తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 31 January 2025

సమయోచిత పద్యరత్నము – 63


శార్దూలము:
నీకంఠమ్మున మూడుగా నగుపడున్ నిండైన నారేఖలే
మాకండ్లే బహు పుణ్యముల్ బడయగా మాకిట్లు గన్ పట్టెగా
శ్రీకంఠుం డట గట్టినట్టి ప్రియమౌ శ్రీలందు మాంగల్యమై
జై కొట్టంగ సుగాత్రి! మధ్యమమునై  షడ్జమ్ము గాంధారమై.


Thursday, 30 January 2025

సమయోచిత పద్యరత్నము – 62


ఉత్పలమాల:
సాటియె లేని రాజ్యమను సంపదబొందగ నర్హుడయ్యు తా
మేటిగ వంశమంతటిని మిక్కిలి వృద్దిని జేయగల్గియున్
చేటులులేని వర్తనము శ్రీకర బుద్ధిని గల్గి భీష్ముడే
ధాటిగ మాటనిచ్చెగద తండ్రికి తానిక బ్రహ్మచారిగా.


Wednesday, 29 January 2025

సమయోచిత పద్యరత్నము – 61

 


ఉత్పలమాల:
నిద్రను వీడి లోకముల నిత్యము గాచుచు నుండువానికిన్
భద్రముగాగ శత్రువుల భంజనజేసెడు శూలధారికిన్
ముద్రల ధ్యానయోగముల మున్గుచు మౌనమునందువానికిన్
ఛిద్రముజేయపాపముల  చిత్తజవైరి సతీశుకే నతుల్.


Tuesday, 28 January 2025

సమయోచిత పద్యరత్నము – 60

 


చంపకమాల:
పెరుగుచునుండగా వయసు, ప్రీతిని సంతసమందబోకుమా!
యరుగుచునుండుగా నదులు నల్లన ముందుకు, రావు
వెన్కకున్
మరువకు
మాయువింక గన మాయమగున్ గద మెల్లమెల్లగా
పరమును గోరుకొమ్ము, ధర బద్ధతి ధర్మము నాచరించుచున్.



Monday, 27 January 2025

సమయోచిత పద్యరత్నము – 59

 


ఉత్పలమాల:
చూడగ కారణమ్ముర రజోగుణమన్నది కామపీడకున్
వీడక క్రోధమౌనుగద విజ్ఞత జూపక రెచ్చిపోయినన్
చీడగమారి జీవితపు చెట్టును మోడుగ మార్చి కూల్చుగా
వీడుము శత్రువేయనుచు వెన్నుడు జెప్పిన గీత దల్చుచున్.


Sunday, 26 January 2025

సమయోచిత పద్యరత్నము – 58

 

ఉత్పలమాల:
శక్తిని నాకు నిమ్మ, ఘన సత్కృతులన్నియు బోధసేయ నా
సక్తిని గల్గజేయుమిక, చక్కని గ్రంథము లెన్నొవ్రాయగా
శక్తినిజూపి సత్సభల 'జై' రవమందెడు భాగ్యమీయుమా!
శక్తిని నింపి సన్మతిని శారద!వాణి! యనుగ్రహింపుమా!


Saturday, 25 January 2025

సమయోచిత పద్యరత్నము – 57



చంపకమాల:
ఎనిమిది మాసముల్ శ్రమయె హాయగు వత్సరమందు కాపుకున్
పనులను జేయగా బగలు బాగుగ నిద్రయె గల్గు రాత్రులన్
తనువున శక్తియున్నపుడె ధర్మము సల్పిన శాంతియౌ జరన్
వినుముర!జన్మమంతయును వీడకు యత్నము ముక్తికోసమై.


Friday, 24 January 2025

సమయోచిత పద్యరత్నము – 56

 

ఉత్పలమాల:

పోలిక లొక్కటే యగుచు బుద్ధి తలంపుల, ప్రేమబంచుచున్

మేలిమి స్నేహబంధమున, మెచ్చగ నల్వురు ధీరచిత్తమున్

పాలును నీళ్ళవోలె కలిసుండగ దంపతులెల్లవేళలన్

జాలును దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!  


Wednesday, 22 January 2025

సమయోచిత పద్యరత్నము – 55

 


ఉత్పలమాల:
చేరుచు తీర్థమందు సరి జేయగ స్నానము కోరి కోర్కెలన్
తీరుగ నొక్కనాడు నది తీర్పగ వచ్చును గాని, సాధువుల్
మీరుచు గానుపింప మరి మిక్కిలి శ్రద్ధను జేయ సేవలన్
దీరును కామితార్ధములు తిన్నగ గల్గును సత్ఫలమ్ములున్.


Tuesday, 21 January 2025

సమయోచిత పద్యరత్నము – 54

 

శార్దూలము:
మాయాకల్పితమౌ యజాండమును తా మాయమ్ము జేయున్, గనన్
కాయమ్మే సరిలేకగాల్చెనుగదా కామున్, జగంబంతటన్
శ్రేయమ్మే మరిగోరుచున్ విషమునే సేవించె, మోక్షమ్ము నా
కీయంగా హర! నీవె దైవమన మాహేశుండు తానిచ్చుగా.


Saturday, 18 January 2025

సమయోచిత పద్యరత్నము – 53

 

ఉత్పలమాల:
గొప్పగ మంచివారు శ్రమకోర్చుచు నిద్ధర సాటి వారికిన్  
మెప్పును జూడబోక మరి మీదట మంచిని జేయుచుంద్రుగా
తప్పుడు దుష్ట మానవులు తామది మర్చుచు గొప్ప సాయమున్
ముప్పును జేయ బూనుదురు మోసము జేతురు, నైజమింతెగా.


Friday, 10 January 2025

సమయోచిత పద్యరత్నము – 52



ఉత్పలమాల:
తల్లియె దిట్టుచుండు, మరి తండ్రియు సంతసమందబోడు, తా
మొల్లరు మాటలాడగ సహోదరులైనను, సేవకాళియున్
మెల్లగ కోపగింత్రు, సతి మేనునుదాకదు, మిత్రులున్ సుతుల్
చల్లగ జారుకుంద్రు తగుసంపద లేకను, దానిబొందుమా!


Thursday, 9 January 2025

భక్తి

 


అమరావతి సాహితీ మిత్రులు, వారం వారం కవితల పోటీ - 3 కొరకు వ్రాసిన పద్యములు.
అంశం: భక్తి


ఆటవెలది:
తల్లిదండ్రులందు తగు భక్తి దయలను
పుడమి జూపనట్టి పుత్రులేమొ
చెదలబోలు ననుచు జెప్పెగా వేమన్న
మహిని దీని దెలిసి మసలవలయు.

ఆటవెలది:
జీవనమున మంచి త్రోవనే సాగంగ
జ్ఞాన జ్యోతి నిచ్చు సద్గురువులు
వారి భక్తి తోడ గౌరవమ్మున జూచు
నట్టివారిని పరమాత్మ మెచ్చు.

ఆటవెలది:
గుడులు గోపురముల విడువక చుట్టిన
తీర్థ క్షేత్రములను తిరుగుచుండ
కనగ బరిసరముల కాలుష్యమేగాని
భక్తి లేనినాడు ఫలము రాదు.

ఆటవెలది:
పగటివేష "దొంగ బాబాల" నమ్మకు
మూఢ భక్తి తోడ మోసపోకు
క్రొత్త దైవ మనుచు గ్రుడ్డిగా పడిపోకు
చక్కటి యిలవేల్పు చాలు నీకు.

ఆటవెలది:
"లోని దృష్టి" గలిగి లోచనమ్ముల మూసి
గుండెలోన నున్న "గుడిని" గాంచి
ధర్మబుద్ధి భక్తి తలపుల "వెదుకంగ"
"దైవ" మచట నిచ్చు "దర్శనమ్ము"


సమయోచిత పద్యరత్నము – 51

 


ఉత్పలమాల:
దేవకి పట్టివయ్యు, వసుదేవుని పుత్రుగ నుండి, దానిపై
గోవుల పల్లె నందుచును గోపయ నంద యశోద ప్రేమలన్
చావును ధూర్త కంసుకిడి శౌరిగ నిల్చిన నారసింహ నన్
గావుమ నిన్నుగొల్తు పద కంజములంటుచు కేశవా!హరీ!


Wednesday, 8 January 2025

అవినీతి అనకొండలు

 


గతంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు

నిర్వహించిన కవితలపోటీ కొరకు నేను వ్రాసిన పద్యములు. 

శీర్షిక: అవినీతి అనకొండలు  


కందము:

ఇందుగలడందు లేదని  

సందేహమ? లంచమిపుడు సర్వోపగతం

బెందెందు వెదకి చూచిన

అందందే కలదు చూడ  నవినీతి కదా!


తేటగీతి: 

పాలనమ్మున నధికారి పనులలోన 

విద్యలందున  గణుతింప వైద్యమందు 

వేయితలలుగ నవినీతి వేళ్ళనూనె 

విశ్వరూపమ్ము వర్ణింప వీలుకాదు.

 

అవినీతిపరులారా!

 

మత్తేభము:

జనమున్ దోచుట ధర్మమా? కనగ లేశమ్మైన  న్యాయమ్మ? మీ

మనముల్ సుంతయు నీతి రీతి గలదే? మానంగ లేరా? మిమున్      

అనకొండే యవినీతి యందునననన్, ఆలోచనన్ మీకికన్   

వినగా సిగ్గని పించదా? విడతురా వీధిన్ పయిన్ దుస్తులే.


ఉత్సాహము: 

మేడపైన మేడవేసి  మిద్దెలెన్ని గట్టినన్

చూడ చూడ భూములెన్నొ  చుట్టి యాక్రమించినన్ 

పాడుపనుల పసిడి వెండి పాతరందు దాచినన్ 

చీడ పురుగు వోలె జగతి  ఛీత్కరించు కొను మిమున్.  

   

ఆటవెలది:  

నీతి భీతి లేక నియమమ్ము వదలిన

అక్రమార్జనమ్ము అరుగబోదు

భోగమనుచు దలప రోగమే మిగులును 

వంశనాశనమ్మె వదలబోదు.   

సమయోచిత పద్యరత్నము – 50

 


చంపకమాల:
వలువలు లేనివాడనుచు, పాముల దాల్చెడువాడటంచు, శీ
తలమగు కొండమీదననె దాగెడు నిప్పుల కంటి వాడు, చం
చలమగు గంగ దాల్చునని "శంక"ను బొందకుమోరి మూఢ! వ్యా
కులముల బాపువాడతడె కోరిమనమ్మున "శంకరా" యనన్.


Tuesday, 7 January 2025

సమయోచిత పద్యరత్నము – 49

 

 
చంపకమాల:  
కరి సరిబట్టి యా యరటి కాండము నాకుల దూసినట్లుగా  
విరిశరముల్ ధరించి కడు వేగముగా మరు డిట్లు వేయగా
నరరరె! నాదు మానసమె యల్లలలాడుచు వేగుచుండెరా!
మరిమరి బాధదీర్చి దరి మైకము మాన్పగ రార! నా సఖా!



Monday, 6 January 2025

సమయోచిత పద్యరత్నము – 48

 

 
ఉత్పలమాల:
మానవ! క్రోధమన్న నది మానసమున్ దహియించు యగ్నియే
మానుము మోహమద్ది మది మైకము ముంచెడు శత్రువే సుమా!
పూనుచు నొక్కటైన పని బుద్ధిని జేయకనుంట రోగమౌ
జ్ఞానము గల్గియున్న మరిగానము మించిన సౌఖ్య మెచ్చటన్.


Friday, 3 January 2025

సమయోచిత పద్యరత్నము – 47

 


ఉత్పలమాల:  
కాలముమారు గోల్పడకు కష్టములందున ధైర్యమెప్పుడున్
కేలునుమోడ్చి వేడు నరు గీడును మాన్పుము సానుభూతితో  
చాలగ తప్పులెన్నకను సత్కృపతో క్షమియించి బంపుమా
మేలుగ జేయు త్యాగమును మించిన సౌఖ్యము లేదు రా భువిన్.

Thursday, 2 January 2025

సమయోచిత పద్యరత్నము – 46

 

చంపకమాల:
బలమది నాకు లేదనుచు, బాధ్యతగానొక కార్యమైన నే
నలయక జేయజాలనిక హా! యని దుర్బలచిత్తమందునన్
బలుకక, నాత్మలోపలను భక్తిని నాపరమాత్మ నమ్ముచున్
సలిపిన కార్యముల్ భువిని సత్ఫలమిచ్చును హాయిహాయిగన్.


Wednesday, 1 January 2025

న్యూ సెన్సు

 మీకు అందరికీ "2025" ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.


ఆటవెలది:
"న్యూ యియరున" నేవి "న్యూసెన్సు" లేలేక
జగతి వెలుగు బాట సాగ వలయు
క్రొత్త వత్సరమున గొప్ప "న్యూ" "సెన్సులు"
కలిగి జనులు కలిసి మెలగ వలయు.