తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 5 April 2020

కరోనా "కందము"లే....

కరోనా "కందము"లే....

ఊహాన్ నగరిని బుట్టెను
ఊహకు రానట్టి కీడు నుర్విని బెట్టెన్
ఆహా! 'కరోన వైరస్'
హాహాకారమ్ములంటె నయ్యో! భువిలో.

కంటికి కనబడదట మరి
వింటిలె యంటగ జనునట వేగము తోడన్
జంటగ గూడిన నష్టమె
యొంటిగ దూరమ్మునుంట నొక భద్రమ్మౌ.

చేతులు 'సబ్బు'న గడుగక
మూతిని కండ్లను తరచుగ ముక్కును దాకన్
ఖాతరు జేయక దిరిగిన
భీతిని గలిగించు 'జబ్బు' పిలువక జేరున్.

'మాస్కు'ను గట్టుక మూతికి
చూస్కుని పరులకు దూరము జూచుచు నడువన్
'రిస్క'సలుండదు, కాదని
పూస్కుని రాస్కుని దిరిగిన పోదువు పైకే.

పొడిదగ్గు,గొంతునొప్పియు
వడివడి నూపిరిని బీల్చి వదలుట, నొప్పుల్
గడబిడ కడుపున, జ్వరమది
విడువక నుండిన గలువుము వేగమె వైద్యున్.

కొద్దిగ నలతయె గలిగిన
పెద్దగనూహించుచుండ వేయును భయమే
వద్దు యలక్ష్యము చని నా
ప్రొద్దున వైద్యుని గలువగ బోవునదటులే.

తమ వారిని తమ ఇండ్లను
తమ సౌఖ్యము లెక్కనిడక తమ ప్రాణమ్ముల్
క్షమ తోడ సేవజేసెడి
శ్రమజీవులు, వైద్యులు, మన రక్షకులకు జై.

ఇటలీలో పెరిగినదని
ఇట 'లీస్ట'ని పొంగిపోకు మిక 'లక్ డౌనౌ'
నిట 'లాక్ డౌన్' బాటింపక
నిటలాక్షుడు బ్రోవబోడు నిన్నిక వినుమా!

పాలకులు శాస్త్రవేత్తలు
మేలగు సూచనలనీయ మీరక జనగా
లీలగ దీరుచు నిడుములు
కాలమ్మే మారిపోవు గద, శుభమగుగా.

అందము గెలిచెదమని, నీ
కందములేయని కరోన! యణచెదమనుచున్
అందరమొకటై నిలచిన
పొందెదముగ జయము, పారి పోవు 'కరోనా'.

Thursday 2 April 2020

"సురవైరు"లు "వైరసు"లయి

శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

కందము:
"సురవైరు"లు "వైరసు"లయి
ధర నరుల "కరోన" పేర దాడిని సలిపెన్
పరుగున వరగుణ రావా!
కరుణను కోదండరామ! కావగ రారా!

కందము:
మా యిల్లు ఋష్యమూకము
మూయుచు మేముండ, "వాలి" ముష్టి "కరోనా"
చేయదు దాడిని, రామా!
వేయుచు బాణమ్ము జంపి వేయుము దానిన్.