తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 13 April 2024

బాల రాముడు

 జికె తెలుగు టాకీస్ వారి ఖగేశ్వరి ఉగాది పురస్కారములు 2024 న  

ద్వితీయ బహుమతి పొందిన  పద్యములు.


అంశం: "నేటి అయోధ్యలో బాల రాముడు" 


ఆటవెలది: 

"మోడి" విడక ధర్మ పోరాటమే సల్ప 

"రామజన్మభూమి" రగడ దీరె     

వందలేండ్ల పిదప నందెగా న్యాయమ్ము   

మందిరమ్ము వెలసె నందముగను. 


మోడి=పట్టుదల 


కందము:

పాలకుడే లోకములకు

పాలకడలిని పవళించు పరమాత్ముండే 

పాలను ద్రావెడి ముద్దుల 

బాలక రూపమ్ము నచట బాగుగ నిలచెన్.


చంపకమాల: 

జననియు జన్మభూమియును స్వర్గముకంటెను గొప్పదన్న నా   

యినకుల భూషణుండు జగదీశుడు కొల్వయె నీ యయోధ్యయే 

తన నిజ జన్మభూమియని, ధన్యతనందిరి భక్తులెల్లరున్ 

మనముల "రామలల్ల మము మన్నన సేయు”మటంచు మ్రొక్కుచున్. 


ఉత్పలమాల: 

ఒద్దిక మందిరమ్ము ఘనమొప్పగ గట్టిరి గా యయోధ్యలో

ముద్దుల బాలరాము సరి మోమును జెక్కిరి సొంపుమీరగా  

పెద్దగ మంత్ర యంత్రబల విగ్రహ మచ్చట నిల్పినారహో

వద్దిక జాగు, సాగుడిక వానిని జూడగ జన్మ ధన్యమౌ. 


ఉత్సాహము:

వరగుణముల రాఘవుండు "బాలు" రూపు నిలువగా   

భరత భూమి సంతసించి భాగ్యమింక నాదనెన్  

త్వరితగతిని భక్తులార!  దర్శనమ్మునందరే! 

స్వరము బెంచి "రామ" యనుచు భక్తి భజన జేయరే! 


1 comment:

Anonymous said...

పద్యాలు బాగున్నాయి