తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 18 July 2022

"బొట్టు" కందాలు.


కందము:  

శ్రీకరమగు నిది నుదుట వ 

శీకరమని తలచ బోకు క్షేమంకరమౌ 

'ఛీ' కరమున తుడుపకుమా 

మీకరమే తిలక మిడగ మెత్తురు సురులే. 


కందము:

పుట్టిన పట్టికి దిష్టియె 

వట్టిగనే తగులకుండ పట్టుచు "చాదే" 

పెట్టును తల్లియె నుదుటన 

బొట్టిగ మన మొట్టమొదటి బొట్టది గదరా! 


కందము:

ళులుళులుళాయీ యనుచును 

తల ద్రిప్పెడు బిడ్డ నుదుట తంటాల్ బడుచున్ 

కలిపిన 'చాదును' బెట్టెడు 

తెలుగింటను తల్లిని గన తీయని తలపౌ. 


కందము:

ఇంటికి వచ్చిన బొట్టే 

ఇంటికి రమ్మనుచు  జెప్ప నింతికి బొట్టే

కంటికి "నో" యెబ్బెట్టే

వింటిరె మన సంసృతిగన వేడ్కగు నిట్టే! 


కందము:

గోటికి గోరింటాకే 

మేటిగ కాలికినిగజ్జె మీదట తీరౌ 

కాటుక కంటికి, జడయును 

బోటికియందమ్ము నుదుట బొట్టే సుదతీ!

 

కందము:

శోభను గూర్చునుగద నొక 

యాభరణము చేరియున్ననది మగువలకే 

ఆభరణమె బొట్టొక్కటి 

సౌభాగ్యమె నుదుట బెట్ట చక్కటి మోమున్.


కందము:

అద్దము చేతను బట్టుచు 

నొద్దికగా ముఖము గనుచు నొకచేతన్ తా 

ముద్దుగ నుదుటను కుంకుమ 

దిద్దెడు భంగిమ పడతికి తీరుగనుండున్.  


కందము:

నీమము వీడక కొందరు 

కోమలులే బొట్టు నుంత్రు క్రొత్తగ, కలిలో 

లేమకు చర్మపు రంగున 

నేమైనా "ఉంది" "లేద" నేటట్లుండున్. 

  

కందము:

హిందువు నీవేయైనచొ 

బిందువుగా నుదుట బొట్టు పెట్టుము చాలున్ 

అందునలౌకిక భావన

మందును మనమనమున కొక హాయే గలుగున్.


కందము:

తిలకము నుదుటన దిద్దుము

తిలకించుము మోము చుట్టు తేజము హెచ్చున్ 

పులకింతలు మది గలుగగ 

తిలకమవై సాటివారి  తీరును గనుమా! 


No comments: