అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం కవితల పోటీ - 3 కొరకు వ్రాసిన పద్యములు.
అంశం: భక్తి
ఆటవెలది:
తల్లిదండ్రులందు తగు భక్తి దయలను
పుడమి జూపనట్టి పుత్రులేమొ
చెదలబోలు ననుచు జెప్పెగా వేమన్న
మహిని దీని దెలిసి మసలవలయు.
ఆటవెలది:
జీవనమున మంచి త్రోవనే సాగంగ
జ్ఞాన జ్యోతి నిచ్చు సద్గురువులు
వారి భక్తి తోడ గౌరవమ్మున జూచు
నట్టివారిని పరమాత్మ మెచ్చు.
ఆటవెలది:
గుడులు గోపురముల విడువక చుట్టిన
తీర్థ క్షేత్రములను తిరుగుచుండ
కనగ బరిసరముల కాలుష్యమేగాని
భక్తి లేనినాడు ఫలము రాదు.
ఆటవెలది:
పగటివేష "దొంగ బాబాల" నమ్మకు
మూఢ భక్తి తోడ మోసపోకు
క్రొత్త దైవ మనుచు గ్రుడ్డిగా పడిపోకు
చక్కటి యిలవేల్పు చాలు నీకు.
ఆటవెలది:
"లోని దృష్టి" గలిగి లోచనమ్ముల మూసి
గుండెలోన నున్న "గుడిని" గాంచి
ధర్మబుద్ధి భక్తి తలపుల "వెదుకంగ"
"దైవ" మచట నిచ్చు "దర్శనమ్ము"
No comments:
Post a Comment