తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 29 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 138

 

కందము: 

"వెన్నెల లోనా వేడి" యు 

వెన్నెలలోనా నదేల  విరహమ్మనుచున్

అన్నుల మి"న్నగు" చెలితో 

నెన్నుచు జాబిలిని, పాడ నేదో సుఖమౌ.

Wednesday 17 April 2024

దశరథ నందన

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః  

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.   


కందము: 

దశరథ నందన రాముని  

దశకంఠుని వైరి మరియు దయగల ప్రభువున్    

దశదిశల నున్న వానిని 

దశలవి మారును గొలువగ దక్కును సుఖముల్.




Monday 15 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 137

 

కందము: 

"ఇల్లాటి రోజు" మరియును

ఇల్లాటీ హాయి రాదు  హెహ్హే యనుచున్

చల్లాకి చిన్నదానితొ

అల్లీబిల్లిగను బాడుటదియొక హాయౌ. 

Sunday 14 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 136

 


కందము: 

"భూమ్మీదా సుఖ పడితే"

అమ్మో యీపాట మస్తు హాయిని నింపున్  

గమ్మత్తుగాను మనసుల

నమ్మధువే గొప్ప, యేల నమృతమ్మనుచున్.



Saturday 13 April 2024

బాల రాముడు

 జికె తెలుగు టాకీస్ వారి ఖగేశ్వరి ఉగాది పురస్కారములు 2024 న  

ద్వితీయ బహుమతి పొందిన  పద్యములు.


అంశం: "నేటి అయోధ్యలో బాల రాముడు" 


ఆటవెలది: 

"మోడి" విడక ధర్మ పోరాటమే సల్ప 

"రామజన్మభూమి" రగడ దీరె     

వందలేండ్ల పిదప నందెగా న్యాయమ్ము   

మందిరమ్ము వెలసె నందముగను. 


మోడి=పట్టుదల 


కందము:

పాలకుడే లోకములకు

పాలకడలిని పవళించు పరమాత్ముండే 

పాలను ద్రావెడి ముద్దుల 

బాలక రూపమ్ము నచట బాగుగ నిలచెన్.


చంపకమాల: 

జననియు జన్మభూమియును స్వర్గముకంటెను గొప్పదన్న నా   

యినకుల భూషణుండు జగదీశుడు కొల్వయె నీ యయోధ్యయే 

తన నిజ జన్మభూమియని, ధన్యతనందిరి భక్తులెల్లరున్ 

మనముల "రామలల్ల మము మన్నన సేయు”మటంచు మ్రొక్కుచున్. 


ఉత్పలమాల: 

ఒద్దిక మందిరమ్ము ఘనమొప్పగ గట్టిరి గా యయోధ్యలో

ముద్దుల బాలరాము సరి మోమును జెక్కిరి సొంపుమీరగా  

పెద్దగ మంత్ర యంత్రబల విగ్రహ మచ్చట నిల్పినారహో

వద్దిక జాగు, సాగుడిక వానిని జూడగ జన్మ ధన్యమౌ. 


ఉత్సాహము:

వరగుణముల రాఘవుండు "బాలు" రూపు నిలువగా   

భరత భూమి సంతసించి భాగ్యమింక నాదనెన్  

త్వరితగతిని భక్తులార!  దర్శనమ్మునందరే! 

స్వరము బెంచి "రామ" యనుచు భక్తి భజన జేయరే! 


Friday 12 April 2024

తప్పులు లేక సాగుడిక

 "భావుక" FB  సమూహము  వారు నిర్వహించిన "క్రోధి" "ఉగాది కవితల పోటీ" లో బహుమతి పొందిన నా పద్యములు.


ఉత్పలమాల:

కాలము మీది గానితరి గష్టములెన్నియు సైపగావలెన్  

గాలము వీడిపోవు, సరికాలము వచ్చి వసంతమందులే

సోలక రండు మీరనుచు, సోయగమొప్పగ గూసె కోయిలల్

జాలినిజూపి "క్రోధి" మము జక్కగ జూడుమ నీదు పాలనన్.

ఉత్పలమాల:

చప్పని జీవితమ్ములిక చప్పున మారగ జేయ బూనుచున్  

రొప్పక తీపి చేదు వగరున్మరి బుల్పుయు నుప్పు కారమే  

యొప్పిన లేహ్యమున్ దినుచు నుత్సహమంది యుగాదివేళలో  

తప్పులు లేక సాగుడిక ధైర్యమునందుచు వెల్గు దారిలో.

 


Tuesday 9 April 2024

"నగు" నుగాది.

 అందరకు "క్రోధి"నామ నూతన సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు.

 

కందము: 

క్రోధియను వత్సరము, వి

రోధములును జనుల కెపుడు రుజలే లేకన్

బాధలు దొలుగగ వలెనని

మాధవునే వేడుకొందు మనసున నెపుడున్.  

 


సీసము: 

ఉచిత తాయిలముల నూరింతయే తీపి  

కరకు మాటలనుట కారమగును   

మందు విందులనిచ్చు మచ్చికయే చేదు   

బాసలెన్నియొ జేయు పలుకు వగరు

పోటిదారుని దిట్టు పోకడయే యుప్పు

బలుపు చేష్టలవియె  పులుపు గదర 

కాకులెన్నియొవచ్చు కోకిల కూతలన్

సంతగా నిదిగొ వసంతమనుచు  

 

తేటగీతి:

ఎన్నికల పండుగది వచ్చె నెంచి మంచి

నాయకులకును మీ ఓటునయముగాను 

వేయ రాష్ట్రమ్ము దేశమ్ము వెలుగులీని 

ఐదునేడులు మీకింక "నగు" నుగాది.     


Tuesday 2 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 135



కందము:
"నీ పేరేంటో చెప్పు" అ
నేపాటయె, యింటిపేరునే చెపు బేబీ!
నూ పాలరాతి బొమ్మని
ఆపానుపు జేరుగుర్తు ననుటయె వహవా!



Monday 1 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 134

 

కందము: 

"చెప్పాలని వుందీ" యను   

గొప్పగు పాటను వినగను కోరిక కలుగున్ 

అప్పటికప్పుడు చెలితో

చప్పున మాట్లాడినట్లె సరి మది తోచున్.