కందము:
"అదిగో నవలోక"మ్మని
హృదయములే విడకనుండదేదో లోక
మ్మిదెసాగుదమని పాడుచు
నెద కమ్మని కలలుగందు రిల ప్రేమికులే.
తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"అదిగో నవలోక"మ్మని
హృదయములే విడకనుండదేదో లోక
మ్మిదెసాగుదమని పాడుచు
నెద కమ్మని కలలుగందు రిల ప్రేమికులే.
కందము:
"ఓచెలి! కోపమ?" పాటయు
ఆ చిలిపి పలుకుల హరియె యలుకల సత్యన్
తాచిన పాదము నొత్తుచు
తా చెప్పిన పద్యమాహ! తాకును మదినే.
కందము:
"చిటపట చినుకులు పడుతూ"
అటునిటు ముద్దయి తడిచిన యావేళలలో
నట బాడుదు రీగీతము
నటనేయొక చెట్టునీడ నహ! ప్రేమికులే.
కందము:
"మనసుగతి యింతె" యనుచును
మనిషిది బ్రతుకింతె యనుచు, మనిషికి మనసే
వినరా తీరని శిక్షని
మనసును కదలించు పాట మరువగ గలమా?
కందము:
"ఆ రజనీకర మోహన"
తీరుగనాగీత మెపుడు తీయగనుండున్
ఆ రాణియె "తల" నిండి, మ
జారే! పూదండ దాల్చి సరి మురిపించున్.
కందము:
"వెలిగించవె చిన్ని" యనుచు
వలపుల దీపమ్మననుచు పాడిన విధమే
యల చివరి వరకు వినగను
లలితముగా సాగు మనసు రంజిల్లునులే.
కందము:
"బుల్లెమ్మ సౌఖ్యమేనా"
పిల్లా గుబులాయనె యని ప్రియముగ ప్రియుడే
యల్లరి జేయుచు చెలినే
గిల్లినయట్లుండు పాట "కెవ్వున్ కేకే".
కందము:
"ఇదె చంద్రగిరీ" యనగను
ముదముననా తిమ్మరాజు ముచ్చట, తీరౌ
కదనము, కీర్తి సిరి కథయు
పిదపను గత వైభవమ్ము ప్రియముగ మెదలున్.
కందము:
"జగమే మాయా" పాటను
నిగమములలొ సారమంత నిజముగ తెలుపన్
వగయే సౌఖ్యమ్మనియెడు
తగుభావన మదిని నిలచి తా ముదమందున్.
కందము:
"ఏవమ్మ నిన్నెనమ్మా"
బావున్నారా యనుచును పల్కుల పాటన్
చేవగ బాడితివట, విన
మావదనము విచ్చుకొనును మరిమరి గోరున్.
కందము:
"వలపువలె తీయగా" విన
'తలుపులు మూయంగ నీకు తత్తరపాటౌ
జిలిబిలి నడకల సఖి' యన
కలికిది బిత్తరపు చూపు కదలును మదిలో.
కందము:
"సిగలోకీ విరులిచ్చీ"
సిగపూవది వాడకుండ చెలియది బ్రతుకే
వగజెందగ వాడెననుచు
తెగబాధగ బాడు పాట తీరే వేరౌ.
కందము:
జిల్లాయిలె జిల్లాయిలె
బుల్లోడూ పాతికేళ్ళ బుజ్జాయనగా
బుల్లెమ్మా చంక దిగని
బుల్లీపాపాయన విన పొంగును మనసే.
కందము:
"నా జన్మభూమి యెంతా"
భూజనులే మెచ్చుపాట, పుణ్యచరితుడా!
మాజన్మధన్యమే విన
హా!జీ! నాసామిరంగ హాయ్!హాయ్! హోయ్! హోయ్!
-
కందము:
"ఏమోయేమో యిది" నా
కేమేమో యైనదనుచు నీవేళననన్
ప్రేమగ నేదో గుబులౌ
మామది 'గిలిగింత పాట' మైమర"పిడుగా"
కందము:
"నారాయణ నీలీలా"
"భారతమున" నిట్టి చిన్ని పాటన్ వినగా
వీరుల జన్మమ్ము తెలియు వీనుల విందౌ.
కందము:
"ఎవరికి తలవంచకు" మని
ఎవరిని యాచించకనుచు నెన్నియొ సూక్తుల్
భువి నరులకు జెప్పిన యా
నవగీతము జూపుమాకు నవ్యపథమ్ముల్.
కందము:
"బులిబులి యెర్రని బుగ్గల"
చెలి చారెడు నీ కనులవి చెంపకననుచున్
చిలిపిగ పాడిన విధమే
తలపున నిలచును, వినగను తలనూగించున్.
12 మే 2023 ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ పీఠం (శ్రీ రావి రంగారావు గారు) గుంటూరు వారు నిర్వహించిన పోటీకి నేను పంపిన పద్యాలు.(ఈ బుక్ "తెల్లపావురాలు" లో ప్రచురించినారు)
"సిస్టర్" నర్స్
కందము:
దైవమె వైద్యుడు పుడమిని
దేవుని దూతలు నిజముగ తెలియగ నర్సుల్
సేవల జేయుచు రోగుల
"చావక" బ్రతికించబూను "శక్తులు" వీరే.
ఆటవెలది: :
చెల్లిగాని చెల్లి యెల్లరు నరులకు
అక్కగానియక్క యక్కరలకు
సోదరీమెయగుచు "సో' దరి నిలచును
సిస్టరనగ తాప్రసిద్ధినొందె.
ఆటవెలది:
పుట్టి కళ్ళు తెరచి పుడమి జేరుటనుండి
మట్టిలోన గలసి మడియు వరకు
నట్ట నడుమ జీవనమ్మున రుజలందు
సేవ జేయు మనల "సేవు" జేయు.
తేటగీతి:
మంచమున బడ తనవారు మరువ సేవ
సమయ మింతయు లేదని సణుగు వేళ
చెల్లి పోవుచు బంధముల్ చెడిన నాడు
"చెల్లి" చూచును మనుజుల నొల్లననక.
కందము:
"సిస్టరు" సేవలు రోగికి
"బూస్టరుడోసౌ"ను బ్రతుకు పొడిగింపంగా
"బెస్టు"ర రోగము దులుపగ
"డస్టరు" తానౌను, చిన్న డాక్టరు తానౌ.
కందము:
ఆ "నర్సు" సేవ మరువక
"ఆనర్సు"ను సలుపవలయు నవనిని వినరా!
"మేనర్సు" గలిగి నరులే
"డోనర్సు"గ క్షేమమెంచుడు మరికనైనన్.
కందము:
"తిరుమలగిరివాసా!"యని
వరదాభయ చిద్విలాస! పరదైవమనిన్
సిరిగలవాడా! యనగా
దరిజేరుచు బ్రోచుటకును తా దిగిరాడా!
కందము:
"తిరుమల మందిర సుందర"
కరుణా సాగర యనుచును కమ్మని పాటన్
తిరుగే లేనట్టి విధము
ధర మాకందించినావు ధన్యులమయ్యా!
కందము:
"రాగమయీ రావే! అను
రాగమయీ రావె" యనుచు రాగముదీయన్
మాగుండియ "లయ" దప్పక
నీగానములోన గలిసి నిజముగ బాడున్.