తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 29 November 2023

"గోలీ"లు 75-79

 "రవళి" మాసపత్రిక రెండవ సంచిక (డిసెంబర్ 2023) నందు ప్రచురించబడిన నేను వ్రాసిన పద్యములు.

 

"గోలీ"లు

 

కందము:

శ్రీమంతుడ నాకేమని 

ధీమాగా కష్టబడక తినికూర్చుంటే

 మంచువోలె కరుగును

చీమంతగ మారు నీదు సిరులే గోలీ!

 

కందము:

పొటీలో గెలుపునకై 

ధాటిగ యత్నించవలయు ధర్మంబుగనే

ఓటమి జెందిన గానీ

ఆటన్ సహజంబనుకొన నగురా గోలీ!

 

కందము:

వండే వంటలు శుచిగా

నుండంగను జేయవలయునుర శుభ్రతగా

"వండే" దాటిన పిదపను

మొండిగ హీట్జేసి తినగబోకుర గోలీ!

 

కందము:

తీయనిదౌ కంఠమ్మే

గాయకునకు నున్న సొగసు కాదులె, భాషన్

హేయముగా పలికి పరువు  

దీయనిదౌ నటులనుంట దివ్యము గోలీ!

 

కందము:

సలుపుచు  నుండుము ధర్మము

నిలలో బోరంగవలయు నిది చేయుటకై

సలుపులు కలిగినగానీ

మెలకువతో సైచి దాట మేలగు గోలీ!  

 

Saturday 18 November 2023

నన్నయ

 నన్నయ సహస్రాబ్ది మహోత్సవముల సందర్భంగా కుర్తాళం శ్రీ సిద్దేశ్వర పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహా స్వాముల వారి దయతో 10-11-2023 న గుంటూరునందు ఏర్పాటు చేసిన కవితా గోష్టి లో నేను వ్రాసి చదివిన పద్యాలు.

స్వామి వారి ఆశీస్సులు కోరుతూ... 

కందము: 

కుర్తాళం పీఠాధిప

మూర్తిగ పుంభావమైన ముఖవాసినిగా 

కీర్తిగడించిన స్వామీ 

ఆర్తిగ నేవేడెదనిక నాశీస్సులనే.

-----------------------------------

నన్నయ భట్టారకుని గురించి.... 

కందము:

ఆదికవియగుచు తెనుగున

మీదగు జ్ఞ్ఞానమ్ము బంచి మెచ్చగ బుధులే   

మీదట రాగల కవులకు

రాదారిని జూపినావు రమ్యముగానే.


శార్దూలము: 

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ యనుచున్ శ్రీకారమున్ జుట్టుచున్

ఆ వేదమ్మును బోలు భారతమునే ఆంధ్రమ్మునన్ వ్రాయగా 

నీ వాక్కుల్ ఘన పద్యరాశి యగుచున్ నిర్మాణమై కావ్యమే 

నీవే తెల్గున నాదియైన కవిగా నిర్దేశముల్ జేసెగా. 


కందము: 

నన్నయ్యవు నీవే లే

అన్నయ్యవు తెల్గుకవుల కందరకును నీ

యున్నత కవనపు పద్యా

లెన్నగ నీభువిని నిలచునిక వేయేండ్లున్.   


Sunday 12 November 2023

పండుగ దీపము

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.


ఉత్పలమాల: 

జీవన యానమందునను చిక్కటి చీకటి క్రమ్ముకొన్న నీ

భావన లందు ధైర్యమును బారగనీయక, నేడు వచ్చె దీ 

పావళియంచు నోర్మియను పండుగ దీపము వెల్గజేయగా 

త్రోవన వచ్చి కార్తికము తోషపు వెన్నెలలందజేయుగా.