తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 October 2013

నన,నీనీ, నును, నేనే - భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నన,నీనీ, నును, నేనే - భారతార్థంలో......


శ్రీ కృష్ణుడు అర్జునునితో..

కందము:
నేనే మూలము జగతికి
నీ నీ క్రియలన్నిటికిని నేనే మూల
మ్మో నర ! మన్నన సేయుము
చేనును కాపాడ లెమ్ము చీడను ద్రుంపన్. 

Tuesday, 29 October 2013

సూర్యోదయము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సూర్యోదయము. 



 













తేటగీతి:
ఉదయ బింబమ్ము ప్రొద్దుటే నిదుర లేచి
అంద మైనట్టి తన ముఖ మాత్ర పడుచు
యేటి యద్దము లో గిరి చాటు గాను
తొంగి చూచుచు నుండెను తొణక సిగ్గు

Monday, 28 October 2013

దశావతారముల్ ధరించె త్ర్యంబకుండుదారుడై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దశావతారం సినిమాతో విశేష ఖ్యాతి గన్న కమల్ హసన్ విశ్వ రూపం సినిమాతో ఇంకా యశస్సు పొందాలని ఆకాంక్ష..



సమస్య - దశావతారముల్ ధరించె త్ర్యంబకుండుదారుడై

పంచచామరము: 

విశేష ప్రజ్ఞ గల్గి నట్టి 'విశ్వ రూపు' డే కమల్
అశేష ప్రేక్ష కాళి మెచ్చ నాటి చిత్ర మందునన్
దశావతారముల్ ధరించె, త్ర్యంబకుండుదారుడై
యశస్సు బెంచి బ్రోచు గాక యబ్దముల్మరెన్నియో

Sunday, 27 October 2013

దశావతారములు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - దశావతారములు.
























కందము:
మీనము,కూర్మవరాహం
బా నరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ
జానకి మగడుగ, కృష్ణుడు
జ్ఞానియు బుద్ధుండు పైన కల్క్యగు హరి ! జే !      

Saturday, 26 October 2013

కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము 

2012 కలియుగాన్తమని మాయన్ కేలండరు ద్వారా తెలుసుకున్నామని చేసిన ప్రచారం తప్పని ఋజు వయ్యింది కదా...

ఆటవెలది:
గడచు వత్సరమ్ము కలియుగాంతమ్మని
' మాయ ' తెగల వలన మనకు తెలిసె
నేడు రేపు లందు నిక్కముగా జూడ
కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము

Friday, 25 October 2013

కల్క్యావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కల్క్యావతారము.


 

















కందము:
ఇలలో పాపము పెరుగగ
కలలో దలపంగ లేని ఘన ఘోరములన్
చెలగగ రా బోయెడు మన
కలి కల్మష నాశకుడగు కల్కికి జేజే!

Thursday, 24 October 2013

బుద్ధు డాతడు హింసా నిబద్ధు డెపుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బుద్ధు డాతడు హింసా నిబద్ధు డెపుడు


తేటగీతి:
కొమ్ము నొక్కటి నిడితివి కొడుక 'డా' కు
'బుద్ధు డాత డహింసా నిబద్ధు డెపుడు'
యిట్లు జెప్పగ వ్రాసితి వీవు జూడ
'బుద్ధు డాతడుహింసా నిబద్ధు డెపుడు'.

Wednesday, 23 October 2013

బుద్ధావతారము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బుద్ధావతారము 

 


















కందము:
బుద్ధిని బెంచగ నరులకు
నిద్దరలో శాంత్య హింస నిల్పగ మది స
ద్బుద్ధిని యోచించుచు పలు
పద్ధతులను జెప్పు బుద్ధభగవానుడ ! జే ! 

Tuesday, 22 October 2013

శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్

కందము:
పశు తుల్యుడు కాదా మరి
శిశుపాలుఁడు, ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్
వశుడగు విజయుడు కావున
పశువును తా గూల్చె నరుని ప్రక్కన నిల్చెన్.

Monday, 21 October 2013

శ్రీకృష్ణావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - శ్రీకృష్ణావతారము. 


కన్నయ్యను చూడాలంటే జ్ఞాన నేత్రాలు కావాలి.చర్మ చక్షువులు చాలవు.

























కందము:
మన్నును నాకిన నోటనె
వెన్నుడు జూపించె మిన్ను విశ్వము నంతన్
అన్నియు తానే యైనను
కన్నులకే కానరాని కన్నయ్యకు జే !

Sunday, 20 October 2013

బలరామావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బలరామావతారము.

























కందము:
హలధరునిగ మరి హాలా
హలధరునకు ప్రియ సఖుడగు హరి కగ్రజు గా
నిల రోహిణి సుతు,  రేవతి
నలరించిన పతిగ నిలచు యాదవునకు జే !

Saturday, 19 October 2013

రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.


కందము:
రాముడు రావణు జంపెను
క్షేమముగా వాని తమ్ము జేసెను రాజున్
ప్రేమలు నిండిన లంకను
రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

Friday, 18 October 2013

శ్రీరామావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - శ్రీరామావతారము.



















కందము:
దశరథ సుతుడై బంటుగ
దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
దశకంఠుని పరిమారిచి
దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే !

Thursday, 17 October 2013

పరశురాము నోడించె రావణుడు గినిసి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - పరశురాము నోడించె రావణుడు గినిసి

తేటగీతి:
శివ ధనుస్సును విరిచిన సీత భర్త
పరశురాము నోడించె, రావణుడు గినిసి
సీత నెత్తుకు వెడలగ చెలగి వాని
గూల్చి వేసెను రణమున కుపితు డగుచు.

Wednesday, 16 October 2013

పరశురామావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పరశురామావతారము.











 








కందము:
ఇరువది యొక్కటి మారులు
ధర దిరుగుచు నరపతులను దండించితివే ! 
పరశువు జేకొని,  వినగను
పరవశ మిడు చరిత యున్న బాపడ జేజే !

Tuesday, 15 October 2013

పొట్టి వానిభార్యపొడుగరి యఁట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పొట్టి వానిభార్యపొడుగరి యఁట 


ఆటవెలది:
అద్దె యింటి కొరకు నచట జేరెను వాడు
పొట్టి, వానిభార్యపొడుగరి, యఁట
నమ్మలక్క లంత హవ్వవ్వ యనుచును
బుగ్గ నొక్కు కొనిరి సిగ్గు యనుచు.

Monday, 14 October 2013

వామనావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - వామనావతారము.











 









కందము:
మూడడుగుల చోటు నడిగి
మూడగ బలి ద్రొక్కె గొలిచి ముజ్జగములనే
మూడడుగుల వడుగాతడు
వాడిడుముల బాపువాడు వానికి జేజే !

Sunday, 13 October 2013

కనకదుర్గా ! మాతా !

బ్లాగు వీక్షకులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

 














కందము:
కినుకను చూపకు మాపై 
కనకమ్మును కోరమమ్మ,  కారుణ్యముతో
గని మాకష్టములన్నిటి
దునుమాడుమ విజయ ! కనకదుర్గా ! మాతా !  


Saturday, 12 October 2013

నరసింహా నిన్ను నమ్మి నాశన మైతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నరసింహా  నిన్ను నమ్మి నాశన మైతిన్


హరి లేడూ, గిరి లేడూ అని వాదించి చివరకు నర సింహుని రూపంలో నున్న హరిని జూచి నోట మాట రాక హతమై పోతూ హిరణ్య కశిపుడు ఇలా అనుకొని వుంటాడని నా భావన....
కందము:
వర పుత్రుడు యశమును గను
నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్
నరసింహా నిను నమ్మక
హరి గిరి లేడని మదించి హతమౌ చుంటిన్!

Friday, 11 October 2013

నృసింహావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నృసింహావతారము.


 














కందము:
ఎందెందు వెదకి చూచిన
నందందే యుందు ననుచు నసురుని కపుడే
సందేహము దీర్చిన కను
విందగు నరసింహ రూప విష్ణువు నకు జే !

Thursday, 10 October 2013

పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్. 


కందము:
అందము లొలికెడు పాపడు
చిందులు వేయుచును, తల్లి చేరగ రాగా  
అందక పరుగిడుచును కొ
ప్పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

Wednesday, 9 October 2013

వరాహావతారము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - వరాహావతారము. 




















కందము:
ధరను హిరణ్యాక్షుడు తన
కరమూలము నందు బట్టి కడలిని దాగన్
తరలి వరాహపు రూపున
పరిమార్చిన హరికి భూమి భర్తకు జేజే !

Tuesday, 8 October 2013

కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

ఒక పార్కు లో ఏనుగు, తాబేలు రూపంలో నిర్మించిన కట్టడముల లోపల తిరిగి చూచాడని నా భావం.

కందము:

శ్రమనే తెలియక తిరిగెను
"కమనీయం" పార్కు నందు గల యేనుగు లా
యమరిన కట్టడమును మరి
కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

Monday, 7 October 2013

కూర్మావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కూర్మావతారము.

 














కందము:
పాల కడలి చిల్కెడు తరి
బేలగ దైత్యులు సురులును పిల్వగ విని తా
బేలుగ మారి గిరిని హరి
లీలగ వీపున నిలిపిన రీతికి జేజే!

Sunday, 6 October 2013

స్వాతంత్ర్యమువచ్చె మనకు సంబరమడగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - స్వాతంత్ర్యమువచ్చె మనకు సంబరమడగెన్.

కందము:
తాతల కాలము కాదిది
నీతిగ జీవించు వారు నిక్కము తగ్గెన్
నేతలజాతికి బొక్కెడు
స్వాతంత్ర్యమువచ్చె- మనకు సంబరమడగెన్.

కందము:
మూడగ బ్రిటీషు వారికి
మూడగు వర్ణము ల జెండ ముద్దుగ నెగిరెన్
నీడగ నిలచుచు దానికి
చీడలు పట్టక నిరతము సేవించవలెన్.

Saturday, 5 October 2013

మత్స్యావతారము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - మత్స్యావతారము.  



















కందము:
చదువుల నెత్తుకునేగెడి
ముదనష్టపు సోముకు మరి మోదితివయ్యా !
చదువులు  చేపగ మాకే
ముదమున  చేపగ నిలచిన మురహరి ! జేజే !

Friday, 4 October 2013

నాకు నీకు మాకు మీకు మనకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నాకు నీకు మాకు మీకు మనకు.

ఆటవెలది:
నాకు దేవుడనిన నారాయణుండేను
నీకు యేసు ప్రభువు నిజము, మీకు
అల్ల, జూడ దైవ మందర కొక్కడే
నాకు నీకు మాకు మీకు మనకు.

Thursday, 3 October 2013

లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ


కందము: 
గోలగ నుండెడు పాటల
నీలలు వేయుచును 'స్టెప్పు' లేవేయవలెన్
ఈలా తరములు మారెను
'లే లే నా రాజ' యనిన లేవఁడు రాణీ!

Wednesday, 2 October 2013

హరిశ్చంద్రుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - హరిశ్చంద్రుడు  

 













కందము: 
అమ్మనుజనాథు డయ్యెడ
నమ్మహిళామణినె యమ్మె నప్పును దీర్చన్
అమ్మో సత్యము నిలుపుట
కిమ్మహిలో కష్టతరమె యిది సత్యమ్మే. 

కందము: 
చంద్రమతీ వినుమ హరి
శ్చంద్రుడు నిన్నమ్ము చుండె సత్యము కొరకై
చంద్రుని కాంతులు వీడిన
చంద్రుడు తానాయె కాంత సరి సుతు గొనుమా ! 

Tuesday, 1 October 2013

చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

గుంటూరు జిల్లా నరసరావు పేట వద్ద నున్న కోటప్ప కొండ పై శివుడు' త్రికోటేశుని ' గా ప్రసిద్ధి. ఆ కొండ పైకి కాకులు రాక పోవటం ఆ స్థల మహాత్మ్యము.

కందము: 
ఏకాకులు దరిజేరని
యా కోటేశుని గిరి జని యర్చన జేయన్ 
లోకేశుడు తొలగించును
చీకాకులె, సుఖము నొసఁగి చింతలఁ బాపున్.