తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 29 April 2019

జడ "కందాలు" - 96


బాబ్డ్ హెయిర్ కోపం. 


కంపరమున బాబ్డ్ హైరనె 
చంపుచు నున్నారు మీరు జడ! జడ! యనుచున్  
చింపిరిగుంటే తప్పే! 
ఇంపుగ తలదువ్వుకున్న నెందుకు జడ? ఆ!

Sunday, 28 April 2019

జడ "కందాలు" - 95

గడ్డమునే మూరెడుపెంచు

జడబారెడు పెంచుమనగ 
ముడిచిన మూతినె నటునిటు మూల్గుచు తిప్పెన్ 
వడి నీ గడ్డమునే మూ 
రెడు పెంచుమని పతికి సతి రెచ్చుచు జెప్పెన్.  

Friday, 26 April 2019

రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 04 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య -  రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల


తేటగీతి:
చీర గట్టదు "లే" భామ జీన్సు  ప్యాంటు
వేయు, తాంబూల మందున వేయిమీద 
నూట పదహార్లు  తోడుగా  వేడ్కమీర 
రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల? 

జడ "కందాలు" - 94


అల జ(డ)డి

అల 'జడ ' పద్యములల్లగ 
నలజడి నామనసు రేగె, నాలోచింపన్ 
అలలే సాగెను మదిలో
జలజల పద్యమ్ములందె ‘ జడను’ ర ' చింపన్ ' 

Thursday, 25 April 2019

జడ"కందాలు" - 93


జానకి జడబిళ్ళ

పడవేసి యన్ని నగలను 
జడ బిళ్ళను దాచుకొనెను జానకి, పతితో
గడపిన మధురక్షణముల 
ముడిచిన నా మణిని దాచి మురిసినదేమో.

Wednesday, 24 April 2019

జడ "కందాలు" - 92


బారెడుజడ భాగ్యమ్మ

బారెడుజడ భాగ్యమ్మను 
మూరెడుజడ మున్ని జూచి ముచ్చట జెపుచున్ 
మూరలు కొలిచెడి నెపమున 
జేరుచు సవరమ్ము వెదకె చేడియ జడలో.

Tuesday, 23 April 2019

జడ "కందాలు" - 91

తల చెదలే 

తలచెదనే జడ రూపము 
దలచెద నేనింట బయట, తపసును జేతున్
తల చెదలే పట్టక నే 
దలచెదలే కందమందు దగు జడ నిలుపన్.

Monday, 22 April 2019

జడ"కందాలు" - 90


తల "పేలే"నుగ 

తల "పేలేనుగ" మీకిక 
తలపుల నెన్నెన్నొ గూర్చి తలచుచు నున్నన్ 
తల "పేలే"నుగ మీకిక 
తలదువ్వుచు నల్లకున్న తలచిన జడనే.

Sunday, 21 April 2019

వస్త్రములన్ త్యజించుచు ప్రపంచహితంబును గూర్చ భావ్యమౌ

"ప్ర - పద్యం" ఫేస్బుక్ గ్రూప్ లొ  20-4-2019 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. 

సమస్య -  వస్త్రములన్ త్యజించుచు ప్రపంచహితంబును గూర్చ భావ్యమౌ

ఉత్పలమాల: 
వస్త్రములిన్నియిన్ని మరి భామలకెందుకు పెట్టె నిండుగా
దస్త్రము గట్టినట్లు తెగ దాచిన చిమ్మటకాటు జిన్గుగా 
వస్త్రములేని పేదలకు బంచగ కొన్నిటి గొన్నవాటినే 

వస్త్రములన్ త్యజించుచు ప్రపంచహితంబును గూర్చ భావ్యమౌ.

జడ"కందాలు" - 89

జడపొడుగెంతని కాదు

జడబారెడు తలజూచుచు 
జడబెత్తెడు తలయె జెప్పె సణుగుచు నిటులన్ 
జడపొడుగెంతని గాదులె  
జడ వుందా,లేదచూడు, చాల్లే పోవే!

Saturday, 20 April 2019

జడ"కందాలు" - 88

జడ అక్కరలేదని. 

జడయేయక్కర లేదని 
కుడియెడమల బాగ దువ్వి కుదురుగ కురులే
మెడనటు భుజముల గప్పగ 
నడచుచు వయ్యారి భామ నవ్వుచు సాగెన్.  

Friday, 19 April 2019

జడ"కందాలు" - 87

జడలేని తలల కోపము


విరబోసిన కురులందము 
మరి మీరలు గనగ లేర మాసొగ సెపుడున్
సరిగా జూడుండనుచును  
కొర కొర జడలేని తలలు కోపము జూపెన్.

Thursday, 18 April 2019

జడ"కందాలు" - 86

నలుపు తెలుపులు 

నలుపుల తెలుపుల జుట్టును 
నలుపుచునిక రంగు వేయ నలుపుగ మారున్ 
దెలుపని జూపుచు నెవ్వరు  
దెలుపని విధముగనె యల్లు తీరగు జడనే.

Wednesday, 17 April 2019

జడ"కందాలు" - 85

కుంకుళ్ళను వాడండి

ఒళ్ళును శుభ్రము జేయును 
కుళ్ళును తొలగించి మెరుపు కురులకు నిచ్చున్ 
జళ్ళను మెచ్చెదరిక, కుం 
కుళ్ళను వాడండి తలకు కోమలులారా!   

Tuesday, 16 April 2019

జడ"కందాలు" - 84


జడ లాగుడు.

జడవేసి తల్లి లాగెను
బడిలో నల్లరిని జేయ పంతులు లాగెన్
నడివీధి నాకతాయియు
నడ'చెడి' యా  పాప జడను నవ్వుచు లాగెన్.

Monday, 15 April 2019

జడ"కందాలు" - 83

భేషైన జడలు.

పెట్టుము గోరింటాకును 
గుట్టుగ నారంగు మార్చి  కూర్చుచు గురులన్ 
గట్టుము సవరము జాటుగ 

బట్టుము భేషైన జడల పడతిగ పేరున్. 

Sunday, 14 April 2019

నాల్క పైన నీదు నామమ్ము

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీ సీతారామాభ్యాం నమః














సీసము:
ఇక్ష్వాకు కులచంద్ర! ఇక్షురసము నీయ
లేదు రుచియనును నాదు రసన
కోదండ రామయ్య! కోరి బెల్లమువెట్ట
లేదు రుచియనును నాదు రసన
పతిత పావన నామ! పాలమీగడ దిన
లేదు రుచియనును నాదు రసన
జానకీపతి! పుట్ట తేనియనందించ
లేదు రుచియనును నాదు రసన  

ఆటవెలది: 
నాల్క పైన నీదు నామమ్ము నిరతము
నాట్య మాడు చుండ నది ఘటించె 
చేదుగాను మారె చేరి లౌకికములు 
చేదుకొనుము రామ! చిద్విలాస!

Saturday, 13 April 2019

జడ"కందాలు" - 82


హెడ్ & షోల్డర్స్...

తల 'చుండ్రు' బట్ట జూడగ 
తల, భుజముల పైన 'పొట్టు' తడిగా దగులున్ 
"తలభుజముల" షాంపూనే 
తలవాడుచు, జడనువేయ తధ్యము సుఖమౌ.

Friday, 12 April 2019

జడ"కందాలు" - 81

చిక్కులు గలిగిన...

చిక్కులు గలిగిన కురులను 
క్కగ సరిదువ్వి వేయ చక్కని జడయౌ 
జిక్కులు గలిగిన బ్రతుకున 
క్కగ హరి మ్రొక్కి పూజ సల్పిన సుఖమౌ.

Wednesday, 10 April 2019

జడ"కందాలు" - 80

పాపడి జడ... 

పాపాయి గోరు తల్లికి  
పాపడు తా బుట్ట, పట్టు పరికిణి దొడిగెన్ 
పాపిటనిడి  జడ వేయుచు 
పాపడి లో పాప  జూచి పరవశ మందెన్.  

Tuesday, 9 April 2019

జడ"కందాలు" - 79

నాగవేణి పూజ ...

గుడిలో నాగస్వామికి 
నిడుదురుగా "నాగచవితి" నేగుచు భక్తుల్ 
పడి రోజు నాగవేణికి 

నిడుదురు కుoకుమయు బూల నింతులు గనరే. 

Monday, 8 April 2019

జడ"కందాలు" - 78

తలను గుచ్చినా గీరినా..

గ్రుచ్చిన గీరిన నేమిలె 
ముచ్చట సతి కురుల నూనె ముద్దుగ బూయున్ 
నచ్చిన  జడనేయల్లుచు 
విచ్చిన పలువిధములైన విరులను బెట్టున్.  

Sunday, 7 April 2019

జడ"కందాలు" - 77

నవ్వుల పువ్వుల వదలున....


దువ్విన సతి  వాల్జడలో  
పువ్వుల ముడిచిన పతి, సరి బొగడుచు తానే  
జవ్వని జివ్వున  రువ్విన 
నవ్వుల పువ్వుల వదలుచు నవ్వల జనునా?   

Saturday, 6 April 2019

జనులకు భావికారి

అందరికీ "వికారి" నామ తెలుగు వత్సర శుభాకాంక్షలు

చంపకమాల:
వినుమిక యో "వికారి" యొక విన్నపమింకను జేతుమమ్మ నిన్
కనగన నీ "వికార"ముల గాన్పడనీయక లోకమందు యా
తనలవి కారిపోవునటు తగ్గటు కాలము మార్చి వేసి భూ
జనులకు భావికారిగను శాంతియు సౌఖ్యములంద జేయుమా!

Friday, 5 April 2019

జడ"కందాలు" - 76

76: పడతులు శిల్పులు

పడతులు శిల్పులు నిజమే 
జడ శిల్పము రోజు జెక్కి చక్కగ నా పా 
పిడి మీద భక్తి కుంకుమ  
నిడి విరులను పైననుంతు రింతులు భళిరా!

Thursday, 4 April 2019

జడ"కందాలు" - 75

75:జడబాధ తప్పింది

ముడి వేయను నాకురులను
జడవేయనని ద్రుపదసుత సభలో పలికెన్
అడవిని వనవాసంబున  
పడి జడ పోషించు బాధ పడతికి తప్పెన్

Wednesday, 3 April 2019

జడకందాలు - 74

74: జడకుచ్చుబిగించి

ముళ్ళను గ్రుచ్చుచును పలు  కు
దుళ్ళను గీరుచు నదంత దువ్వుట యనుచున్
వ్రేళ్ళను త్రిప్పుచు గొంతును 
త్రాళ్ళబిగింతురు జడలకు తరుణీ మణులే.

Tuesday, 2 April 2019

జడ"కందాలు" - 73



73: కొమ్మనువీడినా కొమ్మనేజేరి


కొమ్మను గోసిన పూవుల 
నమ్మగ నవిజేరె జూడ నతివల, ముదమున్   
కొమ్మను వీడిన గానీ 
కొమ్మనె జేరితిమనుచును గూర్చొనె జడలో.  

Monday, 1 April 2019

జడ"కందాలు" - 72

72: దేవుని వేడుకొని 

మాడున మొత్తము దీయక 
మూడుగ కత్తెరలను మరి ముచ్చటగిచ్చున్ 
ఏడగు కొండల దేవుని 
వేడుక, జడ రక్ష జేయ వేడుక సతికే .