తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 26 February 2025

తండ్రివోలె మమ్ము దయను గనుమ.

 ఓం నమః శివాయ

మీకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

సీసము:
ధర్మమనెడి యెద్దు దానిపై నీవుండ
తరచి చూడగ మాకు ధర్మమేది?
దిక్కుల వలువలన్ దివ్యమై నీవుండ
తిక్కనుండెడి మాకు దిక్కదేది?
తెలివికన్ను గలిగి తెల్లమై నీవుండ
తెలిసి కొల్వ దగిన తెలివదేది?
భక్త సులభుడైన పరమాత్మ నీవుండ
పరగ దలచునట్టి భక్తియేది?

ఆటవెలది:
ధర్మము, సరి దిక్కు తలపున తెలియము
కొలుచు తెలివి, లేదు తలచు భక్తి
నీలకంఠ! శూలి! నిత్యమ్ము దరినిల్చి
తండ్రివోలె మమ్ము దయను గనుమ.



No comments: