగా సాగు మనసు రంజిల్లునులే.


 

Wednesday, 21 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 91

 

కందము: 

"బుల్లెమ్మ సౌఖ్యమేనా"

పిల్లా గుబులాయనె యని ప్రియముగ ప్రియుడే

యల్లరి జేయుచు చెలినే

గిల్లినయట్లుండు పాట "కెవ్వున్ కేకే". 



 


Tuesday, 20 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 90

 


కందము: 

"ఇదె చంద్రగిరీ" యనగను 

ముదముననా తిమ్మరాజు ముచ్చట, తీరౌ

కదనము, కీర్తి సిరి కథయు

పిదపను గత వైభవమ్ము ప్రియముగ మెదలున్.


  



Monday, 19 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 89


కందము: 

"జగమే మాయా" పాటను

నిగమములలొ సారమంత నిజముగ తెలుపన్ 

వగయే సౌఖ్యమ్మనియెడు

తగుభావన మదిని  నిలచి  తా ముదమందున్.



Friday, 16 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 88

 

కందము: 

"ఏవమ్మ నిన్నెనమ్మా"

బావున్నారా యనుచును పల్కుల పాటన్

చేవగ బాడితివట, విన

మావదనము విచ్చుకొనును మరిమరి గోరున్.



Thursday, 15 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 87

 


కందము: 

"వలపువలె తీయగా" విన

'తలుపులు మూయంగ నీకు తత్తరపాటౌ

జిలిబిలి నడకల సఖి' యన 

కలికిది బిత్తరపు చూపు కదలును మదిలో.



Wednesday, 14 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 86

 

కందము: 

"సిగలోకీ విరులిచ్చీ"

సిగపూవది వాడకుండ చెలియది బ్రతుకే

వగజెందగ వాడెననుచు 

తెగబాధగ బాడు పాట తీరే వేరౌ.


Tuesday, 13 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 85

  


కందము: 

జిల్లాయిలె జిల్లాయిలె

బుల్లోడూ పాతికేళ్ళ బుజ్జాయనగా 

బుల్లెమ్మా చంక దిగని

బుల్లీపాపాయన విన పొంగును మనసే. 


Friday, 9 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 84

 కందము: 

"నా జన్మభూమి యెంతా"

భూజనులే మెచ్చుపాట, పుణ్యచరితుడా!

మాజన్మధన్యమే విన 

హా!జీ! నాసామిరంగ హాయ్!హాయ్! హోయ్! హోయ్! 


-


Thursday, 8 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 83

 


కందము: 

"ఏమోయేమో యిది" నా

కేమేమో యైనదనుచు నీవేళననన్ 

ప్రేమగ నేదో గుబులౌ 

మామది 'గిలిగింత పాట' మైమర"పిడుగా" 




Wednesday, 7 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 82

 

కందము: 

"నారాయణ నీలీలా"

"భారతమున" నిట్టి చిన్ని పాటన్ వినగా 

కౌరవ, పాండవ, యాదవ

వీరుల జన్మమ్ము తెలియు వీనుల విందౌ.



Tuesday, 6 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 81

 


కందము: 

"ఎవరికి తలవంచకు" మని

ఎవరిని యాచించకనుచు నెన్నియొ సూక్తుల్

భువి నరులకు జెప్పిన యా 

నవగీతము జూపుమాకు నవ్యపథమ్ముల్. 


Monday, 5 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 80

 

కందము: 

"బులిబులి యెర్రని బుగ్గల"

చెలి  చారెడు నీ కనులవి చెంపకననుచున్

చిలిపిగ పాడిన విధమే

తలపున నిలచును, వినగను తలనూగించున్.




Saturday, 3 June 2023

"సిస్టర్" నర్స్

 12 మే 2023  ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా  అమరావతి సాహితీ పీఠం (శ్రీ రావి  రంగారావు గారు) గుంటూరు వారు నిర్వహించిన పోటీకి నేను పంపిన పద్యాలు.(ఈ బుక్ "తెల్లపావురాలు" లో ప్రచురించినారు)  


"సిస్టర్" నర్స్ 


కందము: 

దైవమె వైద్యుడు పుడమిని

దేవుని దూతలు నిజముగ తెలియగ నర్సుల్ 

సేవల జేయుచు రోగుల 

"చావక" బ్రతికించబూను "శక్తులు" వీరే.


ఆటవెలది: : 

చెల్లిగాని చెల్లి యెల్లరు నరులకు

అక్కగానియక్క యక్కరలకు 

సోదరీమెయగుచు "సో' దరి నిలచును

సిస్టరనగ తాప్రసిద్ధినొందె.


ఆటవెలది: 

పుట్టి కళ్ళు తెరచి పుడమి జేరుటనుండి

మట్టిలోన గలసి మడియు వరకు

నట్ట నడుమ జీవనమ్మున రుజలందు

సేవ జేయు మనల "సేవు" జేయు. 


తేటగీతి: 

మంచమున బడ తనవారు మరువ సేవ

సమయ మింతయు లేదని సణుగు వేళ

చెల్లి పోవుచు బంధముల్ చెడిన నాడు 

"చెల్లి" చూచును మనుజుల నొల్లననక. 


కందము: 

"సిస్టరు" సేవలు రోగికి 

"బూస్టరుడోసౌ"ను బ్రతుకు పొడిగింపంగా

"బెస్టు"ర రోగము దులుపగ  

"డస్టరు" తానౌను, చిన్న డాక్టరు తానౌ. 


కందము: 

ఆ "నర్సు" సేవ మరువక  

"ఆనర్సు"ను సలుపవలయు నవనిని వినరా!

"మేనర్సు" గలిగి నరులే 

"డోనర్సు"గ క్షేమమెంచుడు మరికనైనన్.




ఘంటసాల పాటల "కందాలు" - 79

 


కందము: 

"తిరుమలగిరివాసా!"యని

వరదాభయ చిద్విలాస! పరదైవమనిన్

సిరిగలవాడా! యనగా  

దరిజేరుచు బ్రోచుటకును తా దిగిరాడా! 




Friday, 2 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 78

 


కందము:

"తిరుమల మందిర సుందర"

కరుణా సాగర యనుచును కమ్మని పాటన్

తిరుగే లేనట్టి విధము 

ధర మాకందించినావు ధన్యులమయ్యా!


Thursday, 1 June 2023

ఘంటసాల పాటల "కందాలు" - 77

 


కందము: 

"రాగమయీ రావే! అను

రాగమయీ రావె" యనుచు రాగముదీయన్

మాగుండియ "లయ" దప్పక

నీగానములోన గలిసి నిజముగ బాడున్.



Wednesday, 31 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 76

 

కందము:

"బాబూ! వినరా!" యని గా

రాబుగ నుమ్మడి కుటుంబ లక్షణములనే

బాబుకు చెప్పిన విధమే

బాబూ! మాచెవుల బడగ వహ్వా! యనమే!




Monday, 29 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 75

 కందము: 

"ఎవరో వస్తారని" మరి

చివరకు వెతలుడుగనేదొ చేస్తారనుచున్

భువి నెదురు జూచి మోస

మ్మెవరును పోకూడదనిన మీకిక జయహో!



  

Monday, 22 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 74


 

కందము: 

"ఈరేయి నీవు నేనూ"

తారలు రెండిట్లుబాడె తామే నేలన్ 

తీరుగ చల్లనిగాలిన్

మీరుచునా చందమామ మీదన్ నిలచెన్.




Saturday, 20 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 73



కందము: 

"ధీర సమీరే యమునా

తీరే" యనుచు జయదేవు దివ్యాష్టపదుల్

తీరుగ బాడిన విధమే 

మీరుచు మాచెవుల నమృతమే నింపునుగా.




Friday, 19 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 72



కందము: 

"ఊహలు గుసగుసలాడే"

మాహృదయములూగిసాడు మరివిన హాయౌ 

ఆహా! నెరవెన్నెలలన్ 

సాహో నెలరాజు గురియు చందమువోలెన్.



 

Thursday, 18 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 71

 


కందము: 

"ఏడూ కొండల సామీ "

వేడుచునీ పాటబాడ వేంకట పతియే

వీడక చేయూతనిడుచు 

పాడిగ దరిజేరదీయు భావన కలుగున్.



Wednesday, 17 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 70

 


కందము: 

"బొమ్మను చేసీ" గీత

మ్మమ్మో ప్రతి తెలుగు వాడి "హార్టు"న నిలుచున్

నెమ్మది, విషాదమందున

"బెమ్మయ్య"ను దలచియేడ్చి వినువీధి గనున్. 


 

Tuesday, 16 May 2023

"గోలీ"లు - 70

  


కందము: 

లోకులనెప్పుడు దిట్టకు

"లో" కులమనుచెవరినైన, లోకువ యగుగా! 

"ఆకుల"మే యొక రెమ్మకు

ఆ"కుల"మీకులమటునిటు నమరెను గోలీ! 



Sunday, 14 May 2023

"గోలీ"లు-69

  


కందము: 

కడుపున దన్నుచు బుట్టిన 

గడుపారగ బ్రేమబంచుగద సంతునకున్     

కడుపుననుంచుక జూచును 

కడుపుణ్యపురాశి యమ్మ కదరా గోలీ! 


Friday, 5 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 69

  


కందము: 

"నా సరి నీవని" పాటను  

ధ్యాసగ వినినంత మనసు తా పరవశమౌ 

కూసింత రాగమందుక 

మూసిన నోరైనగాని ముచ్చట బాడున్.



Wednesday, 3 May 2023

ఘంటసాల పాటల "కందాలు" - 68

 

కందము: 

"అంతగ నను చూడకు" మని

వింతగ గురిచూడకనుచు వినబడు పాటన్

సాంతము వినుచును ప్రేమన్

సుంతైనను సరసమాడు చుందురు జంటల్.




Wednesday, 12 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 67

  


కందము: 

"పిలిచిన పలుకవు" హాయౌ

చిలిపిగ జవరాల నన్ను జేరగరావా

చెలినీ సొగసేలును జగ

ములనని నెలరేడు గగనమునదాగెననన్.




Tuesday, 11 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 66

 కందము: 

"పయనించే ఓ చిలుకా"

భయమదిలేకుండ ధర్మ పథమమున సాగన్

నయగారము మరువమనెడు

ప్రియమగునా పాట వినగ వీనులు చూచున్.




Monday, 10 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 65

 

కందము: 

"చెంగావి రంగుచీరా"

కొంగును కొంగును గలుపగ గోరుట వినగా

సంగీతము మది బలుకు ని 

జంగా సరిసరి సరిసరి సరిసరి సరిసా.



Sunday, 9 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 64

 


కందము: 

"నారాయణ నీలీలా" 

ప్రేరణ నీదగుచు బుట్టె వీరులహో! యీ

భారతమునననుచును ప్రియ

మారగనే బాడినావు మరిమరి వినగా. 



Saturday, 8 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 63

 


కందము: 

"రారా కృష్ణయ్యా" యని 

రారా దీనులను గావ రారమ్మనుచున్

కోరిన వరమిడు వరదుని

చేరువ మాసన్నిధికిని జేర్చితివయ్యా.





Friday, 7 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 62

 

కందము: 

"మానవుడే మహ నీయుడు"

ఆనాడుననాలపించి నట్టిది వినగా

నేనాటికి నూతనమే

మానవునిగ పుట్టితినని మనసుప్పొంగున్.


 

Thursday, 6 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 61

 కందము: 

"అమ్మాయే పుడుతుందీ"

అమ్మకులానుండు తానె యచ్చంబనుచున్

కొమ్మను సరసాలాటల

నిమ్ముగ నుడికించు పాట నిక విన హాయౌ.



Wednesday, 5 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 60

 


కందము: 

"చిన్నారీ బుల్లెమ్మా"

చన్నీటను స్నానములిక చాలను పాటన్

హన్నా!చక్కలిగింతలు

విన్నామా మాకుగలుగు వేమార్లైనన్.  



Monday, 3 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 59

 


కందము: 

"విరిసే కన్నులలో" యను

మెరుపుల యాపాట వినగ మీదట మనసే

మరిమరి చెలినే మెచ్చుచు

మురియును బృందావనముల "పో" వద్దనులే. 



Sunday, 2 April 2023

"ఆ నంద" మూరి

 


సీసము:

రామకృష్ణులకును  రారాజు రావణ

పాత్రలకును పేరు బడ్డవాడు 

వెండితెర బసిడి కొండగా వెలుగుచు

నటసార్వభౌముడై నట్టివాడు 

ఆంధ్రులు మరచిన యాత్మగౌరవమునె

నరములన్ నింపిన   నాయకుండు 

ప్రజల మేలునుగోరి  పార్టీని స్థాపించి 

ప్రఖ్యాతి గన్నట్టి పాలకుండు

 

తేటగీతి: 

నందమూరిని జూడ నానందమూరు

నటనయే పరవశమున  నటనమాడు.

తెలుగు దేశమ్ము మెచ్చిన తేజమితడు

అన్న యీతడు పేదలకన్న మితడు.



ఘంటసాల పాటల "కందాలు" - 58

 కందము: 

"కనులు కనులు కలిసెను" పిలి

చెను మరి కన్నె వయసు తెలిసెనసలు చెలిదౌ

మనసని, విసురులు పైపై

ననుచును సరిబాడినట్టి యాగీతమహో!



Saturday, 1 April 2023

ఘంటసాల పాటల "కందాలు" - 57

 


కందము: 

"మరదలుపిల్లా"యనుచును

మరిమరి యుడికించు పాట, మహ కవ్వింపుల్

కొరకొర కోపములోనన్

సరిబలె యందము గలదని చక్కగ సాగున్. 



Friday, 31 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 56

 

కందము: 

"చీకటి వెలుగుల రంగే

ళీ"కనిపించు ను గపాట లెస్సగ వినగా

మా కనిపించును జీవిత

మే కద దీపా వళియని మిన్నగ నార్యా! 


 

Thursday, 30 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 55

 


కందము: 

"రామయ తండ్రీ" యనుచును

ప్రేమగ నా గుహుడు రాము బిలచిన విధమే 

సామీ! నది దాటించెద

క్షేమముగానన విన మదికే హైలెస్సా!



మదిని నిలతువీవె

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

 

మీకు మీకుటుంబ సభ్యులకు శ్రీరామనవమి

శుభాకాంక్షలు.


సీసము:

సూర్య చంద్రుల వెల్గు జూడగా నింగిని

మదిని నిలతువీవె మాకు రామ!

రాయి, పడవ కన్నుదోయికే గన్పట్ట

మదిని నిలతువీవె మాకు రామ!

ఉడుత మరియు కోతి యురుకుచు గన్పించ  

మదిని నిలతువీవె మాకు రామ!

కాకి గ్రద్దలయిన కనులముందుకురాగ 

మదిని నిలతువీవె మాకు రామ!


ఆటవెలది:

నీలిమేఘమొకటి నిలబడ జూచిన

అగ్నిశిఖల జూచి నపుడుగూడ

తల్లి సీతతోడ దయగల మాతండ్రి

మదిని నిలతువీవె మాకు రామ!




Wednesday, 29 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 54

  



కందము: 

"రానిక నీకోసం సఖి"

వీనులకాపాట తాక వేసట గలుగన్

దీనముగా మది యేడ్చును

తానే యాపాత్రయగుచు తన్మయముననే.  



Sunday, 26 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 53

 


కందము: 

"పల్లెకుపోదాం, పారును"

అల్లన నాపాటవినగ నహహా మదిలో

చల్లో యనిజట్కాలో

నల్లరి పనులను దలచుచు నరుగుట తోచున్.




Friday, 24 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 52




కందము: 

"కన్నులు నీవే కావా

ల"న్నట్టి సుమధురభావమౌ గీతమునే

విన్నట్టి వలపు జంటయె

పన్నుగ విడిపోక కలసి  బ్రతుకగ దలచున్.  




Wednesday, 22 March 2023

పలుకుల పచ్చడి

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ

"శోభకృత్" ఉగాది శుభాకాంక్షలు

సీసము:
పరుష వాక్యములను పరులను బాధించు
తీరు వాక్కు లవియె కారమగును
భావ్యమ్మునెరుగక సవ్యమ్ముగా లేని
పొగరుమాటలు జూడ వగరు సాటి
హద్దులెరుగకుండ నతిగమాట్లాడుట
కొప్పుగాని పలుకు లుప్పు బోలు
మోసంపు భావనల్ మూసిన పైపైని
తేట వచనములే తీపి చాయ

తేటగీతి:
చేరి జెప్పెడు చాడీలు చేదు గాద
పొల్లు స్వోత్కర్ష నుడువులు పులుపు భాతి
కలిపి పచ్చడిగా వీని గడుపుజేర్చి
మితము స్మిత బాషణముజేయు బ్రతుకుగాది.

కందము:
శోభకృతు నామ ధేయా!
ప్రాభాత స్వాగతమిదె రా వత్సరమా!
శోభాయమాన భవితను
మాభాగ్యము పండ నీవె మాకీయగదే!


Sunday, 19 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 51

 


కందము:

"శివశంకరి" వినగా పా

టవమిడుగా నీదుపాట "టానిక్" తానౌ

యువగాయకులకు, నిజమిది 

స్తవనీయుడ కేలుమోడ్తు తలవంచుచు నే!


Saturday, 18 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 50

 

కందము: 

"దివినుండీ భువికీ" యని

భువిలో నాపాటవినగ పులకిత మదియే

దివిలో నన్ విహరించగ

జవరాలిని ముదము గలసి చనినటులుండున్. 

 


Wednesday, 15 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 49

 కందము: 

"ఏ నిమిషానికి" పాటను

మానవులూహింపలేని మంచియు చెడులే

మానక జరిగిన వేళల 

నానిముషము మనసు పాడు నాహా! నిజమే!


Tuesday, 14 March 2023

ఘంటసాల పాటల "కందాలు"- 48

 

 

కందము:

"నిజమైనా కల యైనా"

నిజమే యొకటగు  నిరాశ నిండిన వేళన్ 

నిజమును జెప్పిన పాటది

నిజముగ మామనసు దోచు నిర్మల హృదయా!


Saturday, 11 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 47

 


కందము: 

"జగమే మారినదీ" విన

తగ కమ్మని భావమింక తా కన్నీరై

దిగువకు జారును కన్నుల

మొగమున నాట్యమ్ముజేయు ముదమది నిజమే.


 


Friday, 10 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 46

 కందము: 

"ఈ నల్లని రాలలొ" యని 

వీనుల విందుగను పాట వినగా, శిలలన్

పైనన్ గల కాఠిన్యము

లోనన్ గల వెన్న, మనసులో కనిపించున్.



Tuesday, 7 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 45



కందము: 
“కలకానిది విలువైనది " 
యల వినగా నిట్టిపాట నవనిని పలు బా
ధల క్రుంగెడు మనుజుల  మన  
సులు  శోకము మరుగునగల సుఖములు వెదకున్.



Monday, 6 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 44

 


కందము:

"అనుకున్నదొక్కటీ"యని

తనగుట్టే తెలిసెననుచు తరుణిని యేడ్పిం

చినవిధమును వినగా హా 

యిని బుల్బుల్ పిట్టనంచు నెగురును మనసే. 



Sunday, 5 March 2023

"గోలీ"లు - 68


కందము: 

ర్యాగింగ్ చేయుట యే యొక 

రోగమురా, దాన్ని జేయ  "రోగ్" వగుదువురా!

రోగమువిడి "జూన్యర్సు"ను

స్వాగతమని పలుకరించ సభ్యత గోలీ!



 

ఘంటసాల పాటల "కందాలు" - 43

 


కందము: 

"ఉడతా ఉడతా హూ"త్తని

బుడతల నాడించు పాట పూర్తిగ వినగా

వడి చిలుకపలుకు బాలల 

బుడిబుడి నడకల పరుగులు ముద్దుగ తోచున్. 


 

Saturday, 4 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 42

 


కందము: 

"ఆవేశం రావాలీ"

ఆవేదన కావలెనను నాపాట వినన్ 

ఆవేదనలే మూగగ  

 నావేశపు మూగ మనసు లాక్రోశించున్.



Friday, 3 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 41

  

కందము: 

"మనిషైతే మనసుంటే"

కనులే కరుగును విన మరి కరుణయె కురియన్

మనిషిని  కదలించును గద 

మనసను మేఘమ్ము కురియు మస్తుగ జాలిన్.


  




  


Wednesday, 1 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 40

 


కందము: 

"హవ్వారే హవ్వా" వా

రెవ్వా యా పాట యందు ప్రేయసి తోడన్

యవ్వారము హైలెస్సని

లవ్వాటగ సాగు విధము లాగును మనసున్.



Tuesday, 28 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 39


కందము: 

"పూజకు వేళాయెర" యని

మోజుగ నా తరుణి పాడ ముచ్చట దీర్పన్

రోజుల యందపు మొహము

బూజుగనే దులుపు విధము బుద్ధిని గరపున్.


  


Monday, 27 February 2023

పోటీ లేని "టీ"

 

కందము

మేటిగ నుండును రుచులన్ 

చేటుల్ కలుగంగ బోవు సేవించగ, మీ

రే, "టీ" నే త్రాగండయ 

పోటీ పానీయమేది పుడమిని జూడన్.


కందము:

నీరును కాళ్ళకు, త్రాగెడు

నీరును నీవీయకున్న నిందించరు, తే

నీరును, వచ్చిన యతిథికి

తీరుగ నీ వీయకున్న దెప్పుదురిలలో.  


ఆటవెలది: 

అల్లము మరి సొంఠి, యావాలు, నిమ్మయు

బ్లాకు, వైటు, గ్రీను, బాదములును

రకములెన్నొ గలవురా! త్రాగు "టీ" లలో

దేనికదియె రుచుల దెలిసికొనుము.  


ఆటవెలది: 

చదువుకొనగ నిచ్చు సహనమ్ము "తేనీరు" 

కష్టజీవి శక్తి గాచు "టీ"యె 

ఉస్సురనెడువారి కుత్సాహమీ "చాయి"  

బ్రతుకు తెరువు జూపు భాగ్యశాలి.





ఘంటసాల పాటల "కందాలు" - 38

 

కందము: 

"ఏడూకొండల సామీ"

వేడుచు నెలుగెత్తిపాడ వేంకట పతియే

కూడుచు చేయూతనిడెడు

వేడుక భక్తులకు దోచు ప్రియముగ ననఘా!



Sunday, 26 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 37

 


కందము: 

"ఉన్నావా అస"లంటూ

మిన్నునకే తాకునట్లు మిన్నగ పాడన్

అన్నారాయణుడే తా

నున్నానని వచ్చు విధమె యూహన్ మెదలున్.


 


Thursday, 23 February 2023

"గోలీ"లు - 67

 


కందము: 

"వేల"ను బోయుచు కొను నీ

వేలును తాకించి వాడు వేడుక "స్మార్ట్ ఫోన్"

వేలును మాత్రము మరి "రాంగ్"

"వే"లను పెట్టంగబోకు వినుమా గోలీ!   


ఘంటసాల పాటల "కందాలు" - 36


కందము: 

"వినరా వినరా నరుడా"

యనుచును నరులకును పాడి యావుల గొప్పన్

మనముల నాటెడు విధముగ 

ఘనముగనే పాడినావుగా, నతులయ్యా! 



Wednesday, 22 February 2023

ఘంటసాల పాటల "కందాలు"- 35

 


కందము: 

"ఓసఖి! ఓహో చెలి!" విన

చేసిన కవ్వింపులన్ని చెలియలతోడన్ 

మూసిన కన్నుల గనబడు

నా "సీనులు"  నాముగింపె యాహా! ఓహో!



Tuesday, 21 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 34


కందము: 

"సుందరి నీవంటి" వినగ 

డెందమునానంద మొదవి ఠీవిగ నవ్వున్

ముందుకు వెనుకకు చేతులు

పొందుగ చప్పట్లుగొట్ట బూనుచు కదలున్.



Monday, 20 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 33



కందము: 

“ప్రేమించి పెళ్ళి చేసుకొ

నీమనసంతాను హాయి నింపుకొ” మనుచున్ 

ప్రేమికుల గుండె తలుపులు

ప్రేమగ తట్టితివి వలపు ప్రేరణ గల్గన్.  





Saturday, 18 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 32

 


కందము: 

“నీ సుఖమే నే”  పాటను

ధ్యాసగ విన భువిని ప్రేమ దాసుల మదిలో

కూసంత ద్వేషముండున?

మోసమ్మే లేని త్యాగ బుద్ధియె గల్గున్. 







ఓం నమశ్శివాయ.

 ఓం నమశ్శివాయ.

మీకు మీకుటుంబ సభ్యులకు అందరికీ

మహా శివరాత్రి శుభాకాంక్షలు. 


కందము: 

అడిగినదెవడని దలపడె  

యడిగినదెదియని జిడిముడి నసలిక బడడే

యడిగిన తడవుగ వడివడి

నడుగిడినిడుములనె కడపి హరుడిడు వరముల్!


ఆటవెలది: 

నీరుబోయజాలు నీ మొరల్ విన వచ్చు  

తుమ్మిపూవునిడగ తుష్టిజెందు

మదిని భక్తి నింపి మారేడు దళముల

వేయ వరములిచ్చు వేయి శూలి. 


Friday, 17 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 31

 


కందము:

“సుడిగాలి లోన దీపం

కడవరకు నిలచున” యనగ గద్గద స్వరమున్

తడియగు కన్నులు, కలవర

బడుచును మనసంతగూడ భారమ్మౌగా.