తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 28 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 39


కందము: 

"పూజకు వేళాయెర" యని

మోజుగ నా తరుణి పాడ ముచ్చట దీర్పన్

రోజుల యందపు మొహము

బూజుగనే దులుపు విధము బుద్ధిని గరపున్.


  


Monday 27 February 2023

పోటీ లేని "టీ"

 

కందము

మేటిగ నుండును రుచులన్ 

చేటుల్ కలుగంగ బోవు సేవించగ, మీ

రే, "టీ" నే త్రాగండయ 

పోటీ పానీయమేది పుడమిని జూడన్.


కందము:

నీరును కాళ్ళకు, త్రాగెడు

నీరును నీవీయకున్న నిందించరు, తే

నీరును, వచ్చిన యతిథికి

తీరుగ నీ వీయకున్న దెప్పుదురిలలో.  


ఆటవెలది: 

అల్లము మరి సొంఠి, యావాలు, నిమ్మయు

బ్లాకు, వైటు, గ్రీను, బాదములును

రకములెన్నొ గలవురా! త్రాగు "టీ" లలో

దేనికదియె రుచుల దెలిసికొనుము.  


ఆటవెలది: 

చదువుకొనగ నిచ్చు సహనమ్ము "తేనీరు" 

కష్టజీవి శక్తి గాచు "టీ"యె 

ఉస్సురనెడువారి కుత్సాహమీ "చాయి"  

బ్రతుకు తెరువు జూపు భాగ్యశాలి.





ఘంటసాల పాటల "కందాలు" - 38

 

కందము: 

"ఏడూకొండల సామీ"

వేడుచు నెలుగెత్తిపాడ వేంకట పతియే

కూడుచు చేయూతనిడెడు

వేడుక భక్తులకు దోచు ప్రియముగ ననఘా!



Sunday 26 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 37

 


కందము: 

"ఉన్నావా అస"లంటూ

మిన్నునకే తాకునట్లు మిన్నగ పాడన్

అన్నారాయణుడే తా

నున్నానని వచ్చు విధమె యూహన్ మెదలున్.


 


Thursday 23 February 2023

"గోలీ"లు - 67

 


కందము: 

"వేల"ను బోయుచు కొను నీ

వేలును తాకించి వాడు వేడుక "స్మార్ట్ ఫోన్"

వేలును మాత్రము మరి "రాంగ్"

"వే"లను పెట్టంగబోకు వినుమా గోలీ!   


ఘంటసాల పాటల "కందాలు" - 36


కందము: 

"వినరా వినరా నరుడా"

యనుచును నరులకును పాడి యావుల గొప్పన్

మనముల నాటెడు విధముగ 

ఘనముగనే పాడినావుగా, నతులయ్యా! 



Wednesday 22 February 2023

ఘంటసాల పాటల "కందాలు"- 35

 


కందము: 

"ఓసఖి! ఓహో చెలి!" విన

చేసిన కవ్వింపులన్ని చెలియలతోడన్ 

మూసిన కన్నుల గనబడు

నా "సీనులు"  నాముగింపె యాహా! ఓహో!



Tuesday 21 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 34


కందము: 

"సుందరి నీవంటి" వినగ 

డెందమునానంద మొదవి ఠీవిగ నవ్వున్

ముందుకు వెనుకకు చేతులు

పొందుగ చప్పట్లుగొట్ట బూనుచు కదలున్.



Monday 20 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 33



కందము: 

“ప్రేమించి పెళ్ళి చేసుకొ

నీమనసంతాను హాయి నింపుకొ” మనుచున్ 

ప్రేమికుల గుండె తలుపులు

ప్రేమగ తట్టితివి వలపు ప్రేరణ గల్గన్.  





Saturday 18 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 32

 


కందము: 

“నీ సుఖమే నే”  పాటను

ధ్యాసగ విన భువిని ప్రేమ దాసుల మదిలో

కూసంత ద్వేషముండున?

మోసమ్మే లేని త్యాగ బుద్ధియె గల్గున్. 







ఓం నమశ్శివాయ.

 ఓం నమశ్శివాయ.

మీకు మీకుటుంబ సభ్యులకు అందరికీ

మహా శివరాత్రి శుభాకాంక్షలు. 


కందము: 

అడిగినదెవడని దలపడె  

యడిగినదెదియని జిడిముడి నసలిక బడడే

యడిగిన తడవుగ వడివడి

నడుగిడినిడుములనె కడపి హరుడిడు వరముల్!


ఆటవెలది: 

నీరుబోయజాలు నీ మొరల్ విన వచ్చు  

తుమ్మిపూవునిడగ తుష్టిజెందు

మదిని భక్తి నింపి మారేడు దళముల

వేయ వరములిచ్చు వేయి శూలి. 


Friday 17 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 31

 


కందము:

“సుడిగాలి లోన దీపం

కడవరకు నిలచున” యనగ గద్గద స్వరమున్

తడియగు కన్నులు, కలవర

బడుచును మనసంతగూడ భారమ్మౌగా. 




Thursday 16 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 30

 


కందము: 

“రాముని అవతార” మ్మని

రామాయణ గాధనంత రమ్యముగానే

మా మా కన్నుల గట్టగ

మా మనముల నిలిపినట్టి మహనీయుడవే.



Tuesday 14 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 29


కందము: 

“తూలీ సోలెను తూరుపు

గాలీ” యని వినగ మనసు గంతులు వేయున్

నీలపు మబ్బుల దిరుగెడు

మేలగు రాగమ్ము చెవుల మించుచు సోకున్. 





Monday 13 February 2023

ఘంటసాల పాటల కందాలు" - 28



కందము: 

“జో లాలీ, జో లాలీ 

లాలీ నా చిట్టితల్లి లాలీ” యనుచున్ 

లీలగ చెవులన్ బడగా

సోలును బాల్యమ్మునందు చూడగ మనసే.




Sunday 12 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 27

 

కందము:

“అమ్మాయనియరచిన” యది

ముమ్మాటికి వినగ మనసు మూగగ నేడ్చున్

అమ్మానాన్నల దలచుచు

అమ్మో!మరి చివరిపద్య మాహా! హైలైట్.



Saturday 11 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 26

 


కందము: 

“మనసైనా చినదానా “

మనసు గిలిగింతలెగయు మరిమరి వీనుల్

వినగా దానిన్ గోరును

ఘనమగు నీ గొంతు కంచు ఘంటని జెప్పున్.



Wednesday 8 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 25

 


కందము: 

“రారా కృష్ణయ్యా” యని 

నోరారా పాడితివది నూతనమెపుడున్

కోరినవరముల నొసగగ

కారగ కన్నుల కరుణయె కాంచును హరియే . 


  


Tuesday 7 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 24

 


కందము: 

“పిల్లోయ్ జాగర్తా” యని

ల్లరిగా చెలిని బట్టి యాడించు గతిన్

యుల్లము దలచిన వారికి 

యుల్లాసముగలుగు నిజము హుర్రే!యనుచున్.



Monday 6 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 23

 


కందము: 

“ననుపాలింపగ నడచీ”

యనుపాటను వినగ రాధ యాగోపిక యున్

కనులెర్రజేసి సత్యయు

మనసున ఖైదీగను హరి మాకగుపించున్.  




Sunday 5 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 22



కందము: 

“బాబూ వినరా” యనుచును

తోబుట్టుల కథను జెప్ప, తొణికిసలాడున్

మాబాల్యమందు ఘటనలు

బాబయ్యా!ఘంటసాల! పరిపరి విధముల్. 



Saturday 4 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 21

 


కందము:
“మురిపించే అందాలే”
దరిజేరగ రావెయనగ తన్మయమే మై
మరిపించు "సొగసు" పద్యము
సరి ముందర వినగ నూహ సఖి కనిపించున్.


Friday 3 February 2023

కళా తపస్వి

  

కళా తపస్వి శ్రీ కె.విశ్వనాథ్" గారికి నివాళి 


ఆటవెలది: 

దారి దప్పుచుండ ధర తెల్గు సిన్మాలు

సూత్రధారియగుచు శ్రుతిలయలను 

నేర్పి సొగసులద్దె నేర్పరి యై తాను 

లాక్షణికుడు మన కళాతపస్వి. 




ఘంటసాల పాటల "కందాలు" - 20


 కందము:

“చిరునవ్వులోని హాయీ”
మురిపించును "హాయి" పల్కు ముచ్చటగొల్పున్
స్వరమందు నింపి భావము
వరముగ మాకిచ్చినావు పాటలనెన్నో!

Thursday 2 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 19

 

కందము: 

అలిగితివ సఖీ ప్రియయని

చిలిపిగనా సత్యతోడ శ్రీకృష్ణుండే

పలికినయట్టుల తోచును

అలపాటను వినగ మాకు నార్యా! జయహో!



Wednesday 1 February 2023

ఘంటసాల పాటల "కందాలు" - 18

 

కందము:

అష్టపదులనే తీరుగ

కష్టమ్మే లేక బాడి కమనీయముగా 

ఇష్టమ్ముగ మా కనులకు 

శిష్టుడు జయదేవు గనగ జేసితివయ్యా.