తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 30 March 2025

శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరకు శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.


కందము:
విశ్వావసు వత్సరమా!
విశ్వాసముతో బిలచితి, ప్రియముగ నీవే
విశ్వమునన్ సుఖశాంతుల
విశ్వంభరు కృపను మాకు వీడకనిడవే!


Thursday, 27 March 2025

సమయోచిత పద్యరత్నము – 108


ఉత్పలమాల: 
తెల్లని వస్త్రముల్ గలిగి, తేజము సర్వము వ్యాప్తి జెందుచున్ 
చల్లని వెన్నెలల్ గురియు చక్కని చంద్రుని కాంతి చాయతో 
నల్లన నాల్గు చేతులు,సుహాసపు శాంతపు మోము వానినే 
యుల్లమునందునన్ నిలిపియుంచుదు విఘ్నములన్ని బోవగన్. 


Wednesday, 26 March 2025

సమయోచిత పద్యరత్నము – 107

 

ఉత్పలమాల: 
కమ్మని జ్ఞానవంతులుగ గమ్మని దీవెనలందజేసి, మో   
దమ్మును బంచి, మా బ్రతుకు దమ్మున నీడ్చెడు శక్తినిచ్చి, దా
నమ్ముల జేయు బుద్ధి వదనమ్ముల తేజము బెంపుజేసి, న్యా
యమ్ముల వర్తనమ్ము, విజయమ్ముల నీయుమ, విశ్వరూపిణీ!


Tuesday, 25 March 2025

సమయోచిత పద్య రత్నము - 106

 

ఉత్పలమాల:  
వందనమేను జేతు ఘన వాక్కులు నేర్పిన తెల్గుతల్లికిన్
వందనమేను జేతు సరి బల్కిన తీపిని బంచు భాషకున్  
వందనమేనుజేతు నను పాలన జేసెడి తెల్గునేలకున్
వందనమేనుజేతు విని పద్యము మెచ్చెడి తెల్గువారికిన్.


Monday, 24 March 2025

సమయోచిత పద్య రత్నము - 105

 

ఉత్పలమాల: 
హత్తెరి చూడగానిది బృహత్తర కార్యమె, "చండ్రపాటి" చే 
క్రొత్తగు నొర్వడిన్ దెలిపె, కోరుచు వ్రాసెడు పండితాళికే
హత్తుకుబోయె మానసము నందున సత్యము"మోహనమ్ము"గా
నిత్తరి యర్చనల్ సలిపి రిచ్చట వాణికి నిట్టి సత్క్రియన్.


Sunday, 23 March 2025

సమయోచిత పద్య రత్నము - 104

 

ఉత్పలమాల:  
చక్కని సాహితీప్రియుల సంగమ మిచ్చట, తెల్గు నేలపై
మిక్కిలి శ్రద్ధతో కవులు మీరుచు పద్య సు "మాల" లల్లగన్
పెక్కురుజేరి రిచ్చటకు, పేర్మి సుమాలను నూటనెన్మిదిన్ 
వాక్కులమాత దీవెనల బంచగ, బేర్చిరి చూడ రండహో!


Saturday, 22 March 2025

సమయోచిత పద్య రత్నము - 103

 

మత్తకోకిల: 
రామదాసుడ! వాయుపుత్రుడ!రక్ష మాకిక నీవెరా
నీమమెంచుచు దల్తుమింకను నిన్ మహా మహిమాన్వితా!
స్వామినిన్నిక గోరి కొల్చిన చండ్రపాటి నివాస! మా
కేమికావలెనన్ననిత్తువు హే!నమో!హనుమాన్!ప్రభో!



Friday, 21 March 2025

సమయోచిత పద్య రత్నము - 102


ఉత్పలమాల: 
పుట్టుచు వాయుదేవునకు, పోవగ లంక జలమ్ముదాటి, యా
గట్టున జూచి భూమిసుత, భగ్గున మండెడు నిప్పుతోకతో
నట్టిటు లంకగాల్చి, కడ కాకస యానము జేసి రామునిన్
గట్టిగ జేరినావు, కన కైవసమైనవి పంచభూతముల్.



Thursday, 20 March 2025

సమయోచిత పద్య రత్నము - 101

 

చంపకమాల: 
బలమిక మెండుగానొదవు, బాగుగ వాక్కులు చేరివచ్చుగా!
నిలబడి పోరుసల్పుటకు నిశ్చల దైర్య, మరోగమందుగా!
కొలతకురాని బుద్ధి, యొనగూడును కీర్తి, ధరాతలమ్మునన్
గొలిచిన జాలు నిన్ మదిని, కోరక గోర్కెలు దీరు మారుతీ!


Wednesday, 19 March 2025

సమయోచిత పద్యరత్నము - 100



ఉత్పలమాల:
కానుర! నేను దేహమును, కద్దుగ మృత్యువదెట్లు వచ్చురా?
కానుర! నేను ప్రాణమును, కల్గవు దప్పిక లాకలెప్పుడున్
కానుర! నేను చిత్తమును, కన్పడ వెన్నడు శోకమోహముల్
కానుర! నేను కర్తనిక, కట్టులు విడ్పులవెట్లు గల్గురా?


Sunday, 16 March 2025

సమయోచిత పద్యరత్నము – 99

 


చంపకమాల:
ధనికుల యింటి ద్వారముల దానముగోరగ నిల్చియుండి చే
కొనుమని వ్రాసినాడవిక కొంటెగ గూర్చొని పద్మమందునన్
వినుమిక పద్మవాస!నిను వేడెద పాదములంటి, ఫాలమున్
కనబడనీక జేయుమయ, కాదని మార్చుచు నట్టి వ్రాతలన్.


Saturday, 15 March 2025

సమయోచిత పద్యరత్మ్నము – 98

 

మత్తకోకిల:
సన్మతుల్ భువి జేయుచుందురు జన్మకర్మల కల్పనల్
జన్మమెత్తిన వారుబొందగ సద్గతుల్, పలు స్తోత్రముల్
చిన్మయున్ బొగడంగ జేతురు చేరిజూడగ వేల్పుకున్
జన్మలన్నవి రావురా మరి, సత్యమంటవు కర్మలున్.


Friday, 14 March 2025

సమయోచిత పద్యరత్మ్నము - 97


ఉత్పలమాల:
తూరుపు కొండమీద సరి తూగుచు నూయలలూగు స్వామివే!
మీరుచు పశ్చిమంపు గిరి మీదుగ గ్రుంకెడు భాస్కరుండవే!
తీరుగ వెల్గు గుంపులకు తేజము గల్గిన నాథుడీవెగా!
చేరి దినాధిపుండగుచు జీవులగాచెడి నీకు మ్రొక్కెదన్.


Thursday, 13 March 2025

సమయోచిత పద్య రత్నము - 96

 

మత్తేభము:
భగవద్గీతను వీడబోకుమెపుడున్ పాఠమ్ముగా నేర్వుమా!
జగతిన్ శ్రీహరి వేయినామములనే సంకీర్తనల్ జేయుమా!
భగవాన్ శ్రీపతి ధ్యానమున్ సలుపుచున్ బాగైన దానమ్ము నిం
తగ నా పేదలకిచ్చి సజ్జనులతో ధర్మమ్ముగా సాగుమా!


Wednesday, 12 March 2025

సమయోచిత పద్య రత్నము - 95

 


చంపకమాల:
కృతయుగమందు మానవులు కేవల ధ్యానము జేయుచుంటచే
హితమగు యజ్ఞ యాగముల నెంతయు త్రేత నొనర్చుచుంటచే
సతతము దైవమున్ గొలిచి సద్గతి నొందిరి  ద్వాపరంబునన్
మితమదిలేని కీర్తనల మించుచు నీ కలి, ముక్తి వచ్చుగా.



Tuesday, 11 March 2025

సమయోచిత పద్య రత్నము - 94

 

చంపకమాల:
ధర వరుణుండు పేరుగల ధన్యమునీంద్రుని కొక్క పుత్రుడై
వరగుణ శీలవంతుడును బ్రహ్మమహర్షిగ లోకమందునన్
స్థిరముగ నిల్చి రత్నభర  శైలము మేరువు జేరి నా గుహన్
సరియెవరేని లేరనగ జక్కగ జేసె తపస్సు నయ్యెడన్.


Monday, 10 March 2025

సమయోచిత పద్యరత్నము – 93

 

చంపకమాల:
తలగడ యౌచు శ్రీహరికి తల్పముగా నగుచుండు భక్తితో
నిలకడతోడ శ్రీ విభుని నిత్యనివాసమునౌచు, కూర్చొనన్
జిలుగుల రాజపీఠమయి శ్రీధర పాదుకలౌచు, నిత్యమున్  
మెలకువతో ననంతుడట మెప్పుగ నచ్యుతు సేవజేయుగా.


Friday, 7 March 2025

సమయోచిత పద్యరత్నము – 92


ఉత్పలమాల:
రాజనువాడు మిత్రులను, ప్రక్కన జేరిన తోటి రాజులన్
తా జతజేరి రాజ్యమును దప్పక విస్తరణమ్ము జేయుటల్  
రాజుకొనంగ జేయుచును రాజక శత్రుల మధ్య స్పర్ధలన్
తేజముగల్గి పాలనను తీరుగ జేయుట ధర్మమే సుమా!


Thursday, 6 March 2025

సమయోచిత పద్యరత్నము – 91

 

ఉత్పలమాల:

బంగరుకాంతి మేనుగల పావన మూర్తియు యజ్ఞపూరుషుం

డంగుగనుండు రూపమున  యజ్ఞమునందున నుద్భవించెగా

భంగములేని వ్యాపకుడు భాస్కర తేజుడు నాసికంబులన్

హంగుగ శ్వాసవాయువుల నాశ్రుతులందెను శైబ్యకంఠుచే.  



Wednesday, 5 March 2025

సమయోచిత పద్యరత్నము – 90

 

ఉత్పలమాల:
ధర్మము నాచరించుటకు   ధైర్యము గావలె ధాత్రిలోపలన్
ధర్మము జూడ లాభమెది తానుగనీయదు  ముందునెప్పుడున్
కర్మనుజేయగా విడక  గల్గును శాంతియు నున్నతస్థితుల్  
ధర్మము రక్షజేయుగద  ధర్మమునేమరి రక్షజేయగా.  


Tuesday, 4 March 2025

సమయోచిత పద్యరత్నము – 89

 

చంపకమాల:

నరకపు ద్వారముల్ గదర నాశము జేసెడు త్రోవలవ్విరా  

పురుషుడు వీనిబారిబడ పోవును యోగ్యత,  పుణ్యవర్తనన్

మరువక కామ లోభముల మైకముజెందక క్రోధమున్ దగన్

నరుడిక వీడగా వలెను  నష్టము  మూడిటి వీడకుండినన్.



Monday, 3 March 2025

సమయోచిత పద్యరత్నము – 88

 


చంపకమాల:
అనయము కన్నలోకముల నమ్మగ గాంచుచు గాచుచుందువే  
మనసున దల్చబోను గన మాధవుడెవ్వడు లేడటంచు తా
వినయములేక వాగు నరు, వీడును నిన్ మది వానిదల్పగా  
ననవరతమ్ము మానసమునందున గొల్చెద నిన్నె కేశవా!


Sunday, 2 March 2025

సమయోచిత పద్యరత్నము – 87


ఉత్పలమాల:
దొంగలు కొట్టి చాటుగను దోచుకపోరులె, చేరి పంచను
ప్పొంగుచు వృద్ధినొందు నది, పోదు నశింప యుగాంతమందునన్
కొంగుననున్న పైడిగద, కూడిన విద్యలుగాద సంపదల్
వంగుచు నుండగాదగును పండితవర్యుల ముందు శ్రీపతుల్.


Saturday, 1 March 2025

సమయోచిత పద్యరత్నము – 86

 

  
చంపకమాల:
ముడుతలు నిండి మోమునకు ముద్దుల వన్నెలు తగ్గిపోయినన్
నడుమది వంగినన్, తలను నల్లనిజుట్టది తెల్లనైన, దా
వడలిన పండువోలె తన పట్టునుదప్పుచు దేహముండినన్
గడబిడజేయు కోర్కెలహ! కానగ లోపల కుర్ర చేష్టలన్.