తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 22 July 2024

గురు వందనం

 శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామి వారి అనుగ్రహంతో గురు పూర్ణిమ సందర్భంగా, మంత్రాశ్రమము, గుంటూరునందు 20-07-2024న ఏర్పాటు చేసిన కవితా గోష్ఠి లో నేను చదివిన పద్యములు.


కందము:

గురువగు తల్లికి దొలుతను

గురువగు తండ్రికిని పిదప గొప్పగ జగతిన్

గురువగు హరికిని తప్పక

గురుతెరుగుచు నతులనిడరె కువలయమందున్.


కందము:

గురువన బ్రహ్మయు విష్ణువు

గురువే మాహేశ్వరుండు కుంభినిలోనన్

గురువు పరంబ్రహ్మయు సరి

గురువుల పాదమ్ములకివె  కోటినమస్సుల్.


కందము:

గురువన లోకమ్మందున

గురుతరమగు బాధ్యతగల కోవిదుడగుచున్

నరులకు జ్ఞానమ్మిహమున

పరమును జేరగ సరియగు పథమును జూపున్.


ఉత్పలమాల:

వేదములన్ని గాచి సరి వేయివిధమ్ముల వేల్పు గాథలన్

మేదినిలోని మానవుల మేలును గోరుచు వ్రాసినాడుగా

పాదములంటి మ్రొక్కిడరె వ్యాసుని ముందట దల్చి నాపయిన్

సాదరమొప్ప నాదిగురు శంకరుకున్ మరి యొజ్జకోటికిన్. 


Thursday 11 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 157

 

కందము: 

"కన్నుల్లొ మిసమిసలు" కని 

హన్నా!అందాలు దాచకనువగు వేళన్

అన్నట్టి పాట వినగా

ఎన్నెన్నో తీయనికల లెదలో మెదలున్. 

Wednesday 10 July 2024

"గోలీ"లు 88 - 91

 


జులై 2024 "రవళి" మాసపత్రికలో ప్రచురితమయినవి.

కందము: 

చిరిగిన బట్టల గట్టిన

నిరుపేదల జూచి జాలి నిజముగ వేయున్

"చిరుగుల" బట్టల గట్టిన

చిరు"గుల" "కలవారి" గనిన సిగ్గగు గోలీ! 


కందము: 

చదువునకు తోడు పిల్లలు 

వదలక సంస్కారము సరి పాటించు విధ

మ్మది నేర్వ వలయు నప్పుడె

చదువులు సార్థకమగుగద జగతిని గోలీ! 


కందము:

దెబ్బలు తగిలినవని శిల 

ఆబ్బా!యని క్రిందబడగ నది బండయగున్  

నిబ్బరముగ నిలచినచో

నబ్బురముగ శిల్పమగుగ నవనిని గోలీ!


కందము:

ముద్దౌచు చమట, నన్నపు 

ముద్దగుగా రైతు జనుల పుణ్యము పండన్   

ముద్దుల బిడ్డని బంచును 

ముద్దుగనా పుడమితల్లి మురిపెము గోలీ! 

ఘంటసాల పాటల "కందాలు" - 156

 


కందము: 

"జయహే! నవనీల" యనుచు

ప్రియముగ వనమాలి లీల, వినగా హరియే 

స్వయముగ మధురమ్మంటివి 

లయబద్దపు మధురగీతి రక్తియెగట్టున్.    

  

Tuesday 9 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 155

 

కందము:  

"మంచితనానికి తావే"

యెంచగనింతైనలేదదెచ్చట ననుచున్

కొంచెము మనసుకు మమతకు 

నించుక లేదన విలువలె, యేడ్చును మనసే.   

Sunday 7 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 154

 

కందము:  

"ఈ యుదయం నా హృదయం"

హాయిగనే ప్రకృతి హొయలు నందముగానే 

తీయగ తెలిపినది వినగ   

మాయగ వేకువలు నిలచు మామనసులలో.


Saturday 6 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 153

 

కందము: 

"అందాల రాణివే" నను

జెందక కవ్వించి సిగ్గు జెందగనేలా? 

అందగ రా! చెలి! యనుచు ప

సందుగ నాలాపమిడిన సరి గీతమహో!

  

Friday 5 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 152

 

కందము: 

ఆ "యెంతఘాటు ప్రేమయొ"

హాయిగ విన జాబిలి మలయానిలములవే

తీయని విరహము బెంచగ 

జేయును దరిజేరగ చెలి చెలికానికహా!





 

 


Thursday 4 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 151

 

కందము: 

"విరిసిన వెన్నెలవొ" నగవు

కరుణయె లేనట్టి శిలను కరగించుననిన్

మరిమరి తలచుచు చెలి! యె

వ్వరివో నీవనుచునడుగు పాటయె వహ్వా. 






Wednesday 3 July 2024

ఘంటసాల పాటల "కందాలు" - 150

 

కందము: 

ఆ"భారతీయుల కళా 

ప్రాభవమొలికించి" పద్య పాదములన్నిన్ 

భావము చక్కగ నొలుకుచు 

మావీనులనింపుచుండు మాధుర్యమునే.