తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 17 November 2026

మాటకారి అల్లుడు

 మాటకారి అల్లుడు


ఆటవెలది:
క్రొత్త పెళ్ళికొడుకు "గోపాల రామయ్య"
మంచి మాటకారి, మామగారి
ఇంటికేగె పెండ్లియేయైన పిదపను
మూడు నిద్రలకును మోదమలర.

మరదలితో సరసం
ఆ యింట భోజన సమయంలో మరదలు వేడి చారును వడ్డిస్తూ బావను ఆట పట్టించటం, దానికి బావ సమాధానం ఇలా ఉంది.

చంపకమాల:
మరదలు వేడి చారునట మంచిగ వడ్డన జేయ, "బావయా!
మరిమరి 'ఏడిశార'నెడు" మాటను జెప్పుచు, చారు బోయగా
"నరెయరె! ఆగు చారులత! ఆగక బోసిన నాకు 'కాలుగా'
సరిసరి చేతినెత్తగను, చప్పున తాకిన నేడ్తువే!" యనెన్.

బావ మరిదితో సరసం
బోజనానంతరం భుక్తాయాసంతో మంచంపై పడకసీనులో శ్రీకృష్ణునిలా పడుకొని ఉంటే తన బావమరిది తో జరిన సంభాషణ ఇలా ఉన్నది.

ఉత్పలమాల:
"బావయ! యేమిటీ పడక, బాగుగ కృష్ణుని వోలె నుండి మా
కీవిధమైన "సీను" నిట నిప్పుడు జూపితి వెహ్హెహే!" యనన్
"రావయ బావమర్ది! యిక రచ్చను జేయక, వేచియుంటి, నీ
వీవిధి కాళ్ళవైపొ మరి యేమని నాతల వైపొ రమ్మ"నెన్.

భార్యతో సరసం
రాత్రి పానుపుపైన చేరి తాంబూలము వేసుకొన్న పిదప ఆ భార్య అడిగినదానికి భర్త జవాబు.

కందము:
పండెన? నా నోరనగా!
పండెను నా నోరుగూడ, పండెద మికపై
పండుగ మనకీనాడే!
పండగ, నీ కడుపుగూడ పండులె, సఖియా!

సరసపు వీడ్కోలు
భార్యతో తిరుగు ప్రయాణమునకు బయలుదేరుతూ ఇలా అన్నాడు.

ఆటవెలది:
మరదలమ్మ! బావమరిదిరో! మనమిట్లె
మేలమాడుకొనుచు మేలుగాను
సతతముండవలయు సంతోషమందుచు
మరల వత్తుమింక, మాకు సెలవు.


No comments: