తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 8 September 2025

శ్రీరామ నామం

 || శ్రీరామ నామం || Srirama Namam Song || Bhakti Song || Goli Songs ||

"గోలీ" లు (97 - 103)

 రవళి మాస పత్రిక (సెప్టెంబర్ 2025) లో ప్రచురితమైన పద్యములు.


"గోలీ" లు (97 - 103) 


కందము: 

ఈశ్వరు డొక్కడె జగతిని  

నశ్వరుడై నిలచియుండు ననుచున్ మదిలో 

విశ్వాసము తో గొల్చిన 

విశ్వమ్మున నరుని బ్రోచు వినరా గోలీ! 


కందము: 

సందుల గొందుల మరి నీ  

ముందరనే నిలచియుండు మురహరి యెపుడున్  

సందియము వలదు నీకు ప  

సందుగ తా గానుపించు సరిగన గోలీ!   


కందము: 

బడియే విద్యార్థుల కిల

గుడియగునట, గురువుగారు కుల దైవమ్మౌ   

బడిపంతులు తనకే కన

బడినంతనె వందనమిడు ప్రభువే గోలీ! 


కందము: 

చక్కగ విశ్వాసమ్మును 

కుక్కయె తా జూపుచుండు కొలదిగ కుడుపన్ 

మెక్కుచు నెంతయొ, సుంతయు 

మక్కువ జూపని నరుడిక మందుడు గోలీ!  


కందము:   

తిట్టకు మోటమినెప్పుడు 

మెట్టది విజయమ్ము జేర, మీదకు జనుచున్ 

నెట్టుము వెనుకకు దానిని 

ముట్టెదవిక జయము, తీరు ముచ్చట గోలీ! 


కందము:

జూదములాడిన నెపుడున్ 

రాదోయీ సిరుల మూట, రాజులె జనిరే

ఖేదము జెందుచు నడవికి

కాదనవారెవ్వరైన గలరే గోలీ!   

 

కందము:

వాక్కను భూషణమున్న న

వాక్కగుదురు జూచు వారు వహ్వాయనుచున్ 

చక్కని పలుకుల ముందర

తక్కిన నగలన్ని గూడ తక్కువ గోలీ!