తెలుగు వాడనీకు
ఆటవెలది:
శివుని డమరుకమ్ము చిత్రమ్ముగా మ్రోగ
అక్షరమ్ము లన్ని యవని వెలసె
శబ్ద భేద మరసి చక్కగా నన్నింటి
నేర్వ వలయు వదల నేరమగును
కందము:
అచ్చులు హల్లులు మొత్తము
ముచ్చటగా నేబదారు, బుధ్ధియె లేకన్
హెచ్చగునని సరి నేర్వక
కచ్చగ తగ్గించినావు కఠినాత్ముడవే.
ఆటవెలది:
తల్లి పోలిక గల తనయరా మన భాష
తల్లి సంస్కృతమ్ము తనయ తెనుగు
అన్య భాష జూడ నాలి వంటి దదియె
బెల్ల మాయె తల్లి యల్ల మాయె.
ఆటవెలది:
సంస్కృతమ్ము నేర్వ చాదస్త మని యంద్రు
తెలుగు మాటలాడ తెగులనంద్రు
ఇంగిలీసు బలుక ' ఇంటలీజెం ' టంద్రు
పుల్లకూర రుచియె పొరుగు దైన.
ఆటవెలది:
ఆంగ్ల భాష లోని "ఆల్ఫబెట్ల" న్నియు
నాల్గు బడులు నేర్చి నడకతోనె
ఆంధ్ర భాష కున్న యక్షరంబులు కొన్ని
తొలగ జేసి మదిని తొలుతు వేల.
ఆటవెలది:
అక్షరమ్ము లన్ని యక్కరగా నాల్గు
బడులు నేర్వ వలయు, పదము లేమొ
వ్రాయుటొకటి వాని పలుకు వేరొక్కటి
బరువు తోచ లేదె పరుల భాష?
ఆటవెలది:
*చావు* *చదువు* లేమొ 'చావు' 'చదువు' లాయె
*జంకు* *జంట* లాయె 'జంకు' 'జంట'
అక్షరమ్ము వ్రాయ నసలది లేకున్న
వ్రాయుటెట్లు దాని పలుకుటెట్లు.
తేటగీతి:
బడిని నేర్పగ గొప్పగా పరుల భాష
‘తెలుగు లెస్సన్న’ రోజులే తేలిపోయె
వ్రాయ చదువగ నేర్వరే భావి యువత
తెలుగు ‘లెస్సాయె’ భాషయే తెల్ల బోయె.
ఆటవెలది:
తెలుగు వెలుగు లీనె దేశంబు వెలుపల
మసక బోవునటుల మసలబోకు
తెలుగునేల మరచి తిరుగు చుండెదవేల?
విలువ గలదె నీకు తెలుగు నేల.
సీసము:
తెలుగు భాష రుచిని తెలియగా నిటులుండు
అమ్మ పెట్టెడి "ళుళు ళాయి" ముద్ద
వత్సరాదిన తిను పచ్చడి రుచియును
స్వామి రామ నవమి పానకమ్ము
ముద్దపప్పు గలుప మురిపించు గోంగూర
అన్నమాయిలలోన నావకాయ
పుణ్య తిథులలోన బులిపించు పులిహోర
భారత రుచిమించు గారె ముక్క
ఆటవెలది:
అక్షరమ్మువంపు లనిననోటికి సొంపు
చెవుల వినగ నింపు చవుల నింపు
సంపదనుచు దీని సలుపుమా సరిపెంపు
విలువ లేని పనులు విడుచు కంపు.
కందము:
ఘనమైన కవివరేణ్యులు
తెనుగును వెలిగించినారు దేదీప్యముగా
మనమే మన మన మనముల
విను దీక్షను బూని మిగుల వెలుగీయ వలెన్.
సీసము:
నన్నయార్యుల నోట నాటలాడిన భాష
తిక్కనాదులు పంచె తీపి భాష
శ్రీనాథ కవి దిద్దె సింగారముల భాష
పోతన్న గంధంపు పూత భాష
రాయలేలిన నాడు రాటుదేలిన భాష
భువన విజయ మందు కవన భాష
గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
విశ్వనాథుని కల్పవృక్ష భాష
ఆటవెలది:
లాలి పాట పాడి లాలించి పాలించి
అమ్మనేర్పినట్టి యమృత భాష
తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
చేయి తలను నిలిపి చేయి బాస.
కందము:
పద్యం బవధానంబులు
గద్యంబులు భావయుక్త గానము వినగా
హృద్యంబగు శ్రోతలకే
చోద్యంబగు తెనుగున'కవి' శోభను గూర్చున్
ఆటవెలది:
తెలుగు వాడలోన తెలుగు వాడని వాడ!
తెలుగు వాడ! నీకు తెలివి గలదె ?
తెలుగు వాడనీకు తెలుగు వాడిని జూపి
తెలుగు వాడి, పెంచు తెలుగు వాణి.
No comments:
Post a Comment