తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 31 July 2019

సినిమాకు "వంద"నం - 49

సినిమాకు "వంద"నం - 49

ఆటవెలది: 
సన్నగొంతు కలికి, సన్నాయితో పోల్కి 
పిల్లవాని పలుకు ప్రియము గొలుపు 
సరిగమలకు పోటి సరి నవ్వులో ధాటి 
జానకమ్మ పాట తేనెయూట.

Tuesday 30 July 2019

సినిమాకు "వంద"నం - 48

సినిమాకు "వంద"నం - 48

ఆటవెలది: 
గానమందు భువిని గంధర్వుడైనాడు 
పాట 'గీత' మార్చె పాటవముగ 
పాటవిరులలోన భావసౌరభమిడి 
పంచె ఘంటసాల 'పాడి' మనకు.

Monday 29 July 2019

సినిమాకు "వంద"నం - 47

సినిమాకు "వంద"నం - 47

ఆటవెలది: 
సాహసమ్ములోన సాటిలేరితనికి 
సాటి నటులయందు స్టారితండు 
తెలుగు 'జేమ్సుబాండు', తెర 'నటశేఖర' 
కృష్ణయనిన నాటి 'కిక్కు' వేరు.

Sunday 28 July 2019

సినిమాకు "వంద"నం - 46

సినిమాకు "వంద"నం - 46

ఆటవెలది: 
ప్రియుని పాత్రలందు పేరునొందినవాడు
కవుల పాత్రలకును గట్టివాడు 
త్రాగుబోతు నటన దానెగా 'సామ్రాట్టు' 
ఎన్ననొక్క పేరె  యేయెనారు. 

Saturday 27 July 2019

సినిమాకు "వంద"నం - 45

సినిమాకు "వంద"నం - 45 

ఆటవెలది:
రామకృష్ణులకును రారాజు రావణ 
రాజుపాత్రలకును రాజితండు 
నాటితెనుగు సిన్మ నటసార్వభౌముండు 
ఎవ్వడనగనేల యెన్టియారు. 

Friday 26 July 2019

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 07 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ 

 కందము: 
కమ్మని యిరువది పండ్లవి
అమ్మాయీ నీకునిత్తు నందున సగమున్ 
ఇమ్ముగ జేతను బట్టితి
తొమ్మిది, లోనొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ!

సినిమాకు "వంద"నం - 44

సినిమాకు "వంద"నం - 44 

ఆటవెలది: 
యస్వియారు కెదుట నెంటియార్, మాధవ
పెద్ది ఘంటసాల పద్దెములకు 
పోటి నటన జూడ నాటి సిన్మాలలో 
విందు లందు కనులు, వీనులకును.

Thursday 25 July 2019

సినిమాకు "వంద"నం - 43

సినిమాకు "వంద"నం - 43  

ఆటవెలది: 
సినిమలోన నేడ్పు సీనునే జూడంగ
కంట నీటిబొట్టు కదలిరాని 
హాస్య దృశ్యమునకుహాయిగానవ్వని 
మనిషి రాయి కనగ మరి కసాయి. 

Wednesday 24 July 2019

సినిమాకు "వంద"నం - 42


సినిమాకు "వంద"నం - 42


ఆటవెలది: 
ఒంపుసొంపులన్ని వేంపు పాత్రలు జూపె 
నాటి సినిమలందు, నేటి మేటి 
నాయికగన జూప'నా యిక' నేనన 
'పాత్ర'లన్ని నాస్తి వారికయ్యె.

Tuesday 23 July 2019

సినిమాకు "వంద"నం - 41

సినిమాకు "వంద"నం - 41

ఆటవెలది: 
అతిథి చేరిరాగ నానాడు సినిమాకు 
వెడలగాను గలుగు వేడ్క మనకు 
మేటి తెరల వదలి 'గూటి తెరల' జూడ 
చిన్నబోయె సినిమ, చిట్టి! నేడు.

Monday 22 July 2019

సినిమాకు "వంద"నం - 40

సినిమాకు "వంద"నం - 40

ఆటవెలది: 
పాటకన్నెకేమొ మేటిగా సంగీత 
హారములను వేయ నందమొదవు 
మోము గనపడకను మోటుగా "మోతైన" 
ఘోరమగును గాని హారమగునె.

Sunday 21 July 2019

సినిమాకు "వంద"నం - 39

సినిమాకు "వంద"నం - 39

ఆటవెలది: 
యోగ, డ్రిల్లు గలుపి యూగించు నాట్యమ్ము  
అరుపు, వణుకు, మూల్గు, విరుపు పాట 
బట్ట బయలు జేయు బట్టల ఫ్యాషన్లు 
సినిమ ఫార్ములాలు కనగ నేడు.

Saturday 20 July 2019

సినిమాకు "వంద"నం - 38

సినిమాకు "వంద"నం - 38

ఆటవెలది: 
గొందినున్నవాని "నంది" బట్టగజేయు  
సందునున్న భామ "సుందరి " యగు 
గల్లివారికైన "గగన" మందగజేయు 
చిత్రసీమ జూడ "చిత్రసీమ."


Friday 19 July 2019

సినిమాకు "వంద"నం - 37

సినిమాకు "వంద"నం - 37

ఆటవెలది: 
అధిక జనులు మెచ్చునది సిన్మ గావున 
భాష, సంస్కృతులవి పాడుగాక 
అతిని జేయకుండ నన్నియు రసముల 
నందజేసి జూప నందమగును.

Thursday 18 July 2019

సినిమాకు "వంద"నం - 36

సినిమాకు "వంద"నం - 36 

ఆటవెలది: 
సినిమ 'షో'గ జూచి జీవితమ్మందున 
మంచిచెడుల నరసి మసలుకొనుము 
'రీలు' లైఫు వేరు 'రియలు' లైఫే వేరు
తెలిసి గనుము వెండి తెరను నీవు.

Tuesday 16 July 2019

సినిమాకు "వంద"నం - 35

సినిమాకు "వంద"నం - 35

ఆటవెలది: 
జగమునందుగలదె సరి యిందులోనుండు 
ఇందులేనిదేది యిలను లేదు
వ్యాస దేవుడపుడు భారతమ్మున జెప్పె 
సినిమకైన నదియె చేరి పొసగు.

Monday 15 July 2019

సినిమాకు "వంద"నం - 34

సినిమాకు "వంద"నం - 34

ఆటవెలది: 
అందమున్నజాలు నధరాలతడి చాలు
నెత్తులున్న జాలు హత్తుకొనగ 
నాభిశోభ చాలు నటనమక్కరలేదు 
'సినిమ' నాయికలకు శ్రీనివాస.



Saturday 13 July 2019

నాన్న


నాన్న

కందము:
అమ్మయె దైవము సంతుకు
అమ్మకు దైవమ్ము తండ్రి యవనిని జూడన్
ఇమ్మను వాటిని వదలక
నిమ్మహిలో నాన్నయిచ్చు నిష్టముతోడన్.1

కందము:
విత్తనము నాన్న బ్రహ్మయె
విత్తమునే పంచి యిచ్చు విష్ణువు కాదా
చిత్తమున చెడ్డ భావన
చిత్తగు నట్లుగను గాల్చు శివుడే గదరా.2

కందము:
పొట్టన నుంచుక తల్లియె
పుట్టుక తానిచ్చి సంతు బుడమిని నిలుపున్
పొట్టన గుండెలనిడుకొని
పట్టుక తాతండ్రి నేర్పు పుడమిని నడకన్.3

కందము:
బుజ్జాయి గుండెపైనిడి
జొజ్జోయని వీపుదట్టి జోకొట్టుచునే
అజ్జొల్లు మూతి దుడుచుచు
బజ్జుండగబెట్టు నాన్న వాత్సల్యమహో!4

కందము:
ఆరోగము వచ్చినచో
నారోగ్యము బాగుజేయు నాన్నయె, కన్నా
ఆరోప్రాణము నీవను
ఆరోజులు మదిని దలుప నారోగ్యమ్మే.5

కందము:
ఎన్నగ కష్టములున్నను
నాన్నయె తా "నగుచు" నిచ్చునన్ని సుఖమ్ముల్
మిన్నగ పిన్నలకెప్పుడు
నన్నియు 'తానగుచు' నేర్పు నవనిని విద్యల్.6

ఆటవెలది:
పిన్న వయసునందు పిల్లల మనసున
భవిత బీజములను పాదుగొలిపి
పాటుబడును వాని పండింప తండ్రియే
పండువరకు తాను పండుకొనడు.7


కందము:
కడుపున బుట్టిన వానిని
కడుకొను ప్రేమలను తండ్రి ఘనముగ బెంచున్
కడు పుణ్య పురుషుడాతడు
కడుపున తినకున్న, సుతునకన్నము బెట్టున్.8

ఆటవెలది:
బుగ్గమీద నిమిరి ముద్దిచ్చునా వ్రేలు
నడక లోన బడక నడుపు వ్రేలు
తప్పుజేయునపుడు దడిపించునా వ్రేలు
జ్ఞానపథము జూపు నాన్న వ్రేలు.9

ఆటవెలది:
శతక పద్యములను శ్రద్ధగా నేర్పించి
పంచతంత్ర కథల మంచి దెలిపి
పోతనార్యు బలుకు బ్రీతిగా బలికించి
నవ్య పథము జూపు నాన్న ఘనుడు.10

కందము:
అడుగులు నేర్పుచు సుతులకు
నడుగుచునే మంచిచెడుల నన్నిదినమ్ముల్
అడుగున బడకను జగమున
నడుగడుగున తోడునుండు నాన్నకు జయహో!11

ఆటవెలది:
తనదు ప్రక్క వాడు తనను మించిననాడు
తట్టుకొనగలేడు ధరణి నరుడు
తానె ప్రక్కనుండి తనను మించగజేయు
నయముగాను సుతుని నాన్న, నిజము.12

తేటగీతి:
పండు కొనువేళ పొట్టనే పరుపుజేసి
కూరుచొనుటకు వంగుచున్ గుఱ్ఱమగుచు
దొరకు దోబూచులాటలో దొంగయగుచు
శిశువు నాడించు నాన్నకే చేతు నతులు.13

కందము:
కలలను గనుటయు నేర్పును
కలనాడున తోటివారి గనుటయు నేర్పున్
కలలవి కూలిన, నాన్నయె
కలతల బడకుండునట్టి ఘన'తల' నేర్పున్.14

కందము:
మనసున నుండని కోపము
కనులను కనుపింపజేసి కనుచును సుతులన్
ఘనులని తనకనిపించగ
కనిపించగజేయు తండ్రిగద నలుగురికిన్.15

సీసము:
పసితనమ్మునతాను పడకలో దరిజేరి
పంచు వెచ్చదనము పడక చలిని
పదములేరాగను పరుగువెట్టుచునుండ
పదములే బలుకును పదిలమనుచు
నయమున భయమున స్వయముగా ముందుకు
భయము 'నయము'జేసి పంపుచుండు
ఆకలికేమేమి యారోగ్యమో జెప్పు
ఆ కలిధర్మమ్ము లన్నిజెప్పు

ఆటవెలది:
నడక తోడ నేర్పు నడతను, పిల్లల
కోర్పువిలువ, నేర్పు గూర్చి నేర్పు
బుజ్జి చిన్నియనుచు బుజ్జగించుచు వారి
పెంచిపెద్దజేయు మంచి నాన్న.16




Friday 12 July 2019

సినిమాకు "వంద"నం - 33

సినిమాకు "వంద"నం - 33

ఆటవెలది: 
వీణ పాటలు మరి విప్లవగీతాలు 
లలిత హాస్య కరుణ లాలిపాట 
లెన్నొ నాడు వినగ మన్నేను మనసున 
నేటి తాలు పాట నేల గలిసె.

Thursday 11 July 2019

సినిమాకు "వంద"నం - 32

సినిమాకు "వంద"నం - 32 

ఆటవెలది: 
తెలుగుపేరు లేక తెలుగింటి నటి లేక 
తెలుగు వాసనుండు పలుకు లేక 
తెలుగు పాట పదము తెల్లముగా లేక 
తెలుగు సినిమ నేడు "తెల్ల" బోయె. 

Wednesday 10 July 2019

సినిమాకు "వంద"నం - 31

సినిమాకు "వంద"నం - 31

ఆటవెలది: 
చవితి పండుగపుడు సరదాల దసరాన
కనగను తిరునాళ్ళ కాలమందు
'పెండ్లి' దినమునాడు 'పెద్దదినము' నాడు 
"వీధిసినిమ" లపుడు వేడ్క లాయె.

Tuesday 9 July 2019

సినిమాకు "వంద"నం - 30

సినిమాకు "వంద"నం - 30

ఆటవెలది: 
భావగర్భితముగ పదునైన మాటల
పాట వ్రాసినట్టి పండితుండు 
సినిమ పాట లోన చెవులార వినరాక
"బీటు" పోటు తగిలి బిక్క జచ్చె.

Monday 8 July 2019

సినిమాకు "వంద"నం - 29

సినిమాకు "వంద"నం - 29

ఆటవెలది: 
అమ్మ పనుల జెప్ప నల్లరి పిల్లలు 
కాళ్ళు నొప్పులనుచు కదలకుంద్రు 
సినిమపేరు జెప్ప సీనులే మారును 
మైళ్ళు నడిచి జూచి మరలుచుంద్రు.


Sunday 7 July 2019

సినిమాకు "వంద"నం - 28

సినిమాకు "వంద"నం - 28

ఆటవెలది: 
కనుల నీరు జారు కష్టాల సినిమాలు 
కనగ నాడు నిజము గాదె, నేడు 
కష్టబడుచు జూడ కనులవెంటనె నీరు
జారు గాదె మనకు బోరు తోడ. 

Saturday 6 July 2019

సినిమాకు "వంద"నం - 26

సినిమాకు "వంద"నం - 26 

ఆటవెలది: 
పాత 'సినిమ' లందు 'ఫార్ములా'యొకటుండె 
హాస్యనటుడి పాట, యటులె 'వేంపు' 
హీరొగారు వేయు మారువేషమ్ములు 
చిన్న'రేపు సీను', చివర "ఢిష్యు". 


Friday 5 July 2019

సినిమాకు "వంద"నం - 25

సినిమాకు "వంద"నం - 25

ఆటవెలది: 
ఆట మొదలు బెట్ట నానాడు ముందుగా
ఘంటసాలపాట ఘనముగాను 
"ఏడుకొండ"లనుచు లౌడు స్పీకరు బెట్టు 
నాటి గురుతు మనసు నాటి మెదలె.

Thursday 4 July 2019

సినిమాకు "వంద"నం - 24

సినిమాకు "వంద"నం - 24 

ఆటవెలది: 
చక్కగానె యొకటి టిక్కెట్టుపై రెండు 
సినిమలాడజేయ జేరి నాడు 
జనులు చూచిరంత సంతోషమందగా 
నెలకునొక్కటైన నిజము నిజము.

Wednesday 3 July 2019

సినిమాకు "వంద"నం - 23

సినిమాకు "వంద"నం - 23

ఆటవెలది:
చేరి నాడు జూడ టూరింగు టాకీసు 
లోన సినిమ, మధ్యలో కరెంటు 
పోగ 'పాసు' లిచ్చి, పొమ్మని  మరునాడు 
మొత్తమంత జూపు ముచ్చటగను. 
 • 

Tuesday 2 July 2019

సినిమాకు "వంద"నం - 22

సినిమాకు "వంద"నం - 22

ఆటవెలది: 
అదరగొట్టు సినిమ 'ఆడి'యో ఫంక్షను 
వేడి నిచ్చు ట్రైలు 'వీడి'యోలు  
విడుదలైన పిదప విసుగునే పుట్టించి 
"ఆడి" నెలకు లోపె "వీడి" పోవు.

Monday 1 July 2019

సినిమాకు "వంద"నం - 21

సినిమాకు "వంద"నం - 21

ఆటవెలది:
ఇంగిలీసు పేర్లు, ఎంగిలి 'మ్యూజిక్కు' 
తెలుగు రాని నోర్లు, తిక్క కథలు 
వినగ కనగ సినిమ వెగటునే పుట్టించు 
నింపుడయ్య తెలుగు నింపుగాను.