తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 1 July 2025

ఒక (నాటి) "పల్లెతనము"

 రవళి మాస పత్రిక (జులై 2025 ) లో ప్రచురింపబడిన నేను వ్రాసిన పద్యములు.


 సీ:

మట్టిమిద్దెల ఇళ్ళు  మండువా లోగిళ్ళు

పూరిళ్ళు డాబాలు చేరియుండు

ఇండ్లముందున దారి కిరువైపులందున    

అరుగులే వరుసగా  నమరియుండు  

ఊరికి బయటన నుండుగా సత్రమ్ము 

వచ్చువారికి  బస నిచ్చుచుండు  

గడ్డివాములు చొప్పకట్టల దొడ్లుండు

పెరడున కూరలే బెరుగుచుండు  

 

ఆ.వె: 

పచ్చనిపొలములవి పల్లె చుట్టుననుండు 

పండ్ల చెట్లు కొన్ని బరగుచుండు

దిగుడుబావి గూడ తీరుగానొకటుండు

ఇట్టి పల్లెజూడ నింపుగుండు.


సీ:

గిలక బావుల నుండి "గిలగిలల్" "గలగలల్" 

రేపుమాపులు సడి రేగుచుండు

కోళ్ళ "కొక్కొరకో"లు కుక్కల "భౌభౌ"లు

మేక గొఱ్ఱెల  "మే"లు మేలుగుండు   

ఆవు,దున్నలు, గేదె లాయెడ్ల కొట్టముల్  

అంబారవమ్ముల నలరుచుండు

ఊరపిచ్చుకలవి ఊరించు "కిచకిచల్" 

కాకుల "కాకా"లు కలసియుండు 


తే.గీ:  

రెండు పిల్లుల పోట్లాట రేగుచుండు

అరకనదలించు చప్పుళ్ళు హాయిగుండు  

వేకువందున దంపుళ్ళు వీనువిందు

ఊరునందున విన మది యూరుచుండు.  

   

సీ:  

కూడలిలోనొక్క గుడియొక్కటుండును  

రాముడందుననుండి రక్షజేయు

బొడ్రాయి యొక్కటి పొందికగానుండు 

పోలేరు తల్లియే పూజలందు 

పవన సుతుడు బైట ప్రహరిలో మధ్యన   

గుడిలేక నిలచుచు కుశలమిచ్చు 

విఘ్న నాథునిగూడి విశ్వేశు డొకచోట 

ఆలయమ్ముననుండి యభయమిచ్చు

ఆ.వె: 

కాలమునకు దగిన కల్యాణ కార్యముల్ 

ఊరిలోన జరుగు నుత్సవములు 

అందరచట గూడి యానందములుబొంది 

గ్రామమునను తృప్తి గలిగి యుంద్రు.   



No comments: