తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 15 February 2024

అల"వాట్"సప్



కందము:  

గ్రీట్సులకున్ ముచ్చట్లకు 

మేట్సుల, కాఫీసులకును మేలగునిదియే 

హ్యాట్సాఫ్ నే చెప్పెదమిక 

“వాట్సప్” కే గ్రూపు గాను వందన మనుచున్.


సీసము:  

పంపగా వచ్చులే వాయిస్సు మెస్సేజి

సెల్ఫీలు మరియెన్నొ  చిత్రములను

చూపగా వచ్చులే ఛూజింగు వీడియోస్  

లైవులో ప్రోగ్రాము మూవి వోలె 

మాట్లాడ వచ్చులే మనవారితోగూడి 

కబురులెన్నేనియు కనులగనుచు 

దింపగా వచ్చులే దిక్కౌచు నేరికిన్  

కోరు లొకేషన్ను చేర బంపి 


తేటగీతి: 

నేర్వగా వచ్చు కళలను నేర్పవచ్చు   

మంచిగా జేరి  గ్రూపుల మనమె జేసి

చెప్పగా వచ్చు నేడికన్ సెల్లునందు       

గొప్ప మాధ్యమ"మాయె" వాట్సప్పునిజము.         


తేటగీతి: 

ఉప్పులేనట్టి కూరనే యొప్పుకొనును

అవసరమ్ముల కొన్నింటి నవతలిడును  

నొప్పులెన్నేని బాధించ నోర్చుకొనును

సైపలేడుర నరుడు వాట్సప్పు లేక.


కందము:

అలవాటైతే ప్రీతిగ       

నల వాట్సప్పును వదలరహా! స్మార్ట్  ఫోనున్   

గలవారలు, డే అండ్ నైట్      

కలవారలు లేనివారు  కనెద రడిక్టై.  

       

కందము: 

ఎన్నుచు మాయల మారులె  

నిన్నున్ బడవేసి వలను నిండుగ ముంచన్  

కన్నింగ్ ఛాట్లను జేతురు    

చిన్నా! అన్నోను కాల్సు ఛీ! ముట్టకుమా!   


తేటగీతి:

"గుడ్డుమార్నింగు" వద్దురా "గుడ్డునైటు"  

"టేస్టు" లేనట్టి పోస్టులు "వేస్టు" గదర! 

"ఎత్తిపోతల" పథకమ్ము నెత్తివేయి   

"సరస ఫలముల" బంచు వాట్సప్పు మేలు.    

 

 

No comments: