తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 29 May 2013

జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.

ఉత్పలమాల: 
చేరుచు నొక్కచోట పడి సేవలు చేతుము మీకటంచు నూ
రూరును చుట్టుచున్ ప్రజల లో బల హీనతలన్ని సొమ్ముతో
బారులు దీరగాగొని నుపాయము నెన్నిక గెల్వ జూతురే
జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.

Tuesday, 28 May 2013

కాళిదాసాదు లెవ్వరు కవులు గారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కాళిదాసాదు లెవ్వరు కవులు గారు.

తేటగీతి:
తెలుగు సంస్కృత భాషలు తెలియ లేక
షేక్స్పియరు, కీట్సు, టెనిసను, సిడ్ని షెల్డ
ననుచు తిరిగెడు వారికి నన్నయ మరి
కాళిదాసాదు లెవ్వరు కవులు గారు.

Monday, 27 May 2013

భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.
తేటగీతి:
భర్త రక్షక భటుడేను భార్య నాడు
ఒంటి నుండగ చోరుడా యింట దూరె
లాఠి బట్టుక వాడిని లాగి తానె
భర్త యనుకొని దొంగను బాఁదె నతివ
.

తనను తానే భర్తగా (పోలీసుగా)ఊహించుకున్నదని నా భావం.

Sunday, 26 May 2013

వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

తేటగీతి:
పతి పఠించు పురాణమున్ సతియె వినెను
భాగవతమున నల్లరి వాసు దేవు
కోరి కొనియాడి విహరించు గొల్లల పరి
వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె.

Friday, 24 May 2013

వీరేశలింగం


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం -  వీరేశలింగం






 







కందము:
అందిన దాంపత్యమ్మే
అందని పండైన వేళ నతివల మోమున్
చిందగ వీరేశంబే
అందముగా మరల బొట్టు నందగజేసెన్.

Thursday, 23 May 2013

బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.

తేటగీతి:
లేని దానిని తానిచ్చు లెస్సగాను
భక్తి గొలువగ తప్పక పరమ పురుషు
డనుచు నైశ్వర్య హీనులు నచట మరియు
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.

Wednesday, 22 May 2013

శకుంతల జననం.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-05-2012 న ఇచ్చిన స
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - శకుంతల జననం.



















కందము:
భామా మేనక వెడలుము
లేమా నే జారి పోతి లేకను తెలివిన్
ఈమన పుత్రిక పొందును
లే మా దేశమున పేరు లెస్సగ భావిన్.

Tuesday, 21 May 2013

జార గుణంబుగల్గుసతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-05-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - జార గుణంబుగల్గుసతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.

ఉత్పలమాల:
ఆ రఘు రాము నమ్మి మది
గ్నిని దూకెను మాత సీతయే
మీరిన కష్టముల్ గలిగి మీరక నాధుని మాట తా మదిన్
కోరక రాజ్య సౌఖ్యములు గొప్పగ నిల్చె నటంచు నశ్రువుల్
జార, గుణంబుగల్గుసతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.

Monday, 20 May 2013

వర్ణ (న) చిత్రం - విశ్వనాథ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - విశ్వనాథ 




















ఆటవెలది:
ఏకవీర నిచ్చె  నెక్కె ఙ్ఞానపుపీట
కల్పవృక్ష మిచ్చె కవుల రాజు
వేయి పడగలిచ్చె  విశ్వనాథుడు  సత్య
మితడు శారదాంబ కితర రూపు.

Sunday, 19 May 2013

ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

తేటగీతి:
కనగ జనులను ముంచిన ఘనులె యైన
కోట్ల ధనమును కాజేసి కొండలయ్య
భాగ మింతని ముడుపులు  భక్తి నిడిన
ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

Thursday, 16 May 2013

పాండు తనయుల మించిన పాపులెవరు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాండు తనయుల మించిన పాపులెవరు

తేటగీతి:
ధర్మ మేనాడు వీడక ధరణి లోన
పదియు మూడేండ్లు సైచిరి పరమ కష్ట
ములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయి
పాండు తనయుల మించిన పాపులెవరు?

Wednesday, 15 May 2013

జటాయువు వధ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.



 
వర్ణ (న) చిత్రం - జటాయువు వధ





















కందము:
ఆయువు తీరుట వలననె
ఆయమ సీతమ్మ బట్టి యసురుడె వెడలెన్
సాయము జేయగ రాగ జ
టాయువునే నరికె నప్పు డాకస మందే.

Monday, 13 May 2013

మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.

కందము:
మహిలో తాటక పూతన
మహిళలనే రామ కృష్ణ మాన్యులె చంపెన్
మహిలో చెడు వర్తన గల
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.

Sunday, 12 May 2013

భీష్మ ప్రతిజ్ఞ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం: భీష్మ ప్రతిజ్ఞ  


 



















తేటగీతి: 
దాశ రాజ మీ మనసునం దాశ గని వి
వాహ మాడననంటిదే వ్రతము నాకు
వ్రతము దప్పిన నే దేవవ్రతుడ గాను
కూతు నిమ్మంటి మాతండ్రి కోర్కె దీర.

Saturday, 11 May 2013

పాదరసమన్న తీయని పానకమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాదరసమన్న తీయని పానకమ్ము

తేటగీతి:
ఆంజనేయునికిష్టమౌ ఆకు పూజ
వడల మాల నివేదించి భక్తి తోడ
పాదరసమును సేవించ బరగు సుఖము
'పాదరసమన్న తీయని పానకమ్ము'

Friday, 10 May 2013

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్
కందము:
ఏ గ్రీవుండయితేనేం
మా గ్రామమునందు కుక్క మహ పిచ్చిదిగా
ఉగ్రత తో నదలించగ
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.

Thursday, 9 May 2013

విపరీతపు బులుసుకూర విస్తరి మ్రింగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - విపరీతపు బులుసుకూర విస్తరి మ్రింగెన్.

కందము:
చపలాక్షి వేయ కూరను
చపలయ్యే తినక మడిచి సందున వేసెన్
ఉపవాసమున్న మేకయె
విపరీతపు బులుసుకూర,విస్తరి మ్రింగెన్.

Wednesday, 8 May 2013

చేప చన్నులలో పాలు చెంబెడుండె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చేప చన్నులలో పాలు చెంబెడుండె.

తేటగీతి:
పితుకగానిచ్చు నీ గేదె  బిందెడైన 
రోగమేమాయె పాలనీ రోజు జూడ
మూతి వెట్టుచు దూడేమొ మురిపెమలర
చేప, చన్నులలో పాలు చెంబెడుండె?

Tuesday, 7 May 2013

పది కథలు జెప్ప గలవాడు పండితుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పది కథలు జెప్ప గలవాడు పండితుండు.

తేటగీతి:
భాష తెలిసిన వారలే బాగ తగ్గె
నుప్పుకప్పుర పద్యంబు నప్ప జెప్పి
సగము తెలుగును వ్రాయగా సరస కవియు
పది కథలు జెప్ప గలవాడు పండితుండు.

Monday, 6 May 2013

చెప్పునకు లభించె చెఱకు తీపి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చెప్పునకు లభించె చెఱకు తీపి.

ఆటవెలది:
చెప్పు చేరియుండె చెత్తకుప్పను భామ
చేరి వేసె నందు చెరకు పిప్పి
కుక్క చెప్పు బట్టి మెక్కుచు నుండగా
చెప్పునకు లభించె చెఱకు తీపి.

Sunday, 5 May 2013

శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

తేటగీతి:
శంక యేటికి నిక్కము శంకరుండు
సకల శుభకరుం డతనికి సాటి లేరు
తప్పు చెప్పకు మెప్పుడు తలచ కిట్లు
శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

Saturday, 4 May 2013

నేల వ్రాలిన వాలి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

వర్ణ(న)చిత్రం :  నేల వ్రాలిన వాలి   




















కందము:
తేలెను తెలివియె తలలో
మేలగు  సుగ్రీవుడతడు మును మిత్రుడవన్
వాలిని రాముడు గూల్చగ
వ్రాలెను ధర వాని తెలివి వాలము నందే.

Friday, 3 May 2013

హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

కందము:
వినుమా మనమన మనమున
కనుపించక నున్న భయము కదలని దయ్యా
లను పట్టి వేటు వేయును
హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.


Wednesday, 1 May 2013

వర్ణ (న) చిత్రం: దశరథ శ్రవణకుమారులు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం: దశరథ శ్రవణకుమారులు




















తేటగీతి:
తప్పు నీదేమి లేదులే దైర్య మంది
కడవ నీరంది వెంటనే కడకు బోయి
దప్పి దీరుచు మల్లదే తల్లి దండ్రి
పోవు చుంటిని రారాజ పోయి రమ్ము.