తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 31 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 17

 

కందము:

మత్తువదలరా యనియెడి 

మెత్తని కర్తవ్యబోధ మేలుగ వినగా 

చిత్తమున మొద్దునిద్దర

చిత్తగు, మరి చేరరాదు శ్రీహరి కృపచే.



Monday 30 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 16

 


కందము:

టాటా వీడ్కోలనుచును

వాటముగా ముద్దగాను పాడిన విధమే

నాటో నీటో వేయుచు

మాటలు మాటాడినట్టి మాదిరి తోచున్.




Monday 16 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 15

 

కందము:

అయ్యయ్యో బ్రహ్మయ్యా 

అయ్యా యీ పాట నాడు నల్లరిగా మా

మయ్యలు బుల్లల్లుళ్ళను 

సయ్యంటూ నేడిపించు సరసము మెదలున్.  



Sunday 15 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 14


కందము: 

మనసున మనసై పాటయె

మనసునకే హత్తుకొనును, మచ్చుకు వినగా   

మనసున నొకపరి యైనను

మనిషిగ నున్నట్టివాడు మానక పాడున్.




తెలుగు నేలల సంక్రాంతి

మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


సీసము:

భోగిమంటల వెల్గు భువియంత నిండగా  

ముగ్గు, గొబ్బిల శోభ ముసరుచుండు 

గంగిరెద్దులగంతు ఘల్ ఘల్లు మ్రోగగా 

హరిదాసు కీర్తనల్ హాయిగొలుపు

గాలిపటములెన్నొ కనువిందు జేయగా 

కోలాటములదర గొట్టుచుండు

పంటలందిన రైతు వాత్సల్యమొప్పగా    

పసుల పూజలుసల్పి పరవశించు


తేటగీతి: 

మంచు సోయగముదయమున్ మించి పోగ

ఉత్తరాయణ కాలమ్ము యుర్వి బరగు

బంధువర్గముతో యిళ్ళు సందడవగ 

తెలుగు నేలల సంక్రాంతి తేజమలరు.


---గోలి. 


Saturday 14 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 13

 


కందము: 

జగమే మారినదనగా  

తగ కమ్మని భావమపుడు తన్మయమున చిం 

దగ కన్నీరై మరి చూ

డగ మా కనుల ప్రకృతి డాయుచు నిలుచున్.


Friday 13 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 12

 

కందము: 

కుంతి విలాపం వినగా

సాంతము చిత్రముగ గదలు సరి యూహలలో

నంతయు వినినట్లుండద

దంతయు గనినటులనుండు నాగానములో.  



Thursday 12 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 11



కందము: 

పుష్ప విలాపం పద్యాల్

పుష్పమ్ములు పలికినట్లె, పూర్తిగ వినగా

బాష్పమ్ములు రాలున్ గా 

పుష్పమ్ముల నిడక నీకు మోడ్తును చేతుల్.




Tuesday 10 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 10

 

కందము: 

కోలో కోలో యన్నను

సోలోగా నీదు పాట  సొగసులు నింపున్

మేలుగ మూతిన్ విరుపుల 

మూలుగు సావిత్రి బల్క ముచ్చట గొల్పున్.




Monday 9 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 9

 


కందము:

భగవద్గీతను తానే

భగగవంతుడు పల్కినట్లు పాడితివయ్యా

తెగులేమొ తెలుగు వాడికి

సిగదరగ,వినంగ చావు "సింబల్" జేసెన్.



Sunday 8 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 8



కందము: 

లవకుశ పాటలు పద్యాల్

లవలేశము విడక వినగ లాగును మనసే

స్తవనీయుడవే మాకిక

భువిలోనన్ మధుర గానమూర్తివి నీవే.  



Saturday 7 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 7

 

కందము: 

అందమె ఆనందము మక

రందము, కుడియెడమలను పరాగమ్మనుచున్   

సుందరముగ బాడుచు మా

కందించిన ఘనత నీదనంటిని ప్రీతిన్. 



Friday 6 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 6

  


కందము: 

లాహిరి, లాహిరి, లాహిరి

ఆహా!జగమంత యూగు నాపాటకహో! 

ఓహోహొ! ప్రేమనౌక న

హాహా! విహరించినట్టు లానందమ్మౌ. 




Thursday 5 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 5

 కందము: 

ఆ "రసికరాజ" గీతము

వేరెవరటు పాడగలర? వీనుల విందౌ

మీరిన గమకములను ప్రియ

మారగ మరి రాగభావమమరగ బాడన్.




Wednesday 4 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 4

 

కందము:
మదిశారదదేవి యనెడు
మది దోచిన పాట వినగ మది తోచునుగా
సదమల సంగీతమ్మున
పదముల నర్చించబూన వాణిన్ ప్రీతిన్.

Tuesday 3 January 2023

ఘంటసాల పాటల"కందాలు" - 3

 


కందము:
కడవెత్తుక వచ్చిందను
గడుసరి కవ్వింపుపాట కమనీయమ్మే
నడికారు గుండె గుల్లగు
పడి చత్తురు కాళ్ళకాడ పాటన్ వినగా.


Monday 2 January 2023

ఘంటసాల పాటల"కందాలు" - 2

 

కందము: 

వాతాపి గణపతింభజె 

ప్రీతిగనాపాట చెవుల వేడ్కన్ బడగా

మూతల్బడుమాకన్నులు

చేతుల్ కైమోడ్చు భక్తిచే నిజమయ్యా!



Sunday 1 January 2023

ఘంటసాల పాటల"కందాలు" - 1

 


కందము:
శ్రీనగజా తనయమ్మని
ఆనాడున బాడినట్టి హరికథ వినగా
మేనున ఫెళ్ళూ, ఘల్లూ
పూనునుగ గుభిల్లు, ఝల్లు పులకలు గల్గున్.


వెల్కం

 మీకు మీ కుటుంబ సభ్యులకు

అందరికీ 2023 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

కందము:
ట్వంటీ ట్వంటీ త్రీ! నీ
వెంటనె "బీఎఫ్ఫు సెవను వేర్యంటే" తా
నంటగ నున్నది "టీకా"
వెంటనె వేయించుకొమ్మ "వెల్కం" చెపుదున్.