తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 28 February 2014

కరములు దిద్దంగలేని కరము కరమ్మే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కరములు దిద్దంగలేని కరము కరమ్మే



కందము:
మరి తెల్గు ఓనమాలను
వర వీణా పాణి యైన వాణిని కూర్మిన్
స్థిరముగ దలచుచు మోడ్చుచు
కరములు, దిద్దంగలేని కరము కరమ్మే?

Thursday, 27 February 2014

మం (చి) చు దేవుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మం (చి) చు దేవుడు

 
















తేటగీతి:
మంచు కొండన నివసించు మంచి దేవ
మంచు లింగమ్ము రూపున మహిని నిలచి
ఉంచి నీమీద భక్తి పూజించు వార్కి
మంచి జేతువు మహిమనే మంచు జెపుదు.

Wednesday, 26 February 2014

ఓడ నెక్కి పోదము రావె యోరుగల్లు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఓడ నెక్కి పోదము రావె యోరుగల్లు.


తేటగీతి: 
వరద వచ్చెను పొంగెనీ యేరులన్ని
ఊరు మొత్తము నిండెగా నీరు చూడ
నుండ లేమిట ప్రక్కనా యూరి వరకు
ఓడ నెక్కి, పోదము రావె యోరుగల్లు.

Tuesday, 25 February 2014

త్రిప్పు ఉత్సవము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - త్రిప్పు  ఉత్సవము.


 














 
తేటగీతి:
పంచ రంగుల మెరయు రాయంచ మీద
త్రిప్పు చుండిరి దేవుని గొప్పగాను
పంచ పరవశ మును, చూపు భక్తులెల్ల
త్రిప్ప లేకను చూచిరా రేయి నీట
.

Monday, 24 February 2014

చరణము,శరణము,తరణము,కరణము లతో శ్రీరామస్తుతి...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - చరణము,శరణము,తరణము,కరణము  లతో  శ్రీరామస్తుతి...

కందము:
చరణములను విడువక నీ
శరణమునే గోరు వారు సంసారమ్మున్
తరణము చేయుటకే యుప
కరణము నీవయ్య రామ ! కౌసల్య సుతా !

Sunday, 23 February 2014

ఆ "నందీశుడు"

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ఆ "నందీశుడు"









 









 


కందము:
నందీశుని పోటిగ నా
నందముతో ' పోజు ' జూపు నల్లని నందీ !
ఉందీ విబూది యట్లుగ
అందముగా మచ్చ జూడ నదిరెను నుదుటన్.

Saturday, 22 February 2014

తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె.

ఆటవెలది:
ధరణి జాత కాయె ధవునిగా రాముండు
అవని కేమొ భర్త హరియె జూడ
హరియె తాను గానారామ చంద్రుండు
తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె.

Friday, 21 February 2014

ఇంటికా... మింటికా...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఇంటికా... మింటికా...                        



 


















తేటగీతి:
ఇంటి కేగెడు తొందర ఇంగితమును 
కప్పి వేసె,  బస్సదుపును తప్పి నపుడు
మింటి కేగుదు రయ్యయో ! వింటి రోయి !       
అడుగు లెప్పుడు వేయుమా ఆచి తూచి.

Thursday, 20 February 2014

గత వి ' న్నాణెము '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - గత  వి ' న్నాణెము '





 
















కందము:
నాణెము చూడగ గత వి
న్నాణెము నందించుచుండె నాహా! ఓహో!
పాణిని కోదండమ్మును
నాణెముగా పట్టినట్టి నాధునకున్ జే!

Wednesday, 19 February 2014

కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.

కందము:
కల గనుచు మంచి భవితను
సలుపుచు తగు పనుల, పూర్తి సాధనములతో
బలమైన కృషిని జేసిన
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.

Tuesday, 18 February 2014

వరదా ! కావుము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - వరదా ! కావుము


 


 
















కందము:
వరదలు పొంగుచు  పొరిలెను
బురదయు, నీరాయె నూరు పొగిలెను గుండెల్
సరి పూరి గుడిసె వాసుల
కరివరదా కావుమయ్య కారుణ్యముతో.

Monday, 17 February 2014

సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా.


కందము:
ప్రీతిగ దలుతుము భక్తిని
మాతా పితరులె జగతికి,  మాహేశ్వరియే
ఖ్యాతిని బొందెను సతిగా
సీతా ! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

Sunday, 16 February 2014

" పండు " ముదుసలి శబరి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - " పండు " ముదుసలి శబరి. 




 




















కందము: 
పండు ముసలియగు  శబరియె
పండును తా రుచిని జూచి భక్తిని వెట్టన్
పండెను భాగ్యమ్మాహా !
పండును దినె రాము డపుడు పరమాత్ముండై
.

Saturday, 15 February 2014

బాల భరతుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం -   బాల భరతుడు 


 
















కందము:
చిరుప్రాయము నందున నా
చిరుతలు సింహాలతోడ చిరునవ్వులతో
భరతము పట్టుచు నాడెడు
భరతుడవే నీవు సుమ్మ బాలుడ భళిరా ! 

Friday, 14 February 2014

శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా

కందము:  
ఇల గౌతము సతి నిలచెను
శిలగా, మరి మారెతాను స్త్రీగా  తాకన్
జలజాక్షుని పాద రజము
శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

Thursday, 13 February 2014

కోడి ' పిల్లి ' లు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కోడి ' పిల్లి ' లు.


 













 

కందము:
తెల్లని పిల్లీ! రంగున
మల్లియలే చెల్లనటుల మరపించితివే!
పిల్లలు కోడివి చేరెను
తల్లి యొసగు వెచ్చ దనము తగిలిన దేమో !

Wednesday, 12 February 2014

కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

కందము:
మీరిన సంపద గలిగిన
వారికి తన పుత్రు నొసగ. వానికి జూడన్
చేరును సిరి, దత్తత స్వీ
కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

Tuesday, 11 February 2014

క్షీరాభిషేక మహిమ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - క్షీరాభిషేక మహిమ.




 



















కందము:
క్షీరముతో నభిషేకము
నోరారగ హరుని పిల్పు నిజముగ నరుడా
తీరగ జేయును పాపము
తీరుగ నీ బ్రతుకు తేరు తిరుగగ జేయున్.

Monday, 10 February 2014

వీ ( నీ ) ర జవాను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - వీ ( నీ ) ర జవాను 

 















కందము:
ఆలము చేయు 'జవానుడ '
పాలన గతి చెదరకుండ బరగెద వయ్యా !
ఆలపు మందల దప్పిని
పాలనొసంగగ నిజముగ బాపితివయ్యా !

Sunday, 9 February 2014

చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్. 


కందము:
చిత్రము ! చూ ' డాన్  లైన్లో  '  
గాత్రము వినబడును చూడ కనబడు, నేడీ
సూత్రము వ్యాప్తంబాయెను
చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.

Saturday, 8 February 2014

హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.


కందము:
వర గుణవంతుడు మారుతి
ధరజాతను వెతుక బోవ తరలెడు వేళన్
గురికుదిరి యవనిజ మనో
హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

Friday, 7 February 2014

పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్


కందము:
' పొగ ' రెక్కి పలికె నొక్కడు
' పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ '
  పొగులుచు దున్ననుకొనె  నే 
' పొగనెందుకు త్రాగలేదు పోయిన జన్మన్ '.

Thursday, 6 February 2014

రారా, పోరా, సారా, తేరా...భారతార్థంలో.. .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - రారా, పోరా, సారా, తేరా...భారతార్థంలో.. .
శ్రీకృష్ణుడు దుర్యోధనుని తో...

శార్దూలము:
రారాజా!విను నాదు మాటలికనీ రాజ్యమ్ము రక్షింపగా
పోరాటమ్మును జేయకున్న సుఖముల్ బొందేరుగా!నా మన
స్సారాటమ్మును జెందుచుండెనిక మీ సంధిన్ గుదుర్పంగ పో
తే, రాదీ తరుణమ్ము పంచు సగమున్ ధీశాలి కౌంతేయుకున్.

Wednesday, 5 February 2014

అష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్. 

కందము:
కష్టమె యష్టమి పనులకు
ఇష్టముగా  దుర్గ, కృష్ణు నే తలచిన దు
ర్గాష్టమి కనగ మరియు కృ
ష్ణాష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్. 

Tuesday, 4 February 2014

కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.


తేటగీతి: 
మృచ్చకటిక శకారులు పెచ్చు మీరె
తెలిసి తెలియని మాటల తెలుపు నిట్లు
లాగె ద్రౌపది చీరలు రావణుండు
కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.

Sunday, 2 February 2014

దయ్యము దైవమును చంపి ధరపై వెలసెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దయ్యము దైవమును చంపి ధరపై వెలసెన్


కందము:
దయ్యము దైవము కలువన్
కయ్యము రెండింటి నడుమ కలదెపుడైనన్
దయ్యమె పారును కడ, కే
దయ్యము దైవమును చంపి ధరపై వెలసెన్?

Saturday, 1 February 2014

దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్. 

కందము:
దేహ మనిత్య మ్మాత్మకు
గేహంబిదె యనుచు నెరిగి కీర్తించుచు తా
నూహను దేవునిపై సం
దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్.