" ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.
అంశము: రాఖీ
కందము:
సోదరి కట్టును "రాఖీ"
"సో" దరి జేరుము సతతము శుభమగు నీకున్
సోదర "రక్షయె" నీకన
"సో" "దీ" పూర్ణిమ దినమున "సోదీ"యనకన్.
ఆటవెలది
అమ్మ ప్రేమగాద అక్కయ్య, చెల్లిది
నాన్న రక్ష తమ్ముడన్నదియును
రక్ష బంధనమ్ము రాగాలుపండించు
"రాఖి పున్నమి"కిని రమ్యముగను.
కందము:
బంగారపుదైనన్ మరి
రంగులదారమ్ముదైన రాగమ్మొకటే
హంగులజూడక దెల్పును
చెంగట సోదరునికి "రాఖి" చెల్లెలు కట్టన్.
కందము:
రక్షా బంధన వేళను
అక్షయమగు ప్రేమనీయమనుచును గట్టున్
లక్షలు గోరక సోదరి
లక్షణముగ సోదరులకు రాఖీ లెపుడున్.
కందము:
ప్రేమను తెలుపని ప్రేయసి
"కాము"గ నెటువచ్చి తాను కట్టునొ "రాఖీ"
ఏమో నా గతి యనుచును
"దీమాక్" చెడి "లవరు" జచ్చు దినమిది గదరా!
కందము:
నిన్నా దృష్టిని జూచుట
నెన్నడు నే జేయలేదు "నీతోడ"నుచున్
అన్నా!యని "వన్ సైడ్ లౌ"
సున్నానే జేయగల్గు "సూపర్" దినమే.
No comments:
Post a Comment