తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 3 June 2023

"సిస్టర్" నర్స్

 12 మే 2023  ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా  అమరావతి సాహితీ పీఠం (శ్రీ రావి  రంగారావు గారు) గుంటూరు వారు నిర్వహించిన పోటీకి నేను పంపిన పద్యాలు.(ఈ బుక్ "తెల్లపావురాలు" లో ప్రచురించినారు)  


"సిస్టర్" నర్స్ 


కందము: 

దైవమె వైద్యుడు పుడమిని

దేవుని దూతలు నిజముగ తెలియగ నర్సుల్ 

సేవల జేయుచు రోగుల 

"చావక" బ్రతికించబూను "శక్తులు" వీరే.


ఆటవెలది: : 

చెల్లిగాని చెల్లి యెల్లరు నరులకు

అక్కగానియక్క యక్కరలకు 

సోదరీమెయగుచు "సో' దరి నిలచును

సిస్టరనగ తాప్రసిద్ధినొందె.


ఆటవెలది: 

పుట్టి కళ్ళు తెరచి పుడమి జేరుటనుండి

మట్టిలోన గలసి మడియు వరకు

నట్ట నడుమ జీవనమ్మున రుజలందు

సేవ జేయు మనల "సేవు" జేయు. 


తేటగీతి: 

మంచమున బడ తనవారు మరువ సేవ

సమయ మింతయు లేదని సణుగు వేళ

చెల్లి పోవుచు బంధముల్ చెడిన నాడు 

"చెల్లి" చూచును మనుజుల నొల్లననక. 


కందము: 

"సిస్టరు" సేవలు రోగికి 

"బూస్టరుడోసౌ"ను బ్రతుకు పొడిగింపంగా

"బెస్టు"ర రోగము దులుపగ  

"డస్టరు" తానౌను, చిన్న డాక్టరు తానౌ. 


కందము: 

ఆ "నర్సు" సేవ మరువక  

"ఆనర్సు"ను సలుపవలయు నవనిని వినరా!

"మేనర్సు" గలిగి నరులే 

"డోనర్సు"గ క్షేమమెంచుడు మరికనైనన్.




No comments: