తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 28 February 2025

సమయోచిత పద్యరత్నము – 85

 


ఉత్పలమాల:
కాలము లెవ్వియైన సరి గాచుచు హద్దుల  దేశరక్షకై
కాలును దువ్వు శత్రువుల గాలము జిక్కక,  దైర్యవంతులై
కాలుని లెక్కజేయకను, కండ్ల కుటుంబము దల్చి, వైరులన్
కాలుచునుండు రక్తమున గాల్చెడి సైనిక! వందనమ్మిదే!


Thursday, 27 February 2025

సమయోచిత పద్యరత్నము – 84

 

చంపకమాల:
ధనమును గోరి జీవితపు దారిని మిక్కిలి ప్రాకులాడుచున్
అనయము మోక్షసంపదల నాలయమందున జేరి కోరుచున్
వినయములేక సాగెదరు విజ్ఞత గోల్పడి, ప్రీతిగొల్వ సా
ధనమున లోకనాథునిక తగ్గును మోహము, ముక్తిగల్గుగా.


Wednesday, 26 February 2025

తండ్రివోలె మమ్ము దయను గనుమ.

 ఓం నమః శివాయ

మీకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

సీసము:
ధర్మమనెడి యెద్దు దానిపై నీవుండ
తరచి చూడగ మాకు ధర్మమేది?
దిక్కుల వలువలన్ దివ్యమై నీవుండ
తిక్కనుండెడి మాకు దిక్కదేది?
తెలివికన్ను గలిగి తెల్లమై నీవుండ
తెలిసి కొల్వ దగిన తెలివదేది?
భక్త సులభుడైన పరమాత్మ నీవుండ
పరగ దలచునట్టి భక్తియేది?

ఆటవెలది:
ధర్మము, సరి దిక్కు తలపున తెలియము
కొలుచు తెలివి, లేదు తలచు భక్తి
నీలకంఠ! శూలి! నిత్యమ్ము దరినిల్చి
తండ్రివోలె మమ్ము దయను గనుమ.



Tuesday, 25 February 2025

సమయోచిత పద్యరత్నము – 83



చంపకమాల:
శుకునకు దండ్రియౌచు, తగ జూడ పరాశర పుత్రుడౌచు, శ
క్తికి మరి పౌత్రుడౌచు ఘన తేజముగల్గిన బాదరాయణున్
సకలము భారతమ్ము పలు శాస్త్రపురాణములన్ని వ్రాసియున్
వికలములేని వేదనిధి విజ్ఞుడు, వ్యాసున కంజలించెదన్.


Monday, 24 February 2025

సమయోచిత పద్యరత్నము – 82

 

ఉత్పలమాల:
ఆకలి గల్గువేళ తిన నయ్యదియే యమృతమ్ము చూడ, చీ
కాకునుజూపబోక నడుగంగనె దానము నీయ దాతయౌ
చేకొను కార్యమందు శ్రమజేయుచు నోర్చిన మానవుండగున్
తేకువజూప జీవితపు తెన్నున తా కుల శ్రేష్ఠుడౌనుగా.


Sunday, 23 February 2025

సమయోచిత పద్యరత్నము – 81

 

చంపకమాల:
పరశువు బట్టు రాముడును, వ్యాసుడు నింకను యాజ్ఞవల్కునిన్  
ధరణిజ నాథు గొల్చు కడు ధన్యుడు మారుతి, ద్రోణ పుత్రునిన్  
మరియు విభీషణుండు, బలి, మాన్య కృపుండు,మృకండ సూతినిన్
అరయ హిరణ్యకశ్యపజు నందర దల్చిన నాయువబ్బుగా.


Saturday, 22 February 2025

సమయోచిత పద్యరత్నము – 80

 

ఉత్పలమాల:
ధీరులకుండు విద్యయును, తీరుగ మంత్రికి మెచ్చు రాజుయున్
ధారుణి స్త్రీలకున్ బతియు, దప్పని శీలము జూడనేరికిన్
మీరిన యందముల్, కనగ మీదట శీలము పోయినంతనే
జారును సంపదల్ కళలు, సత్యము పోవును వెంటనుండకన్.


Friday, 21 February 2025

సమయోచిత పద్యరత్నము – 79

 

ఉత్పలమాల:
వేదము చెప్పు శాస్త్రముల వీడక నాస్మృతి నాలకించుటల్
ఖేదము వీడ సత్పురుషు కేలది జూపిన బాట సాగుటల్
మోదముతోడ నాత్మ సరి ముందుగ జెప్పిన దాని నమ్ముటల్
కాదనరాదు వీటినివె కద్దుర ధర్మపు లక్షణమ్ములౌ.


Thursday, 20 February 2025

సమయోచిత పద్యరత్నము – 78

 


ఉత్పలమాల:
నేనిట "గోలి" వంశజుడ, నిక్కము "కాశ్యప"  గోత్రజుండనై
మానిత "సీతరామయయు" మానిని "సుందరి" కన్నబిడ్డగా  
జ్ఞానము బొంది నాడ, గన గ్రామము స్వంతము "పట్లవీడు" నా
కైనది "పల్లనాట", నిట "గర్తపురిన్" వసియించుచుంటిగా.


Wednesday, 19 February 2025

సమయోచిత పద్యరత్నము – 77

 

ఉత్పలమాల:
రాముడు సర్వలోకముల రంజిలజేసిన పాలకుండుగా
కామునిగాల్చినట్టి హర కంఠమునందున బల్కునామమే
రామునిపేరు, ధర్మమన రాముడె, సత్యపరాక్రముండు, సు
త్రాముని సర్వదేవతల రాజును, మించినవాడు రాముడే.


Tuesday, 18 February 2025

సమయోచిత పద్యరత్నము – 76

 


ఉత్పలమాల:
వామన బాలుడై బలిని పాదము బెట్టుచు ద్రొక్కె, గొడ్డలిన్
క్షేమమునెంచి రాజులను జేరి వధించెను భార్గవుండుగా
రామునిరూపు గూల్చె నిల రావణు, కంసుని జంపె కృష్ణుడై  
కామము ద్రోసె బుద్ధుడయి, కల్కిగ వచ్చును మాధవుండహో!


Friday, 14 February 2025

సమయోచిత పద్యరత్నము – 75

 


ఉత్పలమాల:

మత్తుడు సోమకుండు నిగమాలను దొంగిల జంపె మత్స్యమై

ఎత్తగుమంధరంపు బరువెత్తెను మూపున కూర్మ రూపుడై

చిత్తుగజంపి యాయసురు జేర్చెను పైకి ధరన్ వరాహమై 

మిత్తి హిరణ్యకశ్యపుని మేనుకు నిచ్చెను నారసింహుడై.



Thursday, 13 February 2025

సమయోచిత పద్యరత్నము – 74

 

ఉత్పలమాల:
నిండుగ చేదునింపుకొని నిల్చునియుండెడు వేపచెట్టునే
దండిగ కల్పవృక్షముగ దానిని మార్చెను సాయిదేవుడే
మెండుగ గారుగా సుధను మించిన స్రావము దానిక్రింద తా
నుండ మహత్త్వమందెగద యుక్తము వానిని దల్చి గొల్చుటల్.  


Wednesday, 12 February 2025

సమయోచిత పద్యరత్నము – 73

 

ఉత్పలమాల:
చూడగ వేంకటాద్రి సమ శోభిత క్షేత్రము కానరాదురా!
ఏడును యేడులోకముల నెక్కడ జూచిన గాంచలేమురా!
వేడగ నన్ని కష్టముల వెన్కకు నెట్టును వేంకటేశుడే
లేడుర యిట్టిదైవమిక లేడు గతమ్మున, ముందు రాడురా!


Tuesday, 11 February 2025

సమయోచిత పద్యరత్నము – 72

 

ఉత్పలమాల:
దానము జేయగాదలుప దప్పక శుద్ధిగ నుండగావలెన్
స్థానము జూడగా, నిడుట తప్పది శౌచములేకనుండినన్
దానమయోగ్యుకిచ్చుటయు, తామసమందురు మానసమ్మునన్
లోన దిరస్కరించు గతి లీలగ దల్చుచు నిచ్చుచుండినన్. 


Monday, 10 February 2025

సమయోచిత పద్యరత్నము – 71

 

చంపకమాల:
గెలిచినవాడు వేయుచును కేకలు సంతసమందుచుండుగా
కలతను జెందుగా మనసు గాయముజెందుచు నోడనొక్కడున్
చలనములేక నుండుగద శాశ్వత మియ్యవి గావటంచు తా
దలపుల, పొంగు, క్రుంగుటల దన్ని, సుఖంబుగ నుండు నొక్కడున్.


Sunday, 9 February 2025

సమయోచిత పద్యరత్నము – 70.

 

ఉత్పలమాల:   
భావన జేయనౌన? పరిపాలన సల్పెడి లోకబాంధవున్
కేవల మిట్టులుండునని కేకలువెట్టుచు జెప్ప శక్యమే?
చేవగ వేదమైన నిక జెప్పగ లేదుగ వాని మూలమున్
జీవనమందు సాధనము జేయుచు జూడగ వచ్చుగా మదిన్.


Friday, 7 February 2025

సమయోచిత పద్యరత్నము – 69.

 


మత్తేభము:
పరనారిన్ గని సోదరీ యనుచు, దా వద్దంచు నాభాగ్యమున్
పరులే యిచ్చిన, మిత్రుడై మెలగుచున్ భావించి శ్రేయమ్మునే
పరులే మెచ్చిన పొంగిపోక మదిలో, వారెట్లు కోపించినన్
మరలన్ గోపము జెందకుండ నిలువన్ మాన్యుండు శ్రేష్ఠుండగున్.


Thursday, 6 February 2025

సమయోచిత పద్యరత్నము – 68



చంపకమాల:
జలనిధి పుత్రి నీదు సతి, సత్యము బ్రహ్మయు నీదుపుత్రుడే
ఇలగనె తల్లి దేవకియె, యింద్రుని పుత్రుడు క్రీడి మిత్రుడే
తెలియగ భక్తులే శ్రుతులు, తీరగు భృత్యులు దేవకోటియే
తెలియని నీదుమాయ జగతిన్ గని గొల్చెద కృష్ణ! శ్రీహరీ!


Wednesday, 5 February 2025

సమయోచిత పద్యరత్నము – 67

 

చంపకమాల:
వినుమిక జీవనమ్ము కులవృత్తిని జేయుటె యుత్తమమ్మురా!
కనగను వర్తకమ్ము మరి కర్షక వృత్తియు మధ్యమమ్మురా!
ధనమును బొంద నోగు కడ దాస్యము జేయుట నీచమౌనురా!
వినకను నీచకర్మలను వేడ్కగ సాగకు చావుమేలురా!


Tuesday, 4 February 2025

సమయోచిత పద్యరత్నము – 66

 


ఉత్పలమాల:
పీడగ మంచమున్ బడని  వేదనబొందని చావుగావలెన్
వేడుక కాదులే పరుల వేడగ జేయకు మింతసాయమున్  
పాడెకు జేరువేళ నిను పాడిగ దర్శనమీయగోరెదన్
మూడగునా వరమ్ములను మ్రొక్కెద  నిమ్ముగ నిమ్ము దైవమా!


Monday, 3 February 2025

సమయోచిత పద్యరత్నము – 65

 

చంపకమాల:
వదలె పటుత్వమింక, మరి వచ్చెను చేతికి కర్ర సాయమై
వదలెను జుట్టుకున్ నలుపు, పండెనుగా తల తెల్ల తెల్లగా
వదులుగ మూలముల్ సడలి పైనను క్రిందను పన్నులూడినన్
వదలకనుండెగా నతని వద్దనె, బుద్ధికి నాశవీడకన్.


Sunday, 2 February 2025

సమయోచిత పద్యరత్నము – 64

 

ఉత్పలమాల:
వంకరబుద్ధి నా మదికి పట్టిన వాలును స్త్రీలు, శ్రీలపై
జంకదు ప్రక్కవారివని జక్కగ దెల్సియు, చంద్ర శేఖరా!
కింకరుడైతి నీకు, నిక కేలునబట్టి విరాగ రజ్జువున్  
శంకర! పాద స్తంభముల చక్కగ గట్టుచు, హాయి నింపుమా!