తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 July 2014

పాపములం జేయువాడె పరమున్ గాంచున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాపములం జేయువాడె పరమున్ గాంచున్

కందము:
పాపము జేయుట మానెద
నీపాదములాన యనుచు నీశ్వరు కడనే
శ్రీపాద శరణు శరణన
పాపములం జేయువాడె, పరమున్ గాంచున్

Wednesday, 30 July 2014

కాకాసుర వృత్తాంత వర్ణన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కాకాసుర వృత్తాంత  వర్ణన
కందము:
ఏకాంతము నందుండగ
కాకాసురుడేగి సీత కాలున బొడిచెన్
తా కుశమును మంత్రించెను
చీకాకుగ వేసె పైకి చిద్రూపుండే.
 

కందము:
ముల్లోకంబులు దిరిగెను
కల్లోలము చెంది, సురలు కాకాసురుతో
చెల్లవు మామహిమలె యనె
కాళ్ళకు మ్రొక్కిడగ నతడు కరుణించు ననెన్.

 

కందము:
తిరుగే లేనిది రాముని
తిరు నామము బాణమైన తీక్షణముగ శ్రీ
కరమగు మహిమను జూపును
మరి వ్యర్థము గాదు గాన మదియోచించెన్.

 

కందము:
రామా నీవే దిక్కని
బామాలుచు శరణు వేడ వాయస మునకున్
వామాక్షము దీసెనపుడు
కామారి నుతుడు కరుణను కాకిని బ్రోచెన్.

Tuesday, 29 July 2014

శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా

ఉత్పలమాల:
భూపతి నాదు మిత్రుడిట పూటకు పూటకు తిండి యత్నమే
మాపటి దాక కూలి పని మానక  జేసిన పొట్ట నిండదే !
చూపుము దారటంచు  మరి శుధ్ధిగ పూజలు జేయ నిచ్చుగా
శ్రీపతియే - దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా !

Monday, 28 July 2014

వనవాసం కోసం

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - వనవాసం కోసం


 

















కందము:
అన్నగరి వీడి వనులకు
నాన్నయె జెప్పెననుచు జనె నారాముండే
దన్నుగ నా జానకి జనె
నన్నకు తా లక్ష్మణుండునండగ వెడలెన్. 

Sunday, 27 July 2014

వనిత కదేల సిగ్గు మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వనిత కదేల సిగ్గు ? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

చంపకమాల:
మనమున మెచ్చువాని నభి మానము జూపెడు వాని వేడుకన్
ఘనముగ పెండ్లి యాడ మరి కార్యము లన్నియు సాగి మాసముల్
దినములు దొర్లి పోగ నొక తీయని వార్తను చెప్ప బోవగా
వనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

Saturday, 26 July 2014

అట్టులనే పట్టుబట్టు



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 02 - 2013 ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ () చిత్రం - అట్టులనే పట్టుబట్టు


















కందము:
అట్టిట్టనకను పొట్టను
పట్టించెదనట్టు పట్టుబట్టుచు బాగా
దట్టించ నుల్లిముక్కలు
కొట్టిన కొబ్బరితొ  చట్ని  కోరుచుబెట్టన్

కందము:
దోసెల తీరులవెన్నో
మాసాలా , ఉల్లి , రవ్వ, మరి యెమ్మెల్యే
మూసిన పెసరట్టుప్మా
వేసిన ప్లైన్ మినప తినుడు వివిధపు రుచులన్.

Friday, 25 July 2014

గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్


కందము:
త్రిజగములు బొజ్జన గల వ
నజ నాభుని రోట గట్ట నారన్ దెచ్చెన్
నిజమెరుగక నందుని సతి
"గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్".

Thursday, 24 July 2014

ధ (క) ర్మము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ధ (క) ర్మము


 


















కందము:
ధర్మము జేయండయ్యా !
ధర్మంబును జేయకున్న తమ రూపమ్మే
కర్మము గాలును నా వలె
మర్మంబిట జూడ నగును మరుసటి జన్మన్!

Wednesday, 23 July 2014

మూడు ముక్క లాట ముక్తి నొసఁగు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మూడు ముక్క లాట ముక్తి నొసఁగు

ఆటవెలది:
మూడు ముక్కలివ్వి, మోహనాశనమును
ధర్మవర్తనమ్ము, తల్లి లలిత
పైన ధ్యాస, నరుని బ్రతుకున నిట్టియీ 
మూడు ముక్క లాట ముక్తి నొసఁగు.

Tuesday, 22 July 2014

కన్నాంబ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కన్నాంబ 


 
















 





కందము:
కన్నారా యియ్యంబను
విన్నారా నాటి తరపు వెండితెరను తా
నెన్నో పాత్రలు వేసిన
కన్నాంబే యీమె కళల కన్నంబయ్యెన్.

Monday, 21 July 2014

పండు వెన్నెల గాసెను బట్టపగలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పండు వెన్నెల గాసెను బట్టపగలు

తేటగీతి:
వన్నెలే చిందు 'మిస్ యూని వర్సు ' రాగ
నొక్క వేడుక సభకామె హొయలు జూచి
కుర్ర కారుల మదిలోన వెర్రిగాను
పండు వెన్నెల గాసెను బట్టపగలు

Sunday, 20 July 2014

సూ(త)ర్య సుతుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - సూ(త)ర్య సుతుడు

 
















కందము:
సూర్యుడు మంత్రపు బధ్ధుం
డార్యా ! నను వదలమనిన నా కుంతికటన్
వీర్యపు పుత్రుని నొసగెను
కార్యము లెవ్విధిని విధికి కావలెనొ గదా !

Saturday, 19 July 2014

దత్తపది - "తల" అనే శబ్దాన్ని ఆ అర్థం లో కాకుండా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దత్తపది - "తల" అనే శబ్దాన్ని ఆ అర్థం లో కాకుండా వ్రాయాలి.

దుర్యోధనుడు శ్రీ కృష్ణునితో....

కందము:
తలపున పాండవులకు భూ
తలమును సుంతైన ననీయ తథ్యము సుమ్మీ !
తలచితి యుద్ధమునే కూ
తలనే చాలించి కృష్ణ ! తరలుము చాలున్ !



తల శబ్దాన్ని ఆ అర్థంలో కాకుండా కవితలు వ్రాసిన కవి మిత్రులను మెచ్చుకుంటూ నేను వ్రాసిన పద్యం.

కందము:
'తల ' యుండవలయు నందున
'తలకానిదె ' యుండవలయు తగినట్లనగా
తలగాని తలల తమ రా 
తలలోనే జూపిన ' కవి ' తలకే జయహో !

Friday, 18 July 2014

తండ్రీ " కుమారు " లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - తండ్రీ " కుమారు " లు





















కందము:
తండ్రీ కొడుకులు వచ్చిరి
తండ్రీ కొడుకులను జూచి తామిట్లనియెన్
తండ్రీ ! కుమారు గంటివ !
గుండ్రాయేతారకునికి గొంతున బడియెన్.

Thursday, 17 July 2014

ఖర గానమె మెప్పులొందె గాయక సభలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఖర గానమె మెప్పులొందె గాయక సభలో.

కందము:
బిరుదము నొందెను 'నట శే
ఖరు ' డని తానొక్క నటుడు కానీ యొకచో
సరసంబుగ పాడగ "శే
ఖర" గానమె మెప్పులొందె గాయక సభలో.

Wednesday, 16 July 2014

పట్టు పడక.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పట్టు పడక.

 














ఆటవెలది:
పాల కడలి లోన పవ్వళించిన నీకు
పాము చుట్ట పరుపు పట్టు పడక
భామ సిరిని జేరి పద్మ సంభవు గూడి
మాకు పట్టు బడక మరతు వేమొ

Tuesday, 15 July 2014

ఇట లీ (ల)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.






వర్ణ (న) చిత్రం - ఇట లీ (ల)

 







 





కందము:
ఇటనే భారత మందున
నిటలాక్షుడు లింగ రూపు నిలచెన? లేదే !
ఇట లీల జూపు నాతం
డిటలీలో గూడ జూపె నిదిగో కనుమా !

Monday, 14 July 2014

చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁదమ్ములు శంభుఁడన్నయున్

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁదమ్ములు శంభుఁడన్నయున్

చంపకమాల:
మలుపులు దిర్గు కావ్యమది మాన్యుడు వాల్మికి వ్రాసె, వేదముల్
తెలిపెను శూలి యొక్కడని తీరుగ భ్రాతలు లేరు లేరనిన్
పొలుపుగ కానరారు గద గాథలలో  - నొక జట్టు నుండకన్
చెలువుగ రామలక్ష్మణులు ; సీతకుఁదమ్ములు ; శంభుఁడన్నయున్

Sunday, 13 July 2014

ఇడ్డెన వడ్డన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఇడ్డెన వడ్డన 


















కందము:
ఇడ్డెన లందురు వీటిని
గడ్డలుగా
నుల్లి వేసి కమ్మని సాంబార్
వడ్డించగ చట్నీతో
నడ్డేమియు లేక తిను
దు నాహా ! ఓహో ! 

Saturday, 12 July 2014

హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు

తేటగీతి: 
ఎన్నిమారులు చెప్పిన నేమి వినడు
మంచి నెంచుచు చెడునేమొ త్రుంచ మనిన
వదల డేమందు నిక నేను మదిని దలతు
' హంస పాలను, వీడుఁ దోయములఁ ద్రావు'

Friday, 11 July 2014

శంఖ చక్ర మకుట దర్శనం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - శంఖ చక్ర మకుట దర్శనం


 














తేటగీతి:
శంఖ మకుటము లలిగెనా చక్రముయును
మమ్ముజూడరు నీవున్న మనుజు లనుచు
దర్శనంబును చేయించ దయను నీవు
వేంకటేశుడ యిందుంచి వెడలినావ. 

Thursday, 10 July 2014

తురకలు సంధ్య వార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తురకలు సంధ్య వార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ


చంపకమాల:
గురుకులమందు వేదముల గుర్వులు జెప్పినయట్లు నేర్చిరే
చురుకుగ పుత్ర రత్నములు చూడగ నింటికి వచ్చినారు యా
తురతను వచ్చె మిత్రులట తొందర బెట్టుచునుండె వైశ్యులున్
తురకలు, సంధ్య వార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ !

Wednesday, 9 July 2014

' గయా ' పైసలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ' గయా '   పైసలు 
























కందము:
ఒక నాడు బాగ బ్రతికియు
నిక బేడాదమ్మిడణలు నేగిన రీతిన్
సకుటుంబముగా పైసలు
సకలంబుగ సాగిపోయె శ్రద్ధాంజలిదే !

కందము:
చిల్లరకు విలువ లేదని
చెల్లని వని మదిని నేను ఛీకొట్టితినే
చెల్ల నమూల్యపు పద్యము
నల్లగనే వాటి విలువ హహహా పెరిగెన్. 

Tuesday, 8 July 2014

కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

కందము:
వాలుగ బావను చూడగ
నాలిగ నే చేసుకొందు ననె నాతండా
బేలను గని  తాపముతో
కాలిన, నా కలికి మోము కళకళ లాడెన్



Monday, 7 July 2014

శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా


వంకలెన్నొ పెట్టు వాడు ' బాసు ' గానె వద్దులే
శంకలెన్నొ గల్గు భార్య సాహచర్య మట్టులే
జంకు బొంకు లున్న నేత సంఘ ద్రోహి దేశ నా
శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా ! 

Sunday, 6 July 2014

చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

కందము:
వినగా  లీలలు రుక్మిణి
మనమందున హరిని నిలిపి మన్నన జేసెన్
తనయన్న నెదిరి మదిదో
చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

Saturday, 5 July 2014

భరత సముడవీవు భవ్య చరిత.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - భరత సముడవీవు  భవ్య చరిత.


 


















ఆటవెలది:
మేలు చేసి తీవు మేలైన గుణ ధామ
సీత జాడ దెలిపి శివము నిడిన
హనుమ యేమియిత్తు నాలింగనము తప్ప
భరత సముడవీవు  భవ్య చరిత.

Friday, 4 July 2014

రాహుకేతువు లిరువురు రవి తనయులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాహుకేతువు లిరువురు రవి తనయులు.


తేటగీతి:
తలయు మొండెంపు గ్రహముల తరచి జూడ
శనిని యముదల్ప బెదరును జనులు భువిని
భవుని గొల్చెడు వారికి భయమునిడరు
రాహుకేతువు లిరువురు రవి తనయులు.

Thursday, 3 July 2014

హరిని భజియింతు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - హరిని భజియింతు


 


















తేటగీతి:
వాయు పుత్రుడు స్తోత్రంబు చేయు చుండ
గరుడు డొకవైపు కదలక కరము మోడ్ప
శంఖ చక్రమ్ము గద తోడ సదయు డైన
హరిని భజియింతు నామది నార్తి తోడ

Wednesday, 2 July 2014

తేలును ముద్దాడి వనిత తీయగ నవ్వెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేలును ముద్దాడి వనిత తీయగ నవ్వెన్.

కందము:
నాలుగు వత్సరముల సుతు
డీ లీలగ బొమ్మ గీచె నెంతో నేర్పున్
చాలా బాగుందనుచును
తేలును ముద్దాడి వనిత తీయగ నవ్వెన్.

Tuesday, 1 July 2014

ఉత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము 


తేటగీతి:
ఎడ్ల గట్టుక నరకకు నేగవలయు
చద్ది మూటను తెచ్చిమ్ము  చకచక మని
పొలము పల్లెకు దవ్వున కలదు చూడ
నుత్తరమ్మున, జరిగె సూర్యోదయమ్ము