"రవళి" మాసపత్రిక రెండవ సంచిక (డిసెంబర్ 2023) నందు ప్రచురించబడిన నేను వ్రాసిన పద్యములు.
"గోలీ"లు
కందము:
శ్రీమంతుడ నాకేమని
ధీమాగా కష్టబడక తినికూర్చుంటే
ఆ మంచువోలె కరుగును
చీమంతగ మారు నీదు సిరులే గోలీ!
కందము:
పొటీలో గెలుపునకై
ధాటిగ యత్నించవలయు ధర్మంబుగనే
ఓటమి జెందిన గానీ
ఆటన్ సహజంబనుకొన నగురా గోలీ!
కందము:
వండే వంటలు శుచిగా
నుండంగను జేయవలయునుర శుభ్రతగా
"వండే" దాటిన పిదపను
మొండిగ “హీట్” జేసి తినగబోకుర గోలీ!
కందము:
తీయనిదౌ కంఠమ్మే
గాయకునకు నున్న సొగసు కాదులె, భాషన్
హేయముగా పలికి పరువు
దీయనిదౌ నటులనుంట దివ్యము గోలీ!
కందము:
సలుపుచు నుండుము ధర్మము
నిలలో బోరంగవలయు నిది చేయుటకై
సలుపులు కలిగినగానీ
మెలకువతో సైచి దాట మేలగు గోలీ!