తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 17 April 2025

గురువంటే

ప్రజ - పద్యం యఫ్ బీ గ్రూపు" నందు "నవ భావ పద్య రచన" లో పద్యరచనలు కోరుచూ ఇచ్చిన అంశం పై నేను వ్రాసిన పద్యములు.


అంశం: ఇతడుకదా గురువంటే.


కందము:
గురువగు తల్లికి దొలుతను
గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్
గురువగు హరికిని తప్పక
గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.

కందము:
బత్తెము గురువది చూచును
పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
బెత్తము చూపిన హత్తెరి
కత్తులనే వారు చూపు, కాలము మారెన్.

కందము:
చురకలు, చెణుకులు, చరితలు
మెరుపులు కథలను గలుపుచు మెచ్చగ చదువుల్
గరపగ వలయును చక్కగ
గురువులు తమపాఠములవి గురుతుగనుండన్.

కందము:
పొత్తమునందలి భావపు
విత్తనముల "పదునెరుగుచు" విద్యార్థుల దౌ
చిత్తపు పొలముల జల్లుచు
మొత్తము "సరి భావ లతల" బూయించవలెన్.

కందము:
చదువది పొత్తములోనిది
మొదలంటుచు చివరి వరకు మొత్తము నేర్పన్
చదువుల జెప్పుటె కానీ!
చదువరులకు గరపవలయు సంస్కారమ్మున్.

కందము:
విద్యార్థి శక్తి నెరుగుచు
నుద్యోగపు చదువుతోడ నొక కళలోనన్
ఉద్యతి నిష్ణాతుండవ
సద్యోగము నీయవలయు సద్గురువెపుడున్.

కందము:
గురువన నెవ్వరు? విను, నలు
గురు కలసినవేళ బిల్చు "గురుగురు" కాడోయ్
గురువన జ్ఞానపు దీపము
గురుతెరుగగ దారిజూపు గోరగ భక్తిన్.

కందము:
పొత్తము నొకచేతను మరి
బెత్తము నొకచేత బట్టి ప్రియముగ చదువుల్
మెత్తగ, నవసర మగుతరి
మొత్తుచు నేర్పించు గురువు పూజ్యుండిలలో.


No comments: