గత 2023సం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "అచ్చంగా తెలుగు" గ్రూప్ వారు నిర్వహించిన పద్యాల పోటీ లో బహుమతి పొందిన పద్యములు.
అల్లూరి సీతారామరాజు
ఉత్పలమాల:
చేరి పరాయిపాలనను చిక్కిన జాతికి స్వేచ్ఛనీయగా
భారత మాత దాస్యమును బ్రద్దలు జేయగ బూనిరెందరో
వీరులు, వారిలోన ఘన విప్లవ వీరుడు తెల్గునేలపై
పోరుచు నేల రాలె గద, పుణ్య చరిత్రుడు రామరాజహో!
ఆటవెలది:
కట్టె నొంటిపైన కాషాయమును తాను
పట్టె విల్లుచేత పటుతరముగ
ఇట్టె రాజు నిలువ నిల మన్య ప్రజకు కన్
పట్టె పరశురామ భాతి నిజము.
కందము:
విల్లమ్ములు చేబూనిన
అల్లూరియె మదిని మెదల నదరుట మొదలై
"తెల్లోడి" గుండె జారుచు
నల్లాడుచు "సేవ్ మి" యనుచు నా "గాడ్" దలచున్.
ఉత్పలమాల:
దిక్కయి మన్నెపుంబ్రజల దీనత మాన్పగ, పోరు సల్పుచున్
పెక్కుగ నాయుధాలు తన పేర టపాలను పంపి దోచుచున్
చుక్కలు చూపినట్టి ఘన శూరుడు, రాజును జంపబూనుచున్
టక్కరి "రూథరూఫరు" "డెటాకు"ను జేయగ నెంచె మాటుగా.
కందము:
పడమటి సూర్యున కర్ఘ్యము
నిడు రాజుకు "దొంగ దొరలు" నెక్కిడి "గన్నుల్"
విడువగ తూటాల్, వీడెను
పుడమిని, తన కీర్తి వదలి మూసెను కన్నుల్.
No comments:
Post a Comment