తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 18 April 2025

మాట - మౌనం

 " ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: మాట - మౌనం

కందము:
నీటుగ నొకటో రెండో
మాటలలో భావములవి మనకే తెలియున్
బాటలు పలువిధములగును
మాటలు లేనట్టివేళ మౌనములోనన్.

కందము:
మాటలు కోటలు దాటుట
మాటలవే యీటెలగుట మంచిద? వినుమా!
మాటకు మాటలననియెడు
మాటల మాట్లాట వదలు, మౌనమె మేలౌ.

కందము:
నరులకు దేవుండిచ్చిన
వరమదిరా చూడ మాట పలుకుట, నాల్కన్
నరమునె యదుపునబెట్టుము
మరి తూలెడువేళ కొంత మౌనమ్మిడుచున్.

కందము:
హీనుడు నీ దరిజేరుచు
నేనేరా గొప్పయనుచు నిందలు వేయన్
మౌనిగ మౌనము దాల్చుము
కోనల కోతుల కెదుటను కుందేలువలెన్.

ఆటవెలది:
కాకి రేపుమాపు "కాకకాకా"యను
కోకిలమ్మ "కూత" కొంత వరకె
సమయమెరుగు పలుకు సరిమెత్తురందరు
కానివేళ మేలు మౌనమెపుడు.

కందము:
మాటున నిలవకు, నిజమును
మాటలలో దెలుప నీకు మౌనమ్మేలా?
మాటాడువారి మౌనము
మాటలలో జెప్పలేము మహికహితమ్మే.

కందము:
మాటలు మనకవి మీటలు
దీటుగనే నొక్క గలుగు తీయని నాదం
ఘాటును పెంచిన వినుటకు
నాటుగనే యుండు మదిని నాటును గుబులే.


No comments: