తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 31 May 2017

రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.


కందము: 
రణమే కనుడిది సరి ప్రే 
రణమును తానీయ గురుడు రంజిలునటు ధా
రణమంది సమస్యా పూ 
రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

Tuesday, 30 May 2017

ఫాల్గుణమున దీపావళి పండుగ కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఫాల్గుణమున దీపావళి పండుగ కద.



తేటగీతి: 
రాముడనదేవుడేగద, రాజధాని 
హస్తినాపురమేగద, హాస్యమొక్క 
రసము గాదామరియు శిశిరమ్ము గాద   
ఫాల్గుణమున, దీపావళి పండుగ కద. 

Monday, 29 May 2017

రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.



కందము: 
పాకీల పారద్రోలగ 
దూకిన మన సైనికుండు దుర్ మృతినొందన్ 
వ్యాకులత నెలత కన్నీ 
రై, కనువిప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.

Friday, 26 May 2017

నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్. 



మత్తేభము: 
వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్ 
సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో 
నొడిలో పుస్తకముంచివ్రాయ రవి,  తా ' మో ' యంచు ధారాగతిన్ 
నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.


తాము (ఓ) యంచు   
ఉత్పలములు = ఉత్పలమాలా వృత్తములు.

Thursday, 25 May 2017

సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.



కందము:
కోతలరాయుడు జెప్పెను
ప్రీతిగ నేభాగవతము పిప్పిని జేస్తిన్
తాతా !వినుమాయందున
సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.

Tuesday, 23 May 2017

అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.


కందము: 
రంగముపై శివరాత్రిని 
జంగమదేవరలవోలె శంకర యనుచున్ 
లింగని రూపము స్పటిక శు 
భాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.

Sunday, 21 May 2017

జారుల మాటలను వినని జాతి నశించున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జారుల మాటలను వినని జాతి నశించున్.


కందము: 
దూరముగ బెట్టమందురు  
కోరుచు సత్పురుషులెల్ల, ఘోరమొనర్చే
క్రూరుల,జూదరులను మరి  
జారుల, మాటలను వినని జాతి నశించున్.

Saturday, 20 May 2017

రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.


కందము: 
ఆంధ్రుడ శతకమ్మిట సై
రంధ్రీ! యని వ్రాసినావురా పద్యములన్ 
ఆంధ్ర నిఘంటువు వెదకెద  
రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

Thursday, 18 May 2017

పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.


కందము: 
మేలుగ నీరే పారగ 
కాలువనేతీయ తండ్రి గబగబ వెడలెన్
వీలగు వస్తువులివి గున 
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

Wednesday, 17 May 2017

విదియ నేడు వచ్చె విజయ దశమి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - విదియ నేడు వచ్చె విజయ దశమి.


తొమ్మిదవరోజు ఊరికి వెళ్తానంటున్న కూతురుతో తల్లి. 

ఆటవెలది: 
వినుమ వెడల రాదు వెనుక వచ్చిన యూరు
తొమ్మిదవదినమ్ము తొందరేల 
నేనుచెప్పుచుంటి, నీవువచ్చినరోజు 
విదియ,నేడు వచ్చె విజయ దశమి. 

Tuesday, 16 May 2017

అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు


తేటగీతి: 
ప్రక్కనిద్దరుపురుషులు బరగ నిలువ
టీవి సీర్యలు నటిజెప్పె ఠీవిగాను 
మందమతియను నాటకమందు జూడ 
నతఁడు నా పతి, మఱి మగఁ డౌ నితండు. 

Monday, 15 May 2017

మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.


తేటగీతి: 
మేఘనాధుడు దాగగా మేఘమందు 
గురినిజూచుచు సౌమిత్రి చురుకుగాను 
శిరముద్రుంచగ శరముతో, జివ్వుమనుచు 
మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

Sunday, 14 May 2017

కవియే మఱి పతనమునకు కారణమగురా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కవియే మఱి పతనమునకు కారణమగురా. 


కందము: 
భువిలో నెవ్వడును పరుల
యువిదల సంపత్తుగోరు టొప్పనితనమే 
చెవినివి బెట్టనిచో మన 
కవియే మఱి పతనమునకు కారణమగురా. 

Saturday, 13 May 2017

నకులుఁజంపె రామ నరవిభుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - నకులుఁజంపె రామ నరవిభుండు.



ఆటవెలది: 
బాధబెట్ట సురల భార్యనే చెఱబట్ట
చెప్ప హితమును పెడ చెవిని బెట్ట 
బ్రహ్మ హత్య యయ్యు రావణాధిపు డహీ 
న కులుఁజంపె రామ నరవిభుండు.

Wednesday, 10 May 2017

జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.   



ఆటవెలది: 
మంచి 'క్రాపు ' కొరకు "మంగలి"  నేబిల్చి
కత్తిరించమనుచు కాపు చెప్ప 
నీరుజల్లి తలను నిమురుచు దువ్వెనన్ 
జుట్టు లేని "వాడు"  జుట్టు దువ్వె.   

Tuesday, 9 May 2017

పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణసుతుఁడే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణసుతుఁడే.



కందము: 
పద్మారావ్ మాయబ్బాయ్ 
బద్మాషులు కొంతమంది బాధలు వెట్టన్ 
ఛద్మమునే చేదించుచు 
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ!సుతుఁడే.

Monday, 8 May 2017

ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే



చంపకమాల: 
ధృవుడనుబాలుడే భువిని తిట్టగ తల్లియె పట్టునన్ రమా 
ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు, వింటిరే!
భువిని మృకండుసూనుడు యముంగెలిచెంగద బాలుడై యుమా 
ధవుని పదమ్ములన్ గొలిచి, ధన్యత గాంచె నతండు వింటిరే! 


Saturday, 6 May 2017

వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్. 


కందము: 
వడ్డీకాసులవాడట 
వడ్డించును కామితములు భక్తులకొరకై 
దొడ్డగ కుబేరు ఋణమున 
వడ్డీ చెల్లింప లేడు, వర్షించు సిరుల్. 

Friday, 5 May 2017

తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చె నయో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చె నయో.


కందము: 
జనులకు మందును బోసెను
ఘనముగనే డబ్బుబంచె కట్టలుగనెల 
క్షనులో, చివరకు నొకనూ 
తన పార్టీ గెల్చినంతఁ దా నేడ్చె నయో.

Thursday, 4 May 2017

పడతి నాతిని పెండ్లాడ వలెను వలచి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పడతి నాతిని పెండ్లాడ వలెను వలచి.


తేటగీతి: 
ఈడువచ్చిన యువకుడు వీడులోన 
తిరుగకుండగ నాబోతు తీరుగాను 
సంప్రదాయమ్ము నిలబెట్టు సఖిని,సుదతి 
పడతి, నాతిని పెండ్లాడ వలెను వలచి.

Wednesday, 3 May 2017

రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.


కందము: 
మామనుమరాలు మనుమం 
డేమాత్రము సైపబోరు యెవరల్లరి, యో 
మామా! విద్యార్థులకట 
రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

Monday, 1 May 2017

తల్లీయని పిలుచెనంట తండ్రిని సుతుడే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లీయని పిలుచెనంట తండ్రిని సుతుడే. 



కందము: 
పిల్లలు లవకుశులచ్చట 
నొల్లక యశ్వమ్మునీయ నుద్ధతితోడన్ 
అల్లనరాముడు రాగా 
తల్లీ! యని పిలుచెనంట తండ్రిని సుతుడే. 

అని = యుద్ధము.