తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 April 2012

కుత్తుకలు గోయువానికి కోటి నుతులు


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 29-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కుత్తుకలు గోయువానికి కోటి నుతులు

తేటగీతి:
ధర్మ సంస్థాప నార్థమ్ము ధరణి యందు 
నవతరించుచు శిష్టుల నాదుకొనుచు
తప్పు దారిన బోయెడు దనుజకోటి 
కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.

Sunday, 29 April 2012

దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 28-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.



సమస్య - దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో 

ఉత్పలమాల: 


దగ్ధము జేతు నో నరక! దాగకు మాకసమందు పోరుమా !
దుగ్ధము త్రాగు బాలునని దూరకు! మిప్పుడె దుమ్ము రేపి సం 
దిగ్ధము దీర్తునంచు తల దీయగ కృష్ణుడు చక్ర మంపగా
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!!

Saturday, 28 April 2012

మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 28-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్ 

కందము: 
"నా సుతునకు నూనూగుల 
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు" మీననయనకున్
కాసింత గర్వ మేర్పడి 
చూసిన ప్రతి వార్కి జెప్పె చోద్యము గా తాన్.

Friday, 27 April 2012

గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 27-06-2011 ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!

ఆటవెలది: 
ఆడిన మాటను దప్పగ
వేడుకగా దిరిగి చదువు వెనుకన వేయన్ 
వాడికి నా పేరా? యని 
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!

Saturday, 21 April 2012

శంకరునకు గలవు వంక లెన్నొ.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 27-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - శంకరునకు గలవు వంక లెన్నొ

ఆటవెలది: 
బూది వలువ, వాని బుద్ధి మనకందదు
జడుడు,మెడను పాము,జటల ధారి
నీరు నెత్తి నుండు, నిటలములో నిప్పు 
శంకరునకు గలవు వంక లెన్నొ.

Friday, 20 April 2012

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 26-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.

కందము: 
ఏ గ్రీవుండయితేనేం 
మా గ్రామమునందు కుక్క మహ పిచ్చిదిగా 
ఉగ్రుండగు చదలించగ 
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.

Thursday, 19 April 2012

ఓనమాలు రాని యొజ్జ మేలు.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 26-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఓనమాలు రాని యొజ్జ మేలు
  
ఆటవెలది:
విద్య నేర్వ వచ్చు విద్యార్ధుల నెడను
ఘోర హింస మరియు గోరి  లైంగి
కముగ బాధ పెట్టు కార్యక్రమములందు
ఓనమాలు రాని యొజ్జ మేలు.

Wednesday, 18 April 2012

నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 25-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.

కందము:
నిప్పులు గ్రక్కుచు వెడలగ
నప్పుడు మన రామరాజె యగ్ని కణంబై
చప్పున గాల్చెను రూథర్
నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.

Sunday, 15 April 2012

దత్తపది - "అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు"


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 25-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - "అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు"
పై పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి పెరిగిన వంటగ్యాసు ధరలపై

తేటగీతి:
ధరను మేమప్పుడే నల్గి ధరల మరను
చెప్పుకొనలేని బాధకు చేరినాము
నేత! మీకొప్పునే ధర నిట్లు బెంచ?  
మిమ్మునమ్మి చెడుదుముమే మెప్పు డైన.

Saturday, 14 April 2012

కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 24-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

కందము: 
అమ్మగ మారిన సుందరి
బొమ్మగ ముద్దుల నొలికెడి బుడతడి పొట్టన్!
'ఉమ్మ'ని ముద్దులు పెట్టగ
కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్.

Friday, 13 April 2012

ఐకమత్యమ్ము గలిగించు నధికహాని.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 24-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఐకమత్యమ్ము గలిగించు నధికహాని. 

తేటగీతి: 
ఉగ్ర వాదుల కనిపెట్టి ఊడ్చ వలయు
ఉగ్రవాదపు సంస్థలే యొకరి కొకరు
సాయమందించు కొన్నచో చాలు - వారి
ఐకమత్యమ్ము గలిగించు నధికహాని.

Thursday, 12 April 2012

రండాగమనంబు సేయ రమ్యంబ యగున్.


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 23-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రండాగమనంబు సేయ రమ్యంబ యగున్.


అమెరికా లో చదివి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నపిల్లల్ని తీసుకు రావడానికి స్టేషన్ కి బండి తీసుకు వెళ్తూ తండ్రి అనుకున్న మాటలు... 

కందము:
బండిని తోలుకు పోవలె
మెండగు చదువులు చదివి యమెరికా నందున్
తండా గన, పోరియు పో   
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్.

(పోరి,పోరడు = కూతురు,కొడుకు) 
(తండా = కుగ్రామము)  

Wednesday, 11 April 2012

సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 23-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్ 

కందము : 


కన్యామణి ప్రేమను గని 
ధన్యత వారిని కలుపగ - తలిదండ్రులె  తా 
మన్యుల నొల్లక  సొగసరి 
సన్యాసికి   పిల్ల నివ్వ సంబరపడియెన్.

(సన్యాసి అను పేరుగల వరుడు అని నా భావం)

Tuesday, 10 April 2012

మీనాక్షికి కుచములారు మీన శరీరా


శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 22-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మీనాక్షికి కుచములారు మీన శరీరా

మీనశరీరుడను చిత్రకారునికి చిత్రం యెలా గీయాలో చెప్తూ ... 

కందము : 


ఆనామము తగ్గట్టుగ
కానగ వలె కళ్ళు-యెత్తుగా గీయవలెన్
సోనాక్షికి,కామాక్షికి, 
మీనాక్షికి-కుచములారు మీన శరీరా!

Monday, 9 April 2012

అందవికారమె బ్రతుకున నానంద మిడున్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 22-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య -  అందవికారమె బ్రతుకున నానంద మిడున్


కందము : 
అందమె ఆనందంబగు 
సుందర భావనలు బెంచు సొగసే; మాపన్ 
పొందుగ కుత్సిత భావన 
లందవికారమె; బ్రతుకున నానంద మిడున్.

Sunday, 8 April 2012

ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 21-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య : ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.


కందము : 
  
కలవగ దలిచెను రావణు
దలపడి లంకను హనుమయె దనుజుల గూల్చెన్
కలబడనని నటియింపగ
ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.

Sunday, 1 April 2012

త్రాతకు జేజే


బ్లాగు వీక్షకులకు " శ్రీరామ నవమి " శుభాకాంక్షలు

కందము :
దశరథ సుతుడై, బంటుగ
దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
దశకంఠుని పరిమారిచి
దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే !