తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 1 August 2022

"బొట్టు" పద్యములు.

 

తేటగీతి: 

శ్రీకరమ్మగు నుదుటన చిన్ని బొట్టు

హనుమ సిందూర మైనను , హరు విబూది,

విష్ణు కస్తూరి తిలకమ్ము వేడ్క మీరు.

అంబ కుంకుమ యతివల కంద మిచ్చు.


ఆటవెలది:

అడ్డబొట్టు జూడ నదియొక యందమ్ము

నిలువు బొట్టు గూడ కళగనుండు

చుక్క బొట్టు గనగ చక్కగ గనుపించు

మూడు గలిపి బెట్ట ముఖము నిండు.


తేటగీతి: 

దివ్య కాంతియె నీచుట్టు దిరుగునట్లు

తిలక మింతెైన చక్కగా తీర్చినట్లు

బెట్టు జూపక నుదుటన బొట్టు బెట్టు

దృష్టి దోషము లన్నింటి ద్రిప్పి కొట్టు.


తేటగీత్: 

నేల కందమ్ము తొలకరి నీటిబొట్టు

నింగి కందమ్ము చంద్రుని నిండు బొట్టు

ఆలి కందమ్ము మెడనుండు తాళిబొట్టు

ఉవిద కందమ్ము నుదుటన నుంచు బొట్టు 


తేటగీతి:   

చిన్నపిల్లలు పురుషులు స్త్రీలు గూడ

హిందువులె కాదు, ఎవరెైన బిందువంత

నుదుట దాల్చిన బొట్టును కుదురుగాను

ముఖము కనిపించు గాదె ప్రముఖము గాను.సీసము: 

విష్ణు పూజనుసల్పి వినయమ్ము తోడను 

నిలువు బొట్టును బెట్టు నిష్ట తోడ

భవుని మదిని దల్చి భయముల బోద్రోల  

భస్మ ధారణ సల్పు భక్తి తోడ

ఆంజనేయుని చెంత నాకుపూజను జేసి  

సిందూరమును దాల్చు శ్రీకరముగ  

అమ్మవారిని గొల్చి యఘములే నశియింప 

కుంకుమ నేదిద్దు కోరికోరి. 

ఆటవెలది:

అడ్డ నిలువు బొట్టు లదిగాదు ముఖ్యమ్ము  

బొట్టునుదుటనుంట పుణ్యప్రదము 

ఎరుపు తెలుగు రంగు లేవైన  మనకేమి 

పట్టుబట్టి పెట్టు బొట్టు నిట్టు.తేటగీతి: 

దూర ముగ సేయబోకు సిందూర బొట్టు 

కుంకుమను బొట్టు  బెట్టుట గ్రుంక నీకు 

బూదిలోన గలుపకు వీబూది బొట్టు 

మనదు సంస్కృతి నిలబెట్టు మరచి పోకు.


ఆటవెలది:

దోసగింజ బొట్టు దొడ్డగనే బెట్టు  

శనగగింజ బొట్టు సరిగ బెట్టు 

కాసు వంటి బొట్టు కనిపించగా బెట్టు 

ముఖము తగ్గ బొట్టు సుఖము - " ఒట్టు "  
No comments: