తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 19 December 2020

 "గోలీ"లు - 37

కందము:
అలకెందుకు కడలికి మరి
అలనే తా నెట్టుచుండు నలపెరుగగనే
అలకెందుకు విడువని లలి
అలుపే లేకుండ లోనికరుగును గోలీ!


Saturday 14 November 2020

బొంద బెడుదుమింక

 అందరికీ దీపావళి శుభాకాంక్షలు.  

 

సీసము:

చిచ్చుబుడ్డియె నీదు జీవితమ్మును బుగ్గి

జేయగా మండుచు చిచ్చుబెట్ట

సీమ టపాకాయ చిన్నినీతలకాయ 

ప్రేలిపొవుగనట్లు కాలిపోగ

చేరితారాజువ్వ మీరునీ బ్రతుకును

పైకి జేర్చుచు నింగి బాతిబెట్ట 

విష్ణు, భూచక్రాలు విరిచినీకొమ్ములు 

వీరంగమాడుచు విసరివేయ


ఆటవెలది: 

నేటి దీపప్రభలు నిండగాబ్రతుకుల

కోరుకొనుచు లేచి కోలుకొనుచు 

అందరమ్ముగలసి మందులన్ గాల్చుచు

బొంద బెడుదుమింక పో! కరోన!


కందము: 

ఈ కోవిడ్ నరకునిపై

టీకాలను వేసి చంపు టెన్నడొ, నాడే

మాకౌ దీపావళియని

లోకమ్ములు వేచియుండె లోకేశ! హరీ!




Thursday 12 November 2020

"గోలీ"లు - 36



కందము: 

తెలుగది వాడిన "షేమని"

తెలివిగ "ఫీలవ్వ"బోకు తింగరి బుచ్చీ!

తెలుగది "వాడిన" షేమని

తెలియగ వికసించి కురియు తేనెలు గోలీ! 


Saturday 7 November 2020

"గోలీ"లు - 35

 

కందము: 

"పని" ముట్టుకొనగ వలయును 

పనిలేకను తిరుగకుండ బద్ధకమనుచున్ 

"పనిముట్టు" కొనగ వలయును 

పనికవసరమైన వేళ వదలక గోలీ! 

Thursday 5 November 2020

"గోలీ"లు - 34



కందము: 

తెగ మెరిసెడి యొక బంగరు

నగవేలే నీవు చూడ నలుగురిలోనన్

నగవే ముఖమున మాయక 

తగనిలచిన, చేరనీక తగవుల గోలీ! 


"గోలీ"లు - 33

కందము:
మన మది కెయ్యది కష్టమొ
మనమది పరులకు సలుపుట మానగ వలెరా
మనవలె యొరులును జగతిని
మనవలెనని తెలిసికొనుచు మసలుము గోలీ!

Tuesday 3 November 2020

కాలున ద్రొక్కెదము 'కరోనా!

 కరోనాపై పోరాటం....అంతర్జాతీయ కవితల పోటీ కొరకు వ్రాసిన పద్యాలు.  



కాలున ద్రొక్కెదము 'కరోనా!


కందము:
మీరుచు సురవైరులు సరి
మారుచు వైరసులుగ భువిని మాయలతోడన్
తీరుగ కనబడకను మరి
మారణహోమమ్ము జేయ మరిగిరియకటా!

ఆటవెలది:
ఊహనగరి బుట్టి యూహింప లేనట్టి
కీడు సేయుచుండె పాడు పురుగు
కొమ్ములన్ని విరిచి కొట్టి కరోనాను
మట్టిగరపుటెపుడు మహిని దేవ! .

ఆటవెలది:  
ప్రక్కవారితోడ పాటించు  దూరమ్ము
తరచు గడుగవలయు కరములెపుడు
ముఖమునకు 'మాస్కు' మూసి కట్టగవలె  
మూడు మంత్రములివి ముప్పుదప్పు.

సీసము:
తగిన సమయమున తగుసూచనిడువార్కి
పాటింపజేసెడు పాలకులకు
వ్యాధులణగజేయు వైద్యబృందములకు
ఊరు శుభ్రబరచు ధీరులకును
దీక్షతో పనిచేయు రక్షకభటులకు
అవసరముల దీర్చు యన్యులకును
భూరివిరాళాలు పూనిబంపెడు వార్కి
పేదలకన్నమ్ము బెట్టు వార్కి    
 
ఆటవెలది:
దీటుగా గనుగొన దివ్యౌషధమ్మునే
శ్రమను జేయుచుండు శాస్త్రులకును
ఈ'కరోన' వేళ నెంతయో కీర్తించి
కోటిదండములను కోరిజేతు.

కందకు:
కాలము మారును నిలబడు
కాలూనుచు రణముజేయ కదలితిమింకన్  
కాలిచి మసినేజేయుచు
కాలున ద్రొక్కెదము నిన్ను గనవె కరోనా!

"గోలీ"లు - 33

 

కందము: 

మన మది కెయ్యది కష్టమొ

మనమది పరులకు సలుపుట మానగ వలెరా 

మనవలె యొరులును జగతిని

మనవలెనని తెలిసికొనుచు మసలుము గోలీ!


Monday 2 November 2020

"గోలీ"లు - 32

 

కందము:
ఏకులము మీదియనుచును
ఆకులమే తక్కువనుచు ననకుము, విడిగా
సోకుగ రెమ్మకు బుట్టిన
ఆకులమే, కలసియుండ నగురా, గోలీ!


Monday 26 October 2020

"గోలీ"లు -31

 

కందము:
దండలు దండాల్ కోరక
దండిగనే మంచి సలిపి "దాటిన" - భక్తిన్
దండలు "పటమున" వేయుచు
దండములనుబెట్టెదరుర ధరలో గోలీ!


Sunday 25 October 2020

విజయద!

 శ్రీ మాత్రే నమః


అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

ఆటవెలది:
విజయ దశమి "నేడు" వేడుకొందునుతల్లి
వచ్చె మహిషు మించు "వైరసి"పుడు
వేగ "టీక" నిచ్చు విజ్ఞానమందించు
విజయద! శమియించ విష విపత్తు.


Saturday 24 October 2020

"గోలీ"లు - 30



కందము:
మనమేమి నేర్చుకుంటిమి
మనమేమిటి నేర్పుచుంటి మనుకొని పుడమిన్
మనమన నడవడి గనుగొని
మనములనది దెలిసికొనుచు మనవలె గోలీ!




Wednesday 21 October 2020

భారతీ!

ఉత్పలమాల:

మా తల వ్రాత వ్రాయు విధి మన్నన జేయుచు నెన్నియిచ్చినన్

భూతలమందు మానవులు పూజ్యులు గారుగ, శుద్ధ వాక్కులన్

ప్రీతిగ బల్కుజాలుమది ప్రేమను జూపుచు మంచి విద్యలన్ 

మాతరొ!శారదా! కృపను మాకిడవేడెదమమ్మ భారతీ! 



Monday 12 October 2020

"గోలీ"లు - 29

 

కందము: 

తీరికయె లేకపోయిన 

నూరక కవి "తల"యె నుండ నోపదు, "చలమౌ"

"నూరక" నుండునె? "చెలముగ"

మీరుచు కవితలనెడి "జల"మిచ్చును గోలీ! 

 


Saturday 3 October 2020

"గోలీ"లు - 28

 

కందము: 

తలపెట్టు మంచిపనులను

తలచుచు విడువకుమ పట్టుదలతో నెపుడున్

తలబట్టుకొనెడు పని నవ

తలబెట్టుటమంచి దెపుడు తలకే గోలీ!  

Wednesday 30 September 2020

"గోలీ"లు - 27


కందము: 

కాలము నిత్యము వేసెడు

గాలమునకు జిక్కి సొక్కు కాయములెన్నో

బేలగ జూచుచు నిలువక  

లీలగ కనుమరుగగు "యమలీల"ర గోలీ! 

Sunday 27 September 2020

సినిమాకు "వంద"నం -102



ఆటవెలది: 

నటుడె తాను పాడినట్లుగా బాడును 

'అరువుగొంతు' నటుల కిరవు తాను

పేరు "బాలు" గాని పెద్దపేరతనిది  

వినయ శీలి నిండు విగ్రహమ్ము.

Saturday 26 September 2020

"పాటమాలి" కి నివాళి

 "పాటమాలి" గాన గంధర్వుడు ఆ"బాల" గోపాల "సుబ్రహ్మణ్యానికి" నివాళి.


కందము:

పాటల "స్టారే"! "బాలూ"

మాటలకు "దశావతార" మగు "మాస్టారే"! 

పాటకు పాటవమేదీ

మాటకు పడిపోయె మాట, మహి వీడగనే! 


Thursday 24 September 2020

"గోలీ"లు - 26


కందము: 

విత్తము కొరకై మాత్రమె

సత్తానే చూపలేని "చప్పిడి" చదువుల్

చెత్తగ జదివిన, సిరి ముం

చెత్తగ ఫలమేమి "శాంతి" చిక్కక గోలీ!

Tuesday 22 September 2020

"గోలీ"లు - 25


కందము: 

మన నడవడికిటు నుడివిన

మనకవి సుజనుల కవితలు మనకవి హితముల్

మనవలె నితరులు మనవలె 

మనపలుకులు మనసున  వినుమనవలె గోలీ!

Sunday 20 September 2020

"గోలీ"లు - 24

 


కందము: 

మా సములే లేరనుచును 

మీసములను ద్రిప్పబోకుమీ గర్వమునన్

మీ సములు మించి వత్తురు

మాసములే కొన్ని దాట, మరతురె గోలీ!

Thursday 17 September 2020

"గోలీ"లు - 23



కందము: 

"నీగొట్టము"- "ముఖ పుస్తక్"

పోగగు "యేమప్ప" లన్ని ప్రొద్దేలేకన్ 

ఆగక జూడక మనిషికి 

వేగముగా ప్రొద్దు పోదు వినరా గోలీ!

Tuesday 15 September 2020

తేరాదాదా హమారదేతా గంగన్

 గతంలో "పద్యకవన వనం"గ్రూపు లో

సమస్య - రాము దూపాటి *
* తేరాదాదా హమారదేతా గంగన్! *
**********************************
* పూరణ - గోలి శాస్త్రి *
***********************
కందము:
లారే! ప్యాసా హూఁ మై
తేరాదాదా హమారదేతా గంగన్?
పోరా! జల్దీ థంసప్
తేరాదా, దాహ మారదే తాగంగన్!
**********************************

Sunday 13 September 2020

"గోలీ"లు - 22


కందము: 

చిత్తగు దేహము,గేహము 

చిత్తమునన్ "డ్రగ్సు" గోరి చేరుచు వాడన్

మత్తది, వదలని పెను "గమ్"

మత్తది, యంటించు "కొనుట" మానర గోలీ!   


Saturday 12 September 2020

"గోలీ"లు - 21


కందము: 

"అమ్మా"యను పిలుపునకే

అమ్మాయను తొలగజేసి యాశీస్సులిడున్

నమ్మకముతోడ వేడగ

"నమ్మ" కరుణనుకురిపించు నవనిని గోలీ!

Friday 11 September 2020

"గోలీ"లు - 20


కందము: 

వరదాయనినే తలచగ 

వరదగ రావలెననుచును వరములు గోరన్

వరదయె వచ్చును చివరకు

వరదా!యని భక్తిలేక వదరిన గోలీ!


Thursday 10 September 2020

"గోలీ"లు - 19

 

కందము: 

పోస్టోత్సాహము మనిషికి 

పోస్టును "పోస్టంగ" గానె పొంగదు, జనులా

పోస్టును గని లైక్స్, కామెంట్స్

"పోస్టిన" చూడంగ నాడు పొందుర గోలీ!

     


Sunday 6 September 2020

"గోలీ"లు - 18

 

కందము: 

చింతలు పొంగుచు ముంచిన  

సంతసములు జేరి కేలు సాచిన, నతిగా

చింతన జేయకు శిశిర వ

సంతములవి సహజమనుచు సాగుము గోలీ! 

Saturday 5 September 2020

"గోలీ"లు - 17

కందము:

గురుతర బాధ్యత నెరుగుచు
గురువుగ సత్పధము జూపి కువలయ మందున్
గురిగుదిరిన జనులకు సరి
గురుతగు స్థానమ్ము నిడుర గురుడన గోలీ!

Thursday 3 September 2020

"గోలీ"లు - 16

 కందము: 

"పండు" గలవేళ నొకడవె

మెండుగనే పండుకొనుచు  మ్రింగకు, మింకన్

"పండుగల" వేళ పరులకు

వండిన పరమాన్నమింత పంచుము గోలీ!   

Sunday 30 August 2020

"గోలీ"లు - 15

కందము: 

జనులిక "పెద్దల" మాటల

విను యోగము గలిగియున్న "విన్" యోగమగున్

వినకను వినియోగించక

చనువారికి గెలుపు నడక  సాగదు గోలీ!  

Friday 28 August 2020

దత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్

 శంకరాభరణం బ్లాగునందు 28-8-2020న ఇచ్చిన సమస్యకు నా పూరణ 


దత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్


ద్రౌపది శ్రీకృష్ణునితో అన్న మాటలు. 


తేటగీతి:

బాధనోర్చితి బుక్కిట బట్టి బట్టి

సైపలేనింక మాధవా సంధియేల

క్రమ్మె పెన్మాయ మమ్ములన్ గాచి నీవె 

అనినిక గెలుపే పరువుగ  నందనిమ్ము. 



 



Thursday 27 August 2020

"గోలీ"లు - 14

కందము: 

ఇల్లాలు సరిగనుండగ 

నిల్లంతయు సరిగమపద లేగద, లేదా? 

"ఇల్లాల్" గ మారిపోవును 

"నిల్ల"గు నానందమంత నిజమిది గోలీ! 


Wednesday 26 August 2020

"గోలీ"లు - 13

కందము: 

నగయొక్కటి లేదనుచును

వగజెందుట మేలుగాదు వసుధను జూడన్  

మొగమున మాయని యొక చిరు

నగవొక్కటి యున్న జాలు నయముగ గోలీ!

Monday 24 August 2020

"గోలీ"లు -12

కందము:

తల పేలే పెరుగును గద 

తలపే లేనట్టివేళ తల శుభ్రత పై 

తలుపులు తెరువవు సుగతికి  

తలపులు మరి మురికియైన తధ్యము గోలీ! 


Saturday 22 August 2020

"గోలీ"లు - 11

కందము: 

వీడక నుండిన ధర్మము 

పీడలు శాపములు తుదకు వీడును,మేలౌ

క్రీడికి వరముగ మారెను

పేడిగ మారెడు బెడదయె వినరా గోలీ!


  

ప్రజల గావుమయ్య ఫాలచంద్ర

 మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.


ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

సీసము:
చేటచెవులవాడ చేటునే తొలగించు
చిన్నికనుల ఱేడ సిరులనిమ్ము
గుజ్జు రూపమువాడ గురువువై దీవించు
పెద్దబొజ్జ ప్రభువ ప్రియముగనుము
వక్రతుండస్వామి వాక్కు స్వచ్చతనిమ్ము
ఏకదంత కరుణ నేలుకొనుము
మూషిక వాహనా మోదమ్ము నందించు
కరిమోము గలవాడ కావుమమ్ము

ఆటవెలది:
భక్తితోడ మ్రొక్కి భజనలే జేయుచు
వేడుకొందుమయ్య విఘ్నరాజ
ప్రబలు రోగములను పట్టిమట్టినిద్రొక్కి
ప్రజల గావుమయ్య ఫాలచంద్ర.

---గోలి. 🙏

Monday 17 August 2020

"గోలీ"లు - 10

కందము: 

భేషుగ వార్తల బెడుదురు 

సోషల్ మీడ్యాన  మంచి సోర్సది, యొకచో

ర్యాషుగ 'వార్' తలబెడుదురు

శోషిం'పగ ' జేయ శాంతి 'సో శాడ్' గోలీ!   

Sunday 16 August 2020

"గోలీ"లు - 9

కందము: 

గీతలు మారగ నరులకు 

గీతను బోధించె "గురువు" కృష్ణుడు, నేడా

గీతను చావుకు గురుతగు

మ్రోతగ నికృష్టులిడుర, రోతర గోలీ! 

Friday 14 August 2020

"గోలీ"లు - 8

 

కందము: 

వాడకనుండిన భాషలు

వాడకనుండున? తెలియుము వాదించకుమా

వాడినదని  వదలక మరి

వాడిన చిగురించు మాతృ భాషయె గోలీ! 


Thursday 13 August 2020

"గోలీ"లు - 7

 

కందము: 

వాడని వీడని లేదులె

వీడని చిరునవ్వు నింపి విరియుచునెపుడున్

వాడని ముఖమున నిలచిన

పీడల నెదిరించవచ్చు ప్రియముగ గోలీ!  

Tuesday 11 August 2020

"గోలీ"లు - 6

 కందము: 

తలపై "హెల్మెట్" బెట్టగ

తలగొట్టుక మాటలెన్నొ తడవకు జెప్పన్

తలనేల దూర్చలేదని

తల నేలను దాకి పగుల, దలతురు గోలీ! 




Monday 10 August 2020

"గోలీ"లు - 5

 

కందము: 

తప్పులు వెదకెడు వారికి 

తప్పులె కనిపించునెపుడు తామొప్పక బల్ 

నొప్పులను బడుచు నొప్పుల 

దప్పులుగా జూపనెంత్రు తప్పక గోలీ! 


Sunday 9 August 2020

"గోలీ"లు - 4

 కందము: 

తప్పని జెప్పిన దప్పును 

తప్పనిసరి యనుచు జేయ దప్పది తప్పే 

తప్పక జేసిన తప్పును 

తప్పక సరిజేయ ముప్పు తప్పును గోలీ!


 

Saturday 8 August 2020

"గోలీ"లు - 3

 "గోలీ"లు - 3

కందము:
కల్తీ సరుకులనమ్మెడు
గల్తీ పనులకు "సజా"తొ కల్ మిల్తా, వో
శాల్తీ సజావ్ గనుండదు
బోల్తా గొట్టును యహీతొ బోల్తా గోలీ!


Thursday 6 August 2020

రామా! నిన్నే దల్తుము

అయోధ్యలో 5-8-2020 న  "రామాలయ" నిర్మాణ శంకుస్థాపన  సమయంలో శ్రీరామునికి జేజేలు. 

కందము :
దశరథ సుతుడై, బంటుగ
దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
దశకంఠుని పరిమారిచి
దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే!

కందము:
రామా! నిన్నే దల్తుము
రా! మామదిలోన నిలిపి రాజా రామా!
రా! మాయను తొలగింపుము
రా! మా సీతమ్మతోడ రక్షణ నిడుమా!

కందము:
నీజన్మ భూమి గుడినిడ
మా జన్మలు ధన్యమౌను మహిలో రామా!
భూజాని తోడ నిలచుచు
భూజనులను గావుమయ్య పురుషోత్తముడా!

కందము:
రామా! యని గొలిచెదమిక
రా! మాయని రోగములను రక్కసిమూకల్
భూమాతబట్టె, ద్రుంచుము
జామాతవు నీవు గాన జాలినిగనుచున్.

కందము:
"సురవైరు"లు "వైరసు"లయి
ధర నరుల "కరోన" పేర దాడిని సలిపెన్
పరుగున వరగుణ! రావా!
కరుణను కోదండరామ! కావగ రారా!

Monday 3 August 2020

"సో" దరి

కందము:
సోదరి కట్టును "రాఖీ"
"సో" దరి జేరుము సతతము శుభమగు నీకున్
సోదర "రక్షయె" నీకన
"సో" "దీ" పూర్ణిమ దినమున "సోదీ"యనకన్.


Wednesday 22 July 2020

రాస్కెళ్ళకురా

కందము:
మాస్కును గట్టిగ గట్టుచు
మూస్కుని తిరుగంగలేవ ముక్కును మూతిన్
రిస్కుర రాస్కెళ్ళకురా
రాస్కెల్లని దిట్టుకుంద్రురా రాక్షసుడా!


Sunday 12 July 2020

"గోలీ"లు - 2

కందము:
వేకువ "పోస్టుల" బెట్టుచు
తేకువ యిసుమంతలేక తెరచుచు "యఫ్ బీ"
"లైకులు', "కామెంట్స్" కొరకిటు
ఆకళ్ళాకళ్ళు జూపుటది "వేస్ట్" గోలీ!

Wednesday 8 July 2020

చిక్కకుండు వార్కి చీర్సు చీర్సు.



సీసము:
కరములు జోడించు కరములు కరములు
షేక్ హ్యాండు వద్దన్న చేయి చేయి
అలసోపు తోగడు గరచేయి యరచేయి
ఫ్రెష్షుగా నుండెడి వేళ్ళు వేళ్ళు
తగ్గయోగాజేయు తనువులు తనువులు
ముఖపు గుడ్డనుజుట్టు ముఖము ముఖము
మరిగుంపు గూడని మనుజులు మనుజులు
సరి దూరముగనుండు నరులు నరులు

ఆటవెలది:
ఇంట వండు వంట నింపుగా దినుచును
వంటయింటి మందు వాడుకొనుచు
కలవరమ్ములేక గని"కరోనా" నోట
చిక్కకుండు వార్కి చీర్సు చీర్సు.

---గోలి.🙂

Sunday 5 July 2020

కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

శంకరాభరణం బ్లాగునందు 5-7-2020 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య: కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

కందము: 
ప్రేమగ పూతన విషమును 
ధీమాగా నీయనెంచ త్రెక్కొన హరియే
భూమినిబడ నిజరూపము   
కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్. 

పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్.

శంకరాభరణం బ్లాగునందు 4-7-2020 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య:పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్.

కందము: 
శయ్యను నిద్దురనుండగ
చయ్యన తన చెంతజేరి చన్నులకొరకై 
కుయ్యనుచు మూల్గి పాలకు 
పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్.


Wednesday 27 May 2020

దూరమని

కందము:
దూరమని జెప్పుచుండిన
దూరుదురే గుంపు గూడి దుర్వర్తనులై
దూరును కరోన తా పో
దూరక యని "దూరిన" మరి యోపరదెట్లో?


Sunday 10 May 2020

సినిమాకు "వంద"నం - 101

సినిమాకు "వంద"నం - 101

ఆటవెలది:
చివరివరకు జదువ 'సినిమ పద్యాలను'   
'నటనసూత్రధారి' నరుని బ్రోచు 
'చిత్ర జగతి' మాయ చిత్రమ్ముగా ద్రుంచి 
సిరుల నొసగు నిజము శీఘ్రముగను.  

Saturday 9 May 2020

సినిమాకు "వంద"నం - 100

సినిమాకు "వంద"నం - 100 

ఆటవెలది:
జీవితమ్ము జూడ సినిమయే, దానికి 
దర్శకుండు పైని దైవ మగును 
నీదు పాత్ర నీవు నీటుగా పోషించి
ధరను వీడ నీవె ధన్యజీవి.

Friday 8 May 2020

సినిమాకు "వంద"నం - 99

సినిమాకు "వంద"నం - 99 

ఆటవెలది:
మానవా కనగను "మానిసి" నే త్రిప్ప       
మారి పోవును "సినిమా"గ నిజము 
మహిని సినిమ నందు మంచిని నిలిపిన 
మనిషి "తిరగ" బడక మహిని నిలుచు. 

Thursday 7 May 2020

సినిమాకు "వంద"నం - 98

సినిమాకు "వంద"నం - 98

ఆటవెలది:
వయసు పెరుగు చుండ వయ్యారమే తగ్గు 
కాని సినిమ సొగసు గనగ పెరిగె 
చేరి నాటినుండి సిక్స్టీన్సెవెంటీలు
దాటి స్కోపు నిలచె డీటియెస్సు.

Wednesday 6 May 2020

సినిమాకు "వంద"నం - 97

సినిమాకు "వంద"నం - 97 

తేటగీతి: 
నటుల సైతము మెప్పించు నటుల తాము 
పాము, గుఱ్ఱమ్ము, కోతియు, పావురమ్ము 
కుక్క, యేనుగు, పొట్టేలు గూడ చూడ 
సినిమ నటియించి గురిపించె సిరుల నిజము. 

Tuesday 5 May 2020

సినిమాకు "వంద"నం - 96

సినిమాకు "వంద"నం - 96

ఆటవెలది:
తెలుగు పాట చెఱకు తీపినే మరపించు 
తీరు మారిపోయె తిన్నగాను 
ఆంగ్ల బాణిలోన ననుసరించుటమాని 
అనుకరించుచుండి రరుపు, విరుపు. 

Monday 4 May 2020

సినిమాకు "వంద"నం - 95

సినిమాకు "వంద"నం - 95

ఆటవెలది:
మధుర గాయకులును మరి నటరత్నాలు   
వ్రాత, మ్రోత, గొప్ప తీత గాండ్రు 
వెడలిపోయినారు, వెండితెరను నేడు 
పసిడి వెలుగులింక బరగ గలవె?

Sunday 3 May 2020

సినిమాకు "వంద"నం - 94

సినిమాకు "వంద"నం - 94 

ఆటవెలది:
గొప్పగొప్ప నటులు కొందరకేమియు 
బిరుదులీయలేని పిచ్చి మనది
ఐననేమి వారలందరి మనముల 
స్థిరముగా నిలుతురు బిరుదులవియె.

Sunday 5 April 2020

కరోనా "కందము"లే....

కరోనా "కందము"లే....

ఊహాన్ నగరిని బుట్టెను
ఊహకు రానట్టి కీడు నుర్విని బెట్టెన్
ఆహా! 'కరోన వైరస్'
హాహాకారమ్ములంటె నయ్యో! భువిలో.

కంటికి కనబడదట మరి
వింటిలె యంటగ జనునట వేగము తోడన్
జంటగ గూడిన నష్టమె
యొంటిగ దూరమ్మునుంట నొక భద్రమ్మౌ.

చేతులు 'సబ్బు'న గడుగక
మూతిని కండ్లను తరచుగ ముక్కును దాకన్
ఖాతరు జేయక దిరిగిన
భీతిని గలిగించు 'జబ్బు' పిలువక జేరున్.

'మాస్కు'ను గట్టుక మూతికి
చూస్కుని పరులకు దూరము జూచుచు నడువన్
'రిస్క'సలుండదు, కాదని
పూస్కుని రాస్కుని దిరిగిన పోదువు పైకే.

పొడిదగ్గు,గొంతునొప్పియు
వడివడి నూపిరిని బీల్చి వదలుట, నొప్పుల్
గడబిడ కడుపున, జ్వరమది
విడువక నుండిన గలువుము వేగమె వైద్యున్.

కొద్దిగ నలతయె గలిగిన
పెద్దగనూహించుచుండ వేయును భయమే
వద్దు యలక్ష్యము చని నా
ప్రొద్దున వైద్యుని గలువగ బోవునదటులే.

తమ వారిని తమ ఇండ్లను
తమ సౌఖ్యము లెక్కనిడక తమ ప్రాణమ్ముల్
క్షమ తోడ సేవజేసెడి
శ్రమజీవులు, వైద్యులు, మన రక్షకులకు జై.

ఇటలీలో పెరిగినదని
ఇట 'లీస్ట'ని పొంగిపోకు మిక 'లక్ డౌనౌ'
నిట 'లాక్ డౌన్' బాటింపక
నిటలాక్షుడు బ్రోవబోడు నిన్నిక వినుమా!

పాలకులు శాస్త్రవేత్తలు
మేలగు సూచనలనీయ మీరక జనగా
లీలగ దీరుచు నిడుములు
కాలమ్మే మారిపోవు గద, శుభమగుగా.

అందము గెలిచెదమని, నీ
కందములేయని కరోన! యణచెదమనుచున్
అందరమొకటై నిలచిన
పొందెదముగ జయము, పారి పోవు 'కరోనా'.