తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 31 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 56

 

కందము: 

"చీకటి వెలుగుల రంగే

ళీ"కనిపించు ను గపాట లెస్సగ వినగా

మా కనిపించును జీవిత

మే కద దీపా వళియని మిన్నగ నార్యా! 


 

Thursday 30 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 55

 


కందము: 

"రామయ తండ్రీ" యనుచును

ప్రేమగ నా గుహుడు రాము బిలచిన విధమే 

సామీ! నది దాటించెద

క్షేమముగానన విన మదికే హైలెస్సా!



మదిని నిలతువీవె

 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

 

మీకు మీకుటుంబ సభ్యులకు శ్రీరామనవమి

శుభాకాంక్షలు.


సీసము:

సూర్య చంద్రుల వెల్గు జూడగా నింగిని

మదిని నిలతువీవె మాకు రామ!

రాయి, పడవ కన్నుదోయికే గన్పట్ట

మదిని నిలతువీవె మాకు రామ!

ఉడుత మరియు కోతి యురుకుచు గన్పించ  

మదిని నిలతువీవె మాకు రామ!

కాకి గ్రద్దలయిన కనులముందుకురాగ 

మదిని నిలతువీవె మాకు రామ!


ఆటవెలది:

నీలిమేఘమొకటి నిలబడ జూచిన

అగ్నిశిఖల జూచి నపుడుగూడ

తల్లి సీతతోడ దయగల మాతండ్రి

మదిని నిలతువీవె మాకు రామ!




Wednesday 29 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 54

  



కందము: 

"రానిక నీకోసం సఖి"

వీనులకాపాట తాక వేసట గలుగన్

దీనముగా మది యేడ్చును

తానే యాపాత్రయగుచు తన్మయముననే.  



Sunday 26 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 53

 


కందము: 

"పల్లెకుపోదాం, పారును"

అల్లన నాపాటవినగ నహహా మదిలో

చల్లో యనిజట్కాలో

నల్లరి పనులను దలచుచు నరుగుట తోచున్.




Friday 24 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 52




కందము: 

"కన్నులు నీవే కావా

ల"న్నట్టి సుమధురభావమౌ గీతమునే

విన్నట్టి వలపు జంటయె

పన్నుగ విడిపోక కలసి  బ్రతుకగ దలచున్.  




Wednesday 22 March 2023

పలుకుల పచ్చడి

 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ

"శోభకృత్" ఉగాది శుభాకాంక్షలు

సీసము:
పరుష వాక్యములను పరులను బాధించు
తీరు వాక్కు లవియె కారమగును
భావ్యమ్మునెరుగక సవ్యమ్ముగా లేని
పొగరుమాటలు జూడ వగరు సాటి
హద్దులెరుగకుండ నతిగమాట్లాడుట
కొప్పుగాని పలుకు లుప్పు బోలు
మోసంపు భావనల్ మూసిన పైపైని
తేట వచనములే తీపి చాయ

తేటగీతి:
చేరి జెప్పెడు చాడీలు చేదు గాద
పొల్లు స్వోత్కర్ష నుడువులు పులుపు భాతి
కలిపి పచ్చడిగా వీని గడుపుజేర్చి
మితము స్మిత బాషణముజేయు బ్రతుకుగాది.

కందము:
శోభకృతు నామ ధేయా!
ప్రాభాత స్వాగతమిదె రా వత్సరమా!
శోభాయమాన భవితను
మాభాగ్యము పండ నీవె మాకీయగదే!


Sunday 19 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 51

 


కందము:

"శివశంకరి" వినగా పా

టవమిడుగా నీదుపాట "టానిక్" తానౌ

యువగాయకులకు, నిజమిది 

స్తవనీయుడ కేలుమోడ్తు తలవంచుచు నే!


Saturday 18 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 50

 

కందము: 

"దివినుండీ భువికీ" యని

భువిలో నాపాటవినగ పులకిత మదియే

దివిలో నన్ విహరించగ

జవరాలిని ముదము గలసి చనినటులుండున్. 

 


Wednesday 15 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 49

 కందము: 

"ఏ నిమిషానికి" పాటను

మానవులూహింపలేని మంచియు చెడులే

మానక జరిగిన వేళల 

నానిముషము మనసు పాడు నాహా! నిజమే!


Tuesday 14 March 2023

ఘంటసాల పాటల "కందాలు"- 48

 

 

కందము:

"నిజమైనా కల యైనా"

నిజమే యొకటగు  నిరాశ నిండిన వేళన్ 

నిజమును జెప్పిన పాటది

నిజముగ మామనసు దోచు నిర్మల హృదయా!


Saturday 11 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 47

 


కందము: 

"జగమే మారినదీ" విన

తగ కమ్మని భావమింక తా కన్నీరై

దిగువకు జారును కన్నుల

మొగమున నాట్యమ్ముజేయు ముదమది నిజమే.


 


Friday 10 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 46

 కందము: 

"ఈ నల్లని రాలలొ" యని 

వీనుల విందుగను పాట వినగా, శిలలన్

పైనన్ గల కాఠిన్యము

లోనన్ గల వెన్న, మనసులో కనిపించున్.



Tuesday 7 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 45



కందము: 
“కలకానిది విలువైనది " 
యల వినగా నిట్టిపాట నవనిని పలు బా
ధల క్రుంగెడు మనుజుల  మన  
సులు  శోకము మరుగునగల సుఖములు వెదకున్.



Monday 6 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 44

 


కందము:

"అనుకున్నదొక్కటీ"యని

తనగుట్టే తెలిసెననుచు తరుణిని యేడ్పిం

చినవిధమును వినగా హా 

యిని బుల్బుల్ పిట్టనంచు నెగురును మనసే. 



Sunday 5 March 2023

"గోలీ"లు - 68


కందము: 

ర్యాగింగ్ చేయుట యే యొక 

రోగమురా, దాన్ని జేయ  "రోగ్" వగుదువురా!

రోగమువిడి "జూన్యర్సు"ను

స్వాగతమని పలుకరించ సభ్యత గోలీ!



 

ఘంటసాల పాటల "కందాలు" - 43

 


కందము: 

"ఉడతా ఉడతా హూ"త్తని

బుడతల నాడించు పాట పూర్తిగ వినగా

వడి చిలుకపలుకు బాలల 

బుడిబుడి నడకల పరుగులు ముద్దుగ తోచున్. 


 

Saturday 4 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 42

 


కందము: 

"ఆవేశం రావాలీ"

ఆవేదన కావలెనను యాపాట వినన్

ఆవేదనలే మూగగ  

 నావేశపు మూగ మనసు లాక్రోశించున్.



Friday 3 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 41

  

కందము: 

"మనిషైతే మనసుంటే"

కనులే కరుగును విన మరి కరుణయె కురియన్

మనిషిని  కదలించును గద 

మనసను మేఘమ్ము కురియు మస్తుగ జాలిన్.


  




  


Wednesday 1 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 40

 


కందము: 

"హవ్వారే హవ్వా" వా

రెవ్వా యా పాట యందు ప్రేయసి తోడన్

యవ్వారము హైలెస్సని

లవ్వాటగ సాగు విధము లాగును మనసున్.