తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 27 February 2013

పరదారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పరదారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్.

కందము:
కరమును పట్టిన చో శుభ
కరముగ బ్రతుకంత జంట కలిసి మనవలెన్
పరువుగ జీవించుచు చూ
పర ! దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్.

Tuesday, 26 February 2013

దత్తపది - రామ, చక్రి, హరి, విష్ణు - పదాలతో శివస్తుతి...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - రామ, చక్రి, హరి, విష్ణు -  పదాలతో  శివస్తుతి...

కందము:
రారా మదనారి శరణు
నేరము లెంచకు సలిపితి నీచక్రియలన్
తీరుగ హరించు వాటిని
వేరే గతి లేరు నాకు విష్ణుని సఖుడా !

Monday, 25 February 2013

రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

కందము:
రాముని, మునిజన హృదయా
రాముని వరగుణ జగదభి రాముని  సీతా
రాముని సఖుడౌ  గిరిజా
రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

Sunday, 24 February 2013

వ్యాకరణ మెఱుంగనట్టి వారె కవివరుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - వ్యాకరణ మెఱుంగనట్టి వారె కవివరుల్.

కందము:
కాకర బీకర కవితలు
వ్యాకరణము సుంతరాక వ్రాయుదు నేనే
శ్రీకరముగ గురు ముఖతః
వ్యాకరణ మెఱుంగ, నట్టివారె కవివరుల్.

Saturday, 23 February 2013

శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-02-2012 ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

తేటగీతి:  
ముగురు మూర్తుల జూడగా భృగువు వెడలె
భవుడు బ్రహ్మయు తనరాక పట్ట కుండ
నుండ కలతను జెందుచు నోప లేక
శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

Friday, 22 February 2013

శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

నిషిద్ధాక్షరి - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని స్తోత్రం
కందము:
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్. 

Wednesday, 20 February 2013

కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

కందము:
వేడిగ చేడియ
చేయగ
'మూడీ' గా ప్రేమ మీర ముచ్చట దీరన్
'మాడిన గీడిన' నుల్లి ప
కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

కందము:
కోడిని కోయన వేడి ప
కోడిని పెట్టన యన సతి, కోయకు గొంతున్
కోడిని వీడు మనుచును ప
కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.


కందము:
వాడికి బలమని డాక్టరు
కోడిని మరి గ్రుడ్లు కొంత క్రొవ్వును పెంచన్
వీడక తినమని చెప్పగ
కోడినిఁ దినువాఁడె మేటి గుణవంతుఁ డగున్.

Tuesday, 19 February 2013

పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్.
కందము:
పేదలు పెద్దగ మారగ
నూదర గొట్టుచు నెవరిని ఓట్లని యడుగున్
జూదము లాడెడి ప్రభుతకు
పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్.

Monday, 18 February 2013

సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట!
తేటగీతి:
విలువ లన్నింటికిని జూడ వలువ లూడె
మంచి నెంచెడు వారికీ మధ్య డబ్బు
కట్ట లెంచెడు వారలే కలుగు చుండె
సురభులకుఁ బుట్టుచుండెను ఖరము లకట! 

Sunday, 17 February 2013

దత్తపది - ఈగ, నల్లి, పేను, దోమ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - ఈగ, నల్లి, పేను, దోమ పదాలతో పాలకుల, అధికారుల అవినీతిపై స్వేచ్ఛా చందం...
తేటగీతి:
వారి నల్లిబిల్లిగ కల్పు బంధ మదియె
పేనుకున్నది చూడగా పెద్ద గాను
మట్టు బెట్టగ నేదెదో మహిమ లేదు
ఈ గతవినీతి నెలకొన్న నేమి చెపుదు.

Saturday, 16 February 2013

జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య  - జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

చంపకమాల: 

తన సతి, తమ్ముతోడ పిన తల్లియె తండ్రిని కోరి నంతనే
వనముల కేగి యచ్చట నివాసము జేయుచు నుండ మాయతో
జనకజ లంక జేర్చిన దశానను డైనటు వంటి ఇంద్రజిత్
జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

Friday, 15 February 2013

కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము.
ఆటవెలది:
'యంత్ర నయనములనె' అందెందొ  చొప్పించి
గుట్టు ' చిత్రముగను ' రట్టు జేసి
నిజము చూప బూను నిజ జర్నలిస్ట్లకు
కపట యతులఁ గనినఁ గలుఁగు ముదము. 

Wednesday, 13 February 2013

రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్.

కందము:
దేవతలారా చూడుం
డా వసుధను బుట్టె విష్ణు వసురుల వధకై
చావది లేని దనుజుడీ 
రావణుఁ డా? సీతమగఁడు రక్షించు మిమున్.

Tuesday, 12 February 2013

పూజ సేయ సిరులు పూజ్యము లగు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పూజ సేయ సిరులు పూజ్యము లగు.
ఆటవెలది:
పరగ మైల విధులు పాటించకే పూని
మనసు నందు శుద్ది మంచి బుద్ధి
లేక మొక్కు బడికి శ్రీ కరుడౌ శంభు
పూజ సేయ సిరులు పూజ్యము లగు.

Monday, 11 February 2013

ఆపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఆపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్

narayanudun   టైపు లో Y బదులు V పడితే అర్థ మిలా మారిందని నా భావన...
కందము:
టైపును నేనిటు జేయగ
"నాపన్నుల బంధు వయ్యె నా రాయణుఁడున్"
'వీ' పడె 'వై' బదులు కనగ
'నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్'



Sunday, 10 February 2013

బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

తేటగీతి:
బలము కావలె మనిషికి పనుల జేయ
దొడ్డ పనికిని మరి జూడ చెడ్డ పనికి
అవని నవినీతి పనిజేయు నట్టి గుండె
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.

Friday, 8 February 2013

శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!
రావణుని శాసనాన్నిధిక్కరిస్తూ హరి భక్తులు ఎవరికి వారు ఇలా అనుకున్నట్లు .......
కందము:
శ్రీ సతి పతికే పూజలు
చేసినచో రావణుండు చేతులు నరుకున్
బాసెద ప్రాణము లైనను
శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

Thursday, 7 February 2013

పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
తేటగీతి:
భారతమ్మును భాగవ తారు మొదట
నాది పర్వము జెప్పెను నాడు, నేడు
విన సభా పర్వమది వల్వ 'విలువ లూడ్చు
పర్వ' దినమని యేడ్చిరి సర్వజనులు.

తేటగీతి:
ధరను పెరుగగ నన్నింట ధరలు జూడ
తార లంటగ వంటకు  దారి లేక
పాయసంబును తిన గల్గు భాగ్య మపుడె
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు. 

Wednesday, 6 February 2013

కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్

కందము:
పన్నగ ధర శివ చాపము
పన్నగ శయ నుండు విరిచె పదుగురు చూడన్
కన్న రమ సీత,  దశరథ
కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్

 

Tuesday, 5 February 2013

జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

తేటగీతి:
శాంతి, ఎదురింట నుండు సౌజన్య మధ్య
పచ్చగడ్డిని వేసిన భగ్గుమనును
ముగ్గు వేయగ నొక్కరు మూతి ముడిచి
జలము పోయఁగ నగ్ని జ్వాజ్వల్యమయ్యె.

Monday, 4 February 2013

రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!

శార్దూలము:
రావే! నాటెను పూల బాణములనే రాచిల్క రౌతే మదిన్
నీవా గాయము మాపరావె సుదతీ నీ ముద్దు మంత్రమ్ముతో
నీ వాల్చూపుల శస్త్ర వైద్యమునకై నే మత్తులో మున్గితిన్
రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా! 

Sunday, 3 February 2013

గణ యతి ప్రాసలే లేని కైత మేలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గణ యతి ప్రాసలే లేని కైత మేలు.

తేటగీతి:
పద్య మన్నది వ్రాయంగ భయమనియెడి
ద్రాక్ష పండైన నమలగ దవడ లేని
చంటి వారికి పాల సీసాల వంటి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.

Saturday, 2 February 2013

కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల

ఆటవెలది:
' పిల్ల క్యారుక్యారు, పిల్లేమొ మ్యావ్ మ్యావు
కోకిలమ్మ కూకు, కోడి కూత
కొక్కొరోకొ '
యనెను కుక్క పిల్లను బట్టి
బుడుగు ముచ్చటించె బుజ్జి పలుకు.

Friday, 1 February 2013

కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

కందము:
ప్రారంభపు కవనములో
నారంభపు మంత్రమందు నన్నియు తెలిసే
తీరుగ వరుసగ శ్రీ ఓం
కారము వర్జించువాడు కాంచునె సుఖముల్