తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 28 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 115

 


కందము: 

"నిలువుమ! నిలువుమ!" నీక

న్నుల చల్లని నీలినీడ నుండుచు, పోనీ

చెలి నామనసే నిదురను 

వలపుల కవ్వింపు పాట వహ్వా!వహ్వా!




 


Wednesday, 27 September 2023

"గోలీ"లు - 74

 


కందము: 

అరువది తెచ్చుట కళయే

అరువదినాల్గగు కళలనె యదియొకటేమో!

కరవున దెచ్చిన యరువును

కరవకమును దాని దీర్పగావలె గోలీ!



Saturday, 23 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 114


కందము:  

"సందేహించకుమమ్మా"

సుందర రఘురాము ప్రేమ, సుచరితుడనుచున్

పొందికగా బాడితి వహ!

పొందగ తోషమ్ము మేము పూర్తిగ వినగా.


 

  

Monday, 18 September 2023

వలదు వలదు

  

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః


సీసము: 

ఓ బొజ్జ గణపయ్య! యొకనాటికిన్ నాకు  

బానరూపున పొట్ట వలదు వలదు

ఏకదంతుడ! నాకు నేవేళ జూడగా 

పండ్లూడు స్థితిగల్గ వలదు వలదు 

గుజ్జురూపస్వామి! గూనియు మరుగుజ్జు

వంటిజన్మయె నాకు వలదు వలదు

ఎలుకవాహ! కడుపు నేవేళ నెలుకలే 

పరుగెత్తు బాధలే వలదు వలదు


ఆటవెలది: 

విఘ్నరాజ! ఘోర విఘ్నమ్ములేవియు 

పనుల జేయువేళ వలదు వలదు

సిద్దిబుద్ధినాథ! సేవింతు, సద్బుద్ధి 

వరమునిమ్ము మరువ వలదు వలదు.




 

 


Thursday, 14 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 113

 

కందము:

"తొలివలపే పదె పదె" నను

పిలిచే యెదలోనజేసె ప్రియ! సందడినే

చెలియా! యనుచును బాడగ 

వలపులు గలుగుచును మదియె పరవశమగుగా.  



Tuesday, 12 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 112

  

కందము: 

"ఈ మౌనం ఈ బిడియం"

ఏమీ యాపాట వినగ నిక మౌనంగా

ప్రేమికులుందురె  పాడక?

గోముగ నేకాంతమందు గుసగుసలిడకన్. 


Sunday, 10 September 2023

ఘంటసాల పాటల "కందాలు" - 111



కందము: 

"ఏనుంగునెక్కి" పద్యము

వీనులబడినంత మాకు వేడుక గలుగున్

ఆ "నర్తనశాల" సినిమ 

మానసముల చివరి "సీను" మస్తుగ మెదలున్. 



Wednesday, 6 September 2023

"గోలీ"లు - 73


కందము: 

ఊరకనుండునె కాయము

మీరుచు తా బెరిగిపోవు మిక్కుటముగనే

ఊరకనుండక నేదో

తీరిక లేనట్టి పనుల తిరుగుము గోలీ!