తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 31 August 2019

సినిమాకు "వంద"నం - 78

సినిమాకు "వంద"నం - 78

ఆటవెలది: 
వేంపు పాత్రలెన్నొ వేనేత్రములు మెచ్చ 
జేసి మెప్పుబొంది చిత్రజగతి 
ప్రీతి నిల్చినారు జ్యోతిలక్ష్మియు జయ 
మాలినిజత రజత మేలితెరను.

Friday 30 August 2019

సినిమాకు "వంద"నం - 77

సినిమాకు "వంద"నం - 77 

ఆటవెలది:
దేశభక్తి పాట తేజమై వెలుగొందు 
భక్తి,రక్తి కైన బల్ పసందు 
ఆటకైన తగిన పోటిగా పాటల 
వ్రాసినారె మిగుల డా.సి.నా.రె.

Thursday 29 August 2019

సినిమాకు "వంద"నం - 76

సినిమాకు "వంద"నం - 76 

ఆటవెలది: 
కలిగి ప్రజ్ఞలెన్నొ గ్రద్దముక్పంతులు 
పేరుబొందె గాద పెద్దగాను 
తాను గొల్లపూడి దట్టీజు సుబ్రావ 
ననుచు తెలుగు వారి మనసు దోచె.

Wednesday 28 August 2019

సినిమాకు "వంద"నం - 75

సినిమాకు "వంద"నం - 75 

ఆటవెలది: 
పెక్కు నాయికలకు 'లక్కు'గా కుదిరిన 
చక్కనైన నటుడు చంద్రమోహ 
ననెడు మెప్పుబొంది నయమైన నటనతో 
ప్రేక్షకులకు నతడు ప్రియము గూర్చె.

Tuesday 27 August 2019

సినిమాకు "వంద"నం -74

సినిమాకు "వంద"నం -74


ఆటవెలది: 
ఏరియల్లు శాస్త్రి యేరి గోలలు, మంచి 
పాటవిలువ నేర్పె 'పాట'వముగ 
శంకరాభరణపు శంకర శాస్త్రిగా 
జేవి సోమయాజి జేలనందె.

Monday 26 August 2019

సినిమాకు "వంద"నం - 73

సినిమాకు "వంద"నం - 73 


తేటగీతి: 
మాట స్పష్టమ్ముగానుండి మదినిదాకు 
కంచు మ్రోగినయట్లుగా ఖంగుమనును 
పెద్ద పాత్రలకాగొంతు పెద్దదిక్కు 
పేరు కొంగర జగ్గయ్య వేరుగాదు. 



Sunday 25 August 2019

సినిమాకు "వంద"నం - 72

సినిమాకు "వంద"నం - 72


తేటగీతి: 
తన ప్రపంచమ్ము తనదని తలపబోక
మనకును మరోప్రపంచపు మనసు మెచ్చు 
పాటలెన్నియొరకముల బాగవ్రాసి 
సినిమ జగతిని శ్రీశ్రీయె వినగజేసె.


Saturday 24 August 2019

సినిమాకు "వంద"నం - 71

సినిమాకు "వంద"నం - 71

ఆటవెలది: 
దర్శకత్వమునగద  విజయనిర్మల 
ఎన్న దాసరెక్కె గిన్నిసునను 
రాఘవేంద్రుడు తన ప్రత్యేకతనుజూపె 
విశ్వనాధుడందె విమల యశము.

Friday 23 August 2019

సినిమాకు "వంద"నం - 70

సినిమాకు "వంద"నం - 70 

ఆటవెలది: 
ఘనసముద్రమంత ఘనమైన యర్థాల 
పాటలందు నింపి ప్రజలకిచ్చి 
సినిమ జగతిలోన సీ,జూ,సముద్రాల 
ముద్ర వైచినారు ముదము మీర.

Thursday 22 August 2019

సినిమాకు "వంద"నం - 69

సినిమాకు "వంద"నం - 69 

ఆటవెలది: 
మనసు గతిని దెలిపె మనసున్న మనిషికి 
సుఖములేదనుచును సూక్తిజెప్పె 
మనసుపైన వ్రాసి మనసైన ఆత్రేయ 
మన సుకవియె మారె మనసుకవిగ.

Wednesday 21 August 2019

సినిమాకు "వంద"నం - 68

సినిమాకు "వంద"నం - 68 

ఆటవెలది: 
క్లబ్బు డ్యాన్సు పాట కంఠమెత్తుచు బాడ 
మత్తుతోడనూపు మెత్తగాను 
ఎల్లలెల్లదాటె నెల్లరీశ్వరిపాట 
లేవలేనివాని లేపు పాట.

Tuesday 20 August 2019

సినిమాకు "వంద"నం - 67

సినిమాకు "వంద"నం - 67 


ఆటవెలది:
సినిమలందు బాడి చిరకీర్తి గాంచిరి 
బాలరావు, జమున, లీల, జిక్కి 
పీబి శ్రీనివాసు, కేబీకె, యేయెమ్ము 
రాజ మరి పిఠాపురమ్ము గూడ.

Monday 19 August 2019

సినిమాకు "వంద"నం - 66

సినిమాకు "వంద"నం - 66


తేటగీతి: 
పాత్ర 'మెరుగుచు' నటియించు పాత్రధారి 
గానమందున పేరున్న గాత్రధారి 
భక్తి పాత్రల కతడేమొ బాగ పేరు 
అవును చిత్తూరు నాగయ్య యతని పేరు. 

Sunday 18 August 2019

సైనికుని మనోగతం

ప్రజ-పద్యం సమూహం లో 11-8-2019 న ఇచ్చిన "సైనికుని మనోగతం" కు నా పద్యం.


సీసము:
మంచుకొండ చలులు మమ్మేమిజేయులే 
మాదు రుధిరమంత మరుగుచుండ 
దప్పికాకలిగూడ దరిజేర రావులే
రక్షణమను కోర్కె కుక్షినుండ 
ఆలుబిడ్డల యూసు లసలంట లేవులే 
దేశమాత కెదుట దిరుగుచుండ 
ముష్కరుండెవ్వండు ముందుకే రాడులే 
'గన్ను 'ల బోలుమా కన్నులుండ 
ఆటవెలది: 
'స్వర్గమే'గదమన జన్మభూమియనగ 
కాచుకొంటి మియిట గాచుకొరకు
శత్రుమూకరాగ జంపుచునే మేము 
'స్వర్గమేగ ' గలము సంతసమున.

సినిమాకు "వంద"నం - 65

సినిమాకు "వంద"నం - 65

తేటగీతి:  
విలనిజమునందు డైలాగు విసరు రీతి 
వినగ హాస్యమ్ము పంచుటన్ విరుపు విధము 
తండ్రిపాత్రల మెప్పించు తనదు నటన 
బాణి గొప్పది తనికెళ్ళ భరణిదెపుడు.



Saturday 17 August 2019

సినిమాకు "వంద"నం - 64

సినిమాకు "వంద"నం - 64


ఆటవెలది: 
సుత్తిజంట పంచె సుతిమెత్త హాస్యమ్ము 
వీరభద్రరావు, వేలు గలసి 
సరిగ క్రొత్తదనము జంధ్యాల యందించె 
అతని బాణి నిలచు ననవరతము.


Friday 16 August 2019

సినిమాకు "వంద"నం - 63

సినిమాకు "వంద"నం - 63

ఆటవెలది: 
నాగభూషణమ్ము నటవిరాట్ గో.రావు 
నూటనొకటి జిల్ల నూతనుండు  
కోట శ్రీనివాసు క్రొత్తయౌ నటనల 
మనసు నిలచినారు మరపురారు.

Wednesday 14 August 2019

పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

 కందిశంకరయ్య గారు 14 - 08 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

కందము: 
దవ్వున నుండెను పతియే 
యివ్వల సతి మల్లెపందిరెడుటనె, మీదన్ 
రివ్వున గాలికి బడగా   
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

సినిమాకు "వంద"నం - 62

సినిమాకు "వంద"నం - 62


ఆటవెలది: 
కోరచూపుజూడ క్రూరమై కనిపించు 
మాటలోన కఠిన మగుపడునులె 
దుష్టపాత్రలోన దూరితానుండును 
ఇలను రాజనాల "విలను" రాజు.

Tuesday 13 August 2019

సినిమాకు "వంద"నం - 61

సినిమాకు "వంద"నం - 61 

ఆటవెలది: 
మనకు దొరికినట్టి మరొక మీరాబాయి 
గానమునువిన మది గలుగు హాయి 
పాటకందమందు పలుక వాణిజయరాం 
తీపిలోకమునను ద్రిప్పు మనల. 

Monday 12 August 2019

సినిమాకు "వంద"నం - 60

సినిమాకు "వంద"నం - 60


తేటగీతి: 
జానపదములకు విఠలా చార్య, తీరు 
గ కమలాకర పౌరాణికమ్ములకును 
చూడ పుల్లయ్యలును మధుసూదనులును 
వారు మీరిరి  దర్శకత్వమున గనగ. 

Sunday 11 August 2019

సినిమాకు "వంద"నం - 59

సినిమాకు "వంద"నం - 59


తేటగీతి: 
మాన్య పెండ్యాల, చలపతి, మామ కే.వి 
రాజనాగేంద్ర, సాలూరి, రాజు టీ.వి 
వేణు, నాయుడును, సుసర్ల, విశ్వనాథ 
సత్య, మితరులు సినిమ సుస్వరములిడిరి.

Saturday 10 August 2019

సినిమాకు "వంద"నం - 58

సినిమాకు "వంద"నం - 58


ఆటవెలది: 
'శేషశైలవాస శ్రీవేంకటేశ'లో 
ఘంటసాల మనకు 'గాన'వచ్చు  
'భళిభళి' యను పాట బాగ మాధవపెద్ది 
గనగవచ్చు సినిమ కన్నులార.

Friday 9 August 2019

సినిమాకు "వంద"నం - 57

సినిమాకు "వంద"నం - 57 


తేటగీతి: 
కత్తియుద్ధాలు కనువిందుగానుజేసి 
నారదునిగాను నటియించి నయముగాను 
లవకుశను సీత మరదియౌ లక్ష్మణునిగ 
ఘనయశమ్మును బొందెగా కాంతరావు.

Thursday 8 August 2019

సినిమాకు "వంద"నం - 56

సినిమాకు "వంద"నం - 56 

ఆటవెలది: 
భావమెద్దియైన పాటయౌ క్రొత్తగా
క్రొత్త భావమేదొ గోచరించు
వినెడు మనసున సిరి వెన్నెలనేనింపు 
సీతరామశాస్త్రి సినిమ పాట.


Wednesday 7 August 2019

మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

శ్రీ కందిశంకరయ్య గారు 07 - 08 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్


కందము: 
మూడైదుల చదువాపెను
మూడార్లకు పెండ్లిగాగ ముచ్చట దీరన్
మూడేండ్లు గడచిపోయెను 
మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్. 

సినిమాకు "వంద"నం - 55

సినిమాకు "వంద"నం - 55


తేటగీతి: 
భావ గీతిక లాతని చేవదెలుపు 
విరహ గీతాల తీయని వేదనుండు   
క్రొత్తపదముల 'జాబిలి కూనజేసి' 
కృష్ణ శాస్త్రియె మనకున్న తృష్ణ దీర్చె.



Tuesday 6 August 2019

సినిమాకు "వంద"నం - 54

సినిమాకు "వంద"నం - 54

తేటగీతి: 
పాటలగని యనగవచ్చు పాటల 'గని' 
ఊరుచుండును పదములే యుబికి యుబికి 
క్లాసు మాసుల మెప్పించు కలము దాల్చి    
పదవి నీయగ వేటూరి పదవిరించి. 

Monday 5 August 2019

సినిమాకు "వంద"నం - 53

సినిమాకు  "వంద"నం - 53 


ఆటవెలది:
బొద్దురూపుతోడ ముద్దుమాటలతోడ 
పొట్టివాడయినను గట్టిగాను 
హాస్యపాత్రలందు హాయిగానవ్వించె
పద్మనాభమతడు బాగుబాగు.


Saturday 3 August 2019

సినిమాకు "వంద"నం - 52

సినిమాకు "వంద"నం - 52

ఆటవెలది: 
గయ్యిమనుచు లేచు గయ్యాళియత్తగా 
ఎదురులేక దిప్పు నెడమచేయి 
పెదిమవిరిచి పలుకు పెడసరమ్ముగ సూర్య
కాంతము నటనమున గలరె సాటి.

Friday 2 August 2019

సినిమాకు "వంద"నం - 51

సినిమాకు "వంద"నం - 51

ఆటవెలది: 
ప్రేక్షకుండు మెచ్చు రేలంగి కనబడి 
నడువ,చూడ,పలుక - నవ్వు నవ్వు 
నవ్వు తానెవచ్చి నటునిగా నిలచెను  
తెలుగు సినిమలోన తెలియరయ్య.

Thursday 1 August 2019

సినిమాకు "వంద"నం - 50

సినిమాకు "వంద"నం - 50

ఆటవెలది: 
స్వచ్చమైన పలుకు సరిగమతోనొల్కు 
నవరసమ్ములందు నాణెముగను 
గీతములను బాడి 'గిన్నీసు' కెక్కెను
తెనుగు కోకిలమ్మ మన సుశీల.