తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 31 March 2015

ప్రాతఃకాలము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన: ప్రాతఃకాలము



తేటగీతి:
మంచు పొగలేమొ సాంబ్రాణి మించి యుండె
ముఖము పసుపాయె సూరీడు ముద్దు బొట్టు
తెల్ల వస్త్రము తలజుట్టి తీరు గాను
తూర్పు కన్నియ యుదయమ్ము దోచెనాకు

Monday, 30 March 2015

తీర్ధయాత్రల వలన వర్ధిల్లు నఘము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తీర్ధయాత్రల వలన వర్ధిల్లు నఘము


తేటగీతి:
తీర్థ యాత్రల లో గూడ తిమ్మరాజు
మందు మానడు చెప్పినన్ మాట వినడు
" తీర్థ " మన్నది వెంటగా తెచ్చి జేయు
' తీర్ధ ' యాత్రల వలన వర్ధిల్లు నఘము

Saturday, 28 March 2015

న్యస్తాక్షరి: ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి: అంశం- రామకథ.
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.


 


















తేట గీతి:
శ్రీధవుండిల రక్షింప శిష్ట జనుల
సీతగా సిరి రాముడై చేరె తాను
తాము శంఖమ్ము చక్రమ్ము పాము పడక
రాము తోడుగ బుట్టెగా ప్రేమ మీర
మునుల యాగమ్ము రక్షించి జనక పురిని
లన సీతను పెండ్లాడె, పలుక తండ్రి
కుదురుగా వనముల కేగె కోరి కోరి
వంకరాలోచనలు జేసి లంక రాజు
రికి జేరిచి మైథిలిన్ దాచగాను
చ్చి హనుమను బంపగా నాతి వెదకె
ముష్కరాధములందర మోదిజంప
లుప్తమయ్యెను పాపాలు లోకమందు.

Friday, 27 March 2015

తిరుగలి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తిరుగలి



 














కందము:
తిరుగలి ! మూలము నీవే
తిరుగాడుచు పిండి, నూక దీయగ నాడే
తిరుగలి ! మూలన నీవే
తిరిగిన కాలమ్మె యుసురు దీసెను నీకున్.

Thursday, 26 March 2015

రామభక్తులలో మేటి రావణుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రామభక్తులలో మేటి రావణుండు.



తేటగీతి:
ఆత్మలింగమ్ము సాధించె నతడు నాడు
శివుని కీర్తించి మెప్పించి నిలిచినాడు
తెలియ భువిజూడనా పార్వతీ మనోభి
రామభక్తులలో మేటి రావణుండు.

Wednesday, 25 March 2015

జనారణ్యము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - జనారణ్యము.



కందము:
కరి, కపి, పులి సింహములు మ
కరి , పాములు, తేళ్ళు, జెర్లు, గ్రద్దలు, నెమళుల్
సరిజూడ కానుపించును
నరరూపమ్మున మసలు జనారణ్యములో.

Tuesday, 24 March 2015

సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.



కందము:
సానీ సససా మగసా
 
దానీ  దదనీని పాప దామా గరిసా 
పానీ నిగమమ్ముల దొర
సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.

Monday, 23 March 2015

రక్షాబంధనము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణ (న) చిత్రం - రక్షాబంధనము.





























కందము:
అక్షయమగు బంధమ్మిది
వీక్షించుము నన్ను నీవు వీడకుమెపుడున్
రక్షా బంధనమిదిగో
అక్షములన్ ప్రేమనింపి, అన్నా! కడుదున్.

Sunday, 22 March 2015

తెలుగు జాతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణన - తెలుగు జాతి



తేటగీతి:
తెలివి గలజాతి మనజాతి తెలుగు జాతి
తెగువ గల జాతి మనజాతి తెలుగు జాతి
తీపి భాషను గలజాతి తెలుగుజాతి
తేజమున్నట్టి దీ జాతి తెలుగు జాతి.

Saturday, 21 March 2015

ధారుణి మాపుము ' రేపు ' మాపులున్.

 శ్రీ " మన్మథ " నామ సంవత్సర శుభాకాంక్షలు.  



























ఉత్పలమాల:
పేరును నిల్పుకొమ్మనుచు పెద్దలు జెప్పుట సాజమే, నినున్
పేరును నిల్పుకోకుమని వేడుక తోడను వేడుకొందునీ 
తీరుగనేడు, మన్మథుని తీయని నామపు వత్సరమ్మ, ఈ
దారుణ మానభంగముల  ధారుణి  మాపుము ' రేపు '  మాపులున్.      

Friday, 20 March 2015

భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.  



సమస్య - భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. .



తేటగీతి:
అల జరాసంధు జంపగా నరిగె నపుడు
పుణ్యపురుషులు మువ్వురు భూసురులుగ
కపట వేషమ్ము లనుదాల్చి కవ్వడియును
భీమసేనుండు, దేవకీ ప్రియసుతుండు. .

Thursday, 19 March 2015

దేశ భాషలందు తెలుగు లెస్స.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - దేశ భాషలందు తెలుగు లెస్స. 


ఆటవెలది:
అందచందమొల్కు నక్షరమ్మున లెస్స
పలుక నోట తేనె లొలుకు లెస్స
పద్యమందు బాడ వాక్శుద్ధి యగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స.

Wednesday, 18 March 2015

హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 



సమస్య - హారము కొరకై యొక సతి హారము నమ్మెన్


కందము:
భారపు బ్రతుకున పొలమున
పైరునకే బట్టె చీడ, భర్యె మందుల్
చేరుచుగొన పురుగుల సం
హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

Tuesday, 17 March 2015

శిల, శిల్పము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణన - శిల, శిల్పము


కందము:
దెబ్బలు కొట్టగ స్థపతియె
అబ్బాయని యనక మిగుల నణకువ జూపన్
నిబ్బరముగ నాశిలయే
అబ్బురముగ మూర్తి యగుచు నాహా నిలచున్.

Monday, 16 March 2015

అద్దె యిల్లు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - అద్దె యిల్లు.


తేటగీతి:
దేహమన్నది యాత్మకు గేహమగును
మనది కాదది సొంతమ్ము, మాధవునకు
భక్తి నద్దెగ చెల్లించ వలయు మనము
చిన్న కొంపలకే మార్చు చెల్లకున్న.

Sunday, 15 March 2015

ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.



కందము:
ప్రత్యర్థి గురువు,మరియొక
ప్రత్యర్థియె తాత, కాద పాపంబనుచున్
హత్యలు జేయుట, తగదని
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

Saturday, 14 March 2015

నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.



కందము:
లలితా !  చెప్పెద వినుమా !
కలసిన వారములు మూడు కాదొక నెలగా
కలవవలెను తెలియగ మరి
నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

Friday, 13 March 2015

కోయదొర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం: కోయదొర  
















కందము:
పొందిక కోసిన కోయని
మందుల 'నమ్మిన' నరులకు మన కోయదొరే
మందులనమ్మును, వాటిని
పొందిక వాడగను వ్యాధి పోయిన పోవున్. 

Thursday, 12 March 2015

రామజోగి మందు ప్రాణ హరము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామజోగి మందు ప్రాణ హరము


ఆటవెలది:
మానలేక పోవ మానమే పోవును
మ్రాను నీవు  మందు మానలేవ !
గోడవీవు నాదు గోడు వినగ లేవ !
రామజోగి ! " మందు "  ప్రాణ హరము.

Wednesday, 11 March 2015

పెంకుటిల్లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పెంకుటిల్లు


 
















ఆటవెలది:
పేద, పెద్ద మధ్య వెలుగొందునీ యిల్లు
పెరడు, బావి తోడ పెంకుటిల్లు
తాత కాలమందు ప్రీతిగొలిపినిల్లు
నేడు పల్లె జూడ జాడ ' నిల్లు '

Tuesday, 10 March 2015

త్రాగి పాడెనంట త్యాగరాజు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - త్రాగి పాడెనంట త్యాగరాజు


ఆటవెలది:
హరిహర నిజ శక్తి మరిగించి వడ 'బోయ '
నరులకందినట్టి నామ రసము
నిత్యనూతనమ్ము నిగమాల సారమ్ము
త్రాగి పాడెనంట త్యాగరాజు.

Monday, 9 March 2015

అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్. 


కందము:
చెప్పగ దారిద్ర్యంబును
ముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్
చప్పున నుపశమనముగా
నప్పిచ్చెడువాఁడు,  వైద్యుఁ డగు ననిరి బుధుల్.

Sunday, 8 March 2015

పానకాల స్వామి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పానకాల స్వామి.


 


















కందము:
అరబిందెడు సరి ద్రావుచు
నరబిందెడు పానకమ్ము నటు తీర్థముగా
నరులకు విందును గూర్తువు
అరవిందాలయ ధవుడగు హరిముఖ ! జే జే !

Saturday, 7 March 2015

వావి వరుసలఁ జూడనివా రనఘులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వావి వరుసలఁ జూడనివా రనఘులు.

తేటగీతి:
న్యాయ మూర్తిగ నిలచిన నాడు తాము
తీర్పు జెప్పుట లోనింత మార్పు లేక
నీమమింతయు దప్పక నిష్ఠ గలిగి
వావి వరుసలఁ జూడనివా రనఘులు.

Friday, 6 March 2015

శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా

కందము:
శ్రీశ్రీ కవియే, యొరులకు
శ్రీశ్రీ యని పేరు వెట్ట శ్రీశ్రీ యౌనా ?
శ్రీ శ్రీశ్రీ యని యననా
శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా !


Thursday, 5 March 2015

గజము గజము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - గజము గజము.


 

















తేటగీతి:
వంటచెరకును గట్టుకు నొంటిపైన
నొంటి వెడలెను రహదారి వెంట గజము
వంట కొక్కడు సైకిలుకంట గట్టి
గ్యాసు బండలు నెట్టెను గజము గజము ,

Wednesday, 4 March 2015

కౌగిలి మరణమ్మునొసగు గద సరసులకున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కౌగిలి మరణమ్మునొసగు గద సరసులకున్



కందము:
జాగరత లేక మిక్కిలి
భోగములన్ దేలియాడ బుద్ధియె లేకన్
రోగము నిండిన కాంతల
కౌగిలి మరణమ్మునొసగు గద సరసులకున్ !

Tuesday, 3 March 2015

చంద్రునిలో మచ్చ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చంద్రునిలో మచ్చ. 

కందము:
మచ్చను యిలలోనెవ్వరు
మెచ్చరు తమమీదనున్న, మేదిని జనులే
మచ్చల చంద్రుని జూచుచు
మచ్చరమును జెందుదురుగ మైమరపులతో.

Monday, 2 March 2015

మనము శాంతించు నెన్నొ సమస్య లున్న

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మనము శాంతించు నెన్నొ సమస్య లున్న



తేటగీతి:
మనమునందున భయమును మసలనీక
నేది జరిగిన మనమంచికేనననుచు
ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న

Sunday, 1 March 2015

కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.


ఉత్పలమాల:
ప్రీతిగ నొక్క కూతునకు పెండిలిజేసెను తండ్రి, వ్యాధితో
నాతడు దాటిపోయె, గనె నామెయు పుత్రుని నాదరమ్మునన్
తాతయె మన్మడై మరల ధాత్రికి వచ్చెనటంచు ప్రేమతో
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.